విజయవాడలోని విద్యాధరపురం ఏరియాలోని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ (డీఎస్‌ఎంసిహెచ్)లో 1992 - 93 వ విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం అదే పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుమారు 32 ఏళ్ల తర్వాత అందరూ ఒక్కచోట కలిపి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరినొకరు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 60 మందికి పైగా వివిధ రంగాల్లో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న అందరూ ఒక చోట చేరటంతో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నాటి గురువులు విశ్రాంత ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, రామరాజు, అన్నవరపు బాబురావు, శోభనాచలపతిరావు, ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాజీని పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దాది మహేష్, ముజీబ్ పాషా, అన్నవరపు మురళి, గోమతోటి వినోద్‌పాల్, కె. నాగరాజు, ఆర్.శ్రీను, జి. శ్రీను మరియు టి.కె.ఎన్.వి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పండుగ వాతావరణంలో ఆత్మీయ కలయిక !
ఇన్ని సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల కలయికతో పాఠశాల ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది. తమ చిన్ననాటి స్మృతులు, పాఠశాలలో అనుభవాలను పూర్వ విద్యార్థులు స్మరించుకున్నారు. విద్యాభ్యాసం నాటి జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యతో పాటు మంచిచెడులు బోధించిన ఉపాధ్యాయులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమకు విద్యను బోధించి జీవితాలను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. జీవితంలో మరింతగా ఎదగాలని, సమాజానికి మేలు చేయాలని ఉపాధ్యాయులు తమ విద్యార్థులను ఆశీర్వదించారు. పాఠశాలకు తమ వంతుగా భవిష్యత్తులో సాయం అందించేందుకు పూర్వ విద్యార్థులు నిర్ణయించారు.