VIZAG: SSC డెవలపర్స్ ఘరానా మోసం: రూ. కోట్లలో మనీ సర్క్యులేషన్ దందా !

0

ఈ సంస్థ తమను తాము “మీ నమ్మకమైన రియల్ ఎస్టేట్ భాగస్వామి”గా పేర్కొంటూ, కొనుగోలు, విక్రయం, పెట్టుబడుల విషయంలో మార్గనిర్దేశం చేస్తామని చెబుతోంది. అయితే, మొత్తం పత్రంలో కంపెనీ CIN, LLPIN, RERA నంబర్, కార్యాలయ చిరునామా, డైరెక్టర్ల వివరాలు, ప్రాజెక్టు వివరాలు, లేఅవుట్ అనుమతులు వంటి ప్రాథమిక చట్టబద్ధమైన వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరచటకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. రియల్ ఎస్టేట్ పేరుతో అమాయక ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయల దందాను నడిపిస్తున్న ఎస్.ఎస్.సి. డెవలపర్స్ అక్రమ సామ్రాజ్యంపై ‘ప్రత్యేక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట’ దిగ్భ్రాంతికర వాస్తవాలను వెలికితీసింది. పైకి ప్లాట్లు, నిర్మాణాల కంపెనీగా రంగుల ప్రపంచాన్ని చూపిస్తున్న ఈ సంస్థ, లోపల మాత్రం ప్రమాదకరమైన మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) / చైన్ స్కీమ్‌తో వేలాది మంది అమాయక ప్రజలను ఊబిలోకి లాగుతోంది.

భూముల విక్రయం కాదు, ఇది పక్కా డిపాజిట్ దోపిడీ!

సాధారణంగా రియల్ ఎస్టేట్ సంస్థలు స్థలాలు, నిర్మాణాలపై అమ్మకాలు మరియు రిజిస్ట్రేషన్లపై పనిచేస్తాయి. కానీ ఎస్.ఎస్.సి.డెవలపర్స్ బ్రోచర్లను పరిశీలిస్తే ఇది రియల్ ఎస్టేట్ కంపెనీ కాదని, చట్టవిరుద్ధమైన మనీ కలెక్షన్ సెంటర్ అని స్పష్టమవుతోంది. బేసిక్ ప్యాకేజీ: రూ.10,000, అడ్వాన్స్ ప్యాకేజీ: రూ.1,00,000, ప్రీమియం ప్యాకేజీ: రూ.10,00,000, ‘గోల్డ్ కాయిన’ ప్యాకేజీ: పేరుతో కోట్లాది రూపాయలు పెట్టుబడుల పేరుతో డిపాజిట్లు సేకరిస్తోంది. ఏ అనుమతి లేకుండా ప్రజల నుండి ఈ తరహా డిపాజిట్లు సేకరించడం తీవ్రమైన ఆర్థిక నేరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

నమ్మశక్యం కాని రాబడులు... పొంజీ మార్క్ మాయాజాలం !

ఈ కంపెనీ బాహాటంగా ఇస్తున్న హామీలు ఏ ఆర్థిక రంగానికి సాధ్యంకాని, అలవికాని రాబడులు అని స్పష్టం అవుతోంది. పెట్టుబడిపై వారానికోసారి 1% రాబడిని చెల్లింపులు చేస్తాం, అలాగే పెట్టుబడిని రెట్టింపు చేస్తాం అంటూ అలవికాని హామీలను గుప్పిస్తోంది ఎస్.ఎస్.సి.డెవలపర్స్. అలాగే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 200 రోజుల పాటు రోజుకు 0.5% రాబడి వస్తుందనే అంకెల గారడీతో మభ్యపెడుతున్నారు. ఏడాదికి బ్యాంకులు 6%-7% వడ్డీ ఇవ్వడానికే సతమతమవుతుంటే, వీరు వందల శాతంలో లాభాలు ఎలా ఇస్తారో చెప్పకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగిఉందని స్పష్టమవుతోంది. ఇది పక్కాగా కొత్తగా చేరే వారి డబ్బులతో పాతవారికి చెల్లింపులు జరిపే ‘పొంజీ స్కీమ’ తరహా వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

నెట్‌వర్క్ మార్కెంటింగ్ మాయాజాలం.. రిక్రూట్‌మెంటే లక్ష్యం!

ఈ కంపెనీకి భూములు అమ్మడం కన్నా, కొత్త కస్టమర్ల నుండి డబ్బులు గుంజడమే పరమావధి అని తెలుస్తోంది. కొత్తవారిని తీసుకొస్తే 5% డైరెక్ట్ కమిషన్‌గా ఇస్తామంటూ ఆశల వల విసురుతోంది. మిగిలిన సొమ్మును లెవల్ 1 నుండి 15 వ స్థాయి వరకు పర్సంటేజీల లెక్కన పంచిపెడతారు. ప్రతీ లెవల్ ఆదాయం అన్‌లాక్ కావాలంటే తప్పనిసరిగా కొత్త రిక్రూట్‌మెంట్లు చేయాల్సిందే అనే ప్రమాదకరమైన ఉచ్చు బిగించారు.

ఏజెంట్లకు కార్లు, బంగారం, అపార్ట్‌మెంట్‌ల ఎర

నెట్‌వర్క్ ఏజెంట్లను గుడ్డిగా ఉసిగొల్పి ప్రజలను ముంచేందుకు లగ్జరీ గిఫ్ట్‌లను ఆశగా చూపారు. రూ.10 లక్షల బిజినెస్ చేస్తే రూ. 30,000 నగదు లేదా వెండి, రూ. 50 లక్షల బిజినెస్ చేస్తే ఐఫోన్ లేదా రూ.1.20 లక్షలు. రూ.1 కోట్ల నుండి రూ.3 కోట్లు చేస్తే కార్ లేదా డౌన్ పేమెంట్.రూ.10 కోట్ల బిజినెస్ చేస్తే ఫ్లాట్/అపార్ట్‌మెంట్ లేదా రూ. 30 లక్షల క్యాష్ బహుమతులుగా అందించనుంది కంపెనీ. ఇన్ని పర్సంటేజ్ ఏజెంట్లకు కమీషన్‌గా పోతే కస్టమర్లకు రెట్టింపు సొమ్మును ఎలా ఇవ్వగలరు అనే విషయం ఆలోచిస్తున్నారా ? వీరికి ఎలాంటి ల్యాండ్ బ్యాంక్ లేదు, ఎలాంటి వ్యాపారాలు లేవు, అందరూ చెప్పినట్లే షేర్ మార్కెట్‌లో పెట్టుబడి అని చెబితే షేర్ మార్కెట్ గురించి అవగాహనే లేదు. మోసాల పునాదుల మీద గాలిమేడలు కడుతున్న కంపెనీ ఇది.

లీగల్ ఆధారాల్లేవు... పారదర్శకత అంతకన్నా లేదు !

కంపెనీ నియమ నిబంధనలు పూర్తిగా కస్టమర్లను పూర్తిగా లూటీ చేసే విధంగా ఉన్నాయి. “ప్లాన్ మార్పులపై కంపెనీకి పూర్తి హక్కులు ఉన్నాయి” అని ముందే రాసుకున్నారు. రేపు బోర్డు తిప్పేసినా అడిగే హక్కు లేకుండా చేసిన పన్నాగమిది. ఎలాంటి నగదు ఉపసంహరణలు చేసిన నేరుగా 10% కోత విధించి చెల్లిస్తారు. ఎందుకు అనేది వివరించలేదు. RERA అనుమతి సంఖ్య లేదు, CIN లేదు, GST లేదు. SEBI/RBI నిబంధనలను బొందపెట్టారు. వెబ్‌సైట్‌లో ఫోన్ నంబర్, కనీస అడ్రస్ లేకపోవడం ఈ సంస్థ ఎంత డేంజర్ సంస్థో చాటిచెబుతోంది.

నిపుణులు ఏమంటున్నారు

ఒక మాజీ ఆర్థిక నేరాల దర్యాప్తు అధికారి పేరు వెల్లడించకూడదనే షరతుతో మాట్లాడుతూ “రియల్ ఎస్టేట్ కంపెనీకి అవసరమైన ప్రాజెక్టు వివరాల కంటే, రిఫరల్ ఆదాయం మరియు ROIపై ఎక్కువ దృష్టి ఉంటే, అది తప్పనిసరిగా పరిశీలించాల్సిన అంశం.”

మరో చార్టర్డ్ అకౌంటెంట్ వ్యాఖ్యానిస్తూ “2X, 3X వంటి హామీలకు ఆర్థిక ఆధారం, ఆడిటెడ్ స్టేట్మెంట్లు, క్యాష్ ఫ్లో వివరాలు లేకపోతే పెట్టుబడిదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.”

విశాఖలో ‘నయవంచక ముఠా’, బయటపడ్డ దిగ్భ్రాంతికర కోణం!

విశాఖ కేంద్రంగా బుడారి లక్ష్మణ్, పొట్నూర్ రమేష్, టీవీఆర్ మూర్తి (మార్కెటింగ్) అనే వ్యక్తులు ఈ అక్రమ సామ్రాజ్యానికి సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. వెబ్‌సైట్‌లో తమకు 1500 ఎకరాల ల్యాండ్ బ్యాంక్, 150 కన్‌స్ట్రక్షన్ సైట్స్ ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయి పరిశోధనలో ఇవన్నీ ఇతరుల ఆస్తులని, వాటిని తమవిగా చూపిస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని తేలింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే వీరు రూ. 5 నుండి రూ.6 కోట్ల వరకు ప్రజల నుండి వసూలు చేశారు. అయితే ఇప్పటివరకు ఒక్క సెంటు భూమిని గానీ, ఒక్క అపార్ట్‌మెంట్‌ను గానీ ఏ ఒక్క కస్టమర్‌కూ రిజిస్ట్రేషన్ చేయకపోవడం గమనార్హం. ఈ కంపెనీ ఇప్పటికే 300 నుండి 400 మంది అమాయకులు ఈ మాయగాళ్ల వలలో చిక్కుకున్నారు. వ్యాపారం లేకుండా, భూమి లేకుండా కేవలం మనీ సర్క్యులేషన్‌తో నడుస్తున్న ఈ స్కీమ్ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉంది.

చట్టపరమైన హెచ్చరిక

అనుమతులు లేకుండా మల్టీ లెవల్ మార్కెటింగ్ లేదా అధిక వడ్డీ ఆశ చూపి డిపాజిట్లు సేకరించడం ‘ది ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) యాక్ట్, 1978’ ప్రకారం శిక్షార్హమైన నేరం. బాధితులు వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌తో పాటు సైబర్ క్రైమ్ విభాగాలకు ఫిర్యాదు చేయాలని, రియల్ ఎస్టేట్ పేరిట పెట్టుబడులు పెట్టేముందు RERA, MCA, SEBI ధృవీకరణలను పరిశీలించుకోవాలని హెచ్చరిస్తున్నాం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !