విశాఖ సాగర తీరంలో రాళ్ల గుట్టల మధ్య చిక్కుకొని ఓ యువతి నరకయాతన అనుభవించింది. ఏకంగా 23 గంటలు గడిచిపోయింది. రక్షిస్తాడనుకున్న ప్రియుడు మళ్ళీ రాలేదు. ఆ యువతికి సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. దువ్వాడ పోలీసుల సమాచారం మేరకు.. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన యువతి (19), పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఫణివర్మ(21) కుటుంబాలు అయిదు నెలల కిందట శిర్డీయాత్రకు వెళ్తుండగా.. రైలులో పరిచమయ్యాయి. ఆ తర్వాత యువతి, ఫణివర్మ ఇన్‌స్టాగ్రాం ద్వారా మరింత దగ్గరయ్యారు. గత నెల 29న ఇద్దరూ కలిసి విశాఖ వచ్చి గోపాలపట్నం లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. ఈ నెల 2న అప్పికొండ, గంగవరం తీరాల్లో పర్యటించారు. 4, 5వ తేదీల్లో అరకు వెళ్లి, 6వ తేదీన తిరిగి గోపాలపట్నం లాడ్జికి చేరుకున్నారు. 8న అప్పికొండ తీరానికి వెళ్లి మధ్యాహ్నం 3 గంటల వరకు సరదాగా గడిపారు.
సెల్ఫీ తీసుకునే క్రమంలో జారిపోయి...
అప్పికొండ తీరంలోని కొండపైకి చేరుకుని సెల్ఫీ తీసుకునే క్రమంలో యువతి కాలుజారి పడి సముద్రంలోని రాళ్ల మధ్యలో చిక్కుకుపోయింది. ఎంతగా ప్రయత్నించినా రక్షించే అవకాశం లేకపోవటంతో, తన స్నేహితులను తీసుకొస్తానని చెప్పిన ఫణివర్మ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఎంతకీ ఫణివర్మ రాకపోవడంతో పాటు, కనుచూపు మేరలో రక్షించే వారు లేక ఆ యువతి సుమారు 23 గంటల పాటు నరకయాతన అనుభవించింది. 9వ తేదీ మధ్యాహ్నం కొండపైకి వెళ్లిన వారికి యువతి కేకలు వినిపించాయి. వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా... రాళ్ల మధ్య ఇరుక్కుని వేలాడుతున్న బాధితురాలిని గుర్తించి బయటకు తీసుకొచ్చారు. నడవలేని స్థితిలో, పూర్తిగా నీరసించిపోయిన యువతిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. కాలుజారి పడిపోయానని, పరారీలో ఉన్న యువకుడిని ఏం అనవద్దని ఆమె చెబుతోంది. అంబులెన్సు సిబ్బంది యువతి తల్లికి సమాచారమివ్వగా.. తాము విశాఖ బయలుదేరి వస్తున్నట్లు పేర్కొన్నారు. కుమార్తె కనపడటంలేదని బందరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు యువతి తల్లి తెలిపారు. కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు బందరు పీఎస్ నుంచి అంబులెన్స్ సిబ్బందికి సమాచారమిచ్చారు. దువ్వాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పరారీలో ఉన్న యువకుడికి ప్రమాదం జరిగిందని, అతను కూడా కేజీహెచ్‌లో ఉన్నట్లు సమాచారం.