Cyber Crime : సైబర్ నేరగాళ్ళతో సాప్ట్‌వేర్ ఉద్యోగుల విలవిల !

0

ఆశ మనిషి విచక్షణను చంపేస్తుంది. భారీ లాభాలతో ఒక్కసారిగా కోటీశ్వరులు కావాలనే ఆశపై కొందరికి నిలువు నీడలేకుండా చేస్తోంది. ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని విధాలుగా గైడెన్స్ చేసిన మోసపోయేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. సైబర్ నేరగాళ్ళు రోజురోజుకి కొత్త రకం మోసాలతో జనాన్ని మభ్యపెడుతూనే ఉన్నారు. 

మాయమాటలతో వంచించి

స్టాక్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే లాభాలు భారీగా వస్తాయంటూ మాయమాటలతో వంచించి.. వేర్వేరు ఉదంతాల్లో సైబర్‌ నేరగాళ్లు ఇద్దరి నుంచి రూ.కోట్లు కొల్లగొట్టారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌(44) నుంచి రూ.2.14 కోట్లు కొట్టేశారు. బాధితుడి ఫిర్యాదుతో సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అతనితో సైబర్‌ నేరగాళ్లు గతఏడాది డిసెంబరులో సోషల్ మీడియా ద్వారా ఓ మహిళలా పరిచయం పెంచుకున్నారు. తాను స్టాక్‌ ట్రేడింగ్‌ ద్వారా బాగా లాభాలు సంపాదిస్తున్నట్లు ‘ఆ మహిళ’ మాయమాటలతో నమ్మించింది. అనంతరం సైబర్‌ నేరగాళ్లు ఓ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించి రిజిస్ట్రేషన్‌ చేయించారు. డిసెంబరు 12న తొలిసారి రూ.31.5 లక్షలు పెట్టుబడిపెట్టగా లాభాలు చూపించారు. మరిన్ని పెట్టుబడులు పెడితే లాభాలు ఎక్కువగా వస్తాయని చెప్పగా.. అతను రెండోసారి రూ.42.27 లక్షలు బదిలీ చేశారు. డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా, లాభంలో 30% పన్ను యూఏఈ ప్రభుత్వానికి కట్టాల్సి ఉందని, మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సూచించారు. యాప్‌లో వర్చువల్‌గా కనిపించే లాభాలను నమ్మిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. ఆఫీసులో తోటి ఉద్యోగుల నుంచి రూ.90 లక్షల రుణం తీసుకుని పంపారు. కుటుంబసభ్యుల దగ్గర నగదు తీసుకోవడంతో పాటు కొన్ని ఆస్తులు అమ్మి మొత్తంగా 8 దఫాల్లో రూ.2.14 కోట్లు పంపారు. అయితే డబ్బు విత్‌డ్రా కోసం ప్రయత్నించగా, అదనంగా రూ.68 లక్షలు కట్టాలని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించారు. ఆ ‘మహిళ’ ఫొటోను ఇంటర్నెట్‌లో వెతగ్గా, ఓ సోషల్ మీడియా ప్రొఫైల్‌ నుంచి సేకరించినట్లు తేలింది. ఈ మేరకు నకిలీ ప్రొఫైల్‌ సృష్టించి మోసం చేసినట్లు తెలుసుకొని సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు. 

ముందు రూ.10 వేల పెట్టుబడి పెట్టించి

మరో ఐటీ ఉద్యోగి రూ.1.40 కోట్లు పోగొట్టుకున్న ఉదంతమిది. కూకట్‌పల్లి వివేకానందనగర్‌కు చెందిన అతను సోషల్ మీడియా ద్వారా టేడింగ్‌ నైపుణ్యం గురించి వచ్చిన ప్రకటన చూశారు. అందులోని ఫోన్‌ నంబర్లను సంప్రదించగా.. ప్రొఫెసర్‌ దిలీప్‌ కుమార్, జయాసింగ్‌ పేరిట ఇద్దరు పరిచయమయ్యారు. అతనితో ఒక యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించి.. తొలిసారి రూ.10 వేల పెట్టుబడి పెట్టించారు. లాభం రావడంతో నమ్మిన ఐటీ ఉద్యోగి గతఏడాది అక్టోబరు నుంచి డిసెంబరు వరకు రూ.1.40 కోట్లు బదిలీ చేశారు. లాభాలొస్తాయనే నమ్మకంతో, కష్టపడి సంపాదించిన ఆస్తులు అమ్మి పెట్టుబడులు పెట్టారు. విత్‌డ్రాకు ప్రయత్నిస్తే మరింత డబ్బు కట్టాలని మెలిక పెట్టడంతో.. మోసపోయినట్లు గుర్తించి సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !