JEE MAIN 2026 RESULTS : జేఈఈ మెయిన్ ఫలితాల విడుదల

0

  • ముగ్గురు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్ !

జేఈఈ మెయిన్ 2026 తొలి సెషన్ ఫలితాలు సోమవారం (ఫిబ్రవరి 16) సాయంత్రం విడుదలయ్యాయి. ఎన్టీయే ఈ మేరకు ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జేఈఈ మెయిన్ తొలి విడత పేపర్ 1 పరీక్ష రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలను నమోదు చేసి స్కోర్ తెలుసుకోవచ్చు. తాజా ఫలితాల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 12 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోరుతో అదరగొట్టారు. ఇందులో  ముగ్గురు తెలుగు విద్యార్థులు వంద పర్సంటైల్ స్కోరుతో సత్తా చాటారు. ఏపీ నుంచి నరేంద్రబాబు గారి మహిత్, పసల మోహిత్ అనే ఇద్దరు విద్యార్ధులు, తెలంగాణ నుంచి వివాన్ శరద్ మహిశ్వరి 100 పర్సంటైల్ సాధించారు. జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్ పేపర్ 1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 13.50 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో దాదాపు 95 శాతం మంది పరీక్షలు రాశారు. జనవరి 29న జరిగిన పేపర్ 2 పరీక్ష ఫలితాలు త్వరలోనే విడుదల చేస్తారు.

మరో అవకాశం 

ఇక జేఈఈ మెయిన్ మలి విడత పరీక్షలపై విద్యార్ధులు ఫోకస్ పెట్టనున్నారు. తొలి విడతలో సరైన స్కోర్ సాధించలేని విద్యార్ధులు నిరాశ చెందకుండా మలి విడతకు దరఖాస్తు చేసుకుని మరోమారు రాసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమైనాయి. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఫిబ్రవరి 25, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ సెషన్ 1 రిజిస్ట్రేషన్ సమయంలోనే సెషన్ 2కి కూడా దరఖాస్తు చేసిన వారు ప్రత్యేకంగా మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో ఎన్టీయే నిర్వహించనుంది. సెషన్ 2 ఫలితాలు విడుదలైన తర్వాత రెండు సెషన్లకు కలిపి ఆల్ ఇండియా ర్యాంకులను ఎన్టీయే ప్రకటిస్తుంది. ఇందులో తొలి 2.50 లక్షల మంది ర్యాంకర్లకు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది.

ఉత్తమ స్కోర్‌కి ప్రాధాన్యం !

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 23 నుంచి మొదలవుతాయి. అంటే ఈ తేదీలోపు జేఈఈ మెయిన్ సెషన్ 2 ర్యాంకులు వచ్చేస్తాయన్నమాట. మే 17వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష ఉంటుంది. ఈ రెండింటిలో ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని విద్యార్థులకు ర్యాంకులను కేటాయిస్తారు. ఈ స్కోర్ ఆధారంగా దేశంలోని 23 ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఈసారి ఐఐటీ రూర్కీ జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 పరీక్ష నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తుంది. ఆ తర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2.50లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హత కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్ ద్వారా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తుంటారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !