దళిత వైద్యుడు సుధాకర్ ( Doctor Sudhakar) ...ఉదంతం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కరోనా మహమ్మారి ఉధృతంగా పంజా విసురుతున్న రోజుల్లో నర్సీపట్నం (Narsipatnam) ఆస్పత్రిలో పనిచేసే ఆయన ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా పేషెంట్ల మధ్య తమకు మాస్కులు, గ్లౌజ్‌లు అందుబాటులో లేవని, వెంటనే ప్రభుత్వం సర్దుబాటు చేయాలని ఓ సందర్భంలో ప్రస్తావించారు. ఆయన మాట్లాడిన వీడియో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవ్వడంతో నాడు అధికారంలో వైసీపీ నేతలు ఆయనపై తప్పుడు కేసులు పెట్టి పగబట్టారు. సుధాకర్ ఓ టీడీపీ నేతలకు సన్నిహితుడని ముద్ర వేసి.. మాస్కులు అడిగారని, ప్రభుత్వం ఇవ్వడం లేదని నిందించారంటూ వెంటపడి వేధించారు. చివరికి అతడికి పిచ్చి అని ఆస్పత్రిలో కూడా చేర్పించారు. అంతటితో ఆగకుండా సుధాకర్ బ్యాంకుకు వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఆపి బట్టలు విప్పించారు. చేతులు తాడుతో వెనక్కి కట్టి అత్యంత పాశవికంగా వైసీపీ బ్యాచ్ సుధాకర్‌ను దారుణంగా అవమానించింది. ఈ పరిణామంతో మానసిన వేదనకు గురైన అతడు గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు.
క్షమాపణ చెప్పాలని డిమాండ్
కట్ చేస్తే.. ఇవాళ మాజీ సీఎం జగన్, దివంగత దళిత వైద్యుడు సుధాకర్ విధులు నిర్వర్తించిన నర్సీపట్నంలోనే పర్యటించబోతున్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ.. కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నారు. కానీ, చేసిన పాపం ఊరికే పోతుందా.. సుధాకర్‌ను మాస్క్ అడిగినందుకు వేధించి చనిపోయేలా చేసిన వ్యవహారం ఇంకా వైసీపీని వెంటాడుతోంది. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. మాకవరంపాలెం మెడికల్ కాలేజీ పరిశీలనకు వెళ్తున్న సమయంలో వైఎస్ జగన్ వెళ్లే మార్గంలో పెద్ద ఎత్తున వినూత్న రీతిలో దళిత సంఘాలు హోర్డింగ్స్ ఏర్పాటు చేశాయి. డాక్టర్ సుధాకర్ విషయంలో చేసిన ఘోరానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ #YSRCP NEVER AGAIN అనే హ్యాష్ ట్యాగ్‌తో ఏర్పాటు చేసిన కటౌట్లు ప్రస్తుతం హల్ చేస్తున్నాయి. వాటిపై ‘‘మాస్క్ ఇవ్వలేక హత్యలు చేసినవాళ్లు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడటమా? ప్రజలూ.. తస్మాత్ జాగ్రత్త’’ అని ఫ్లెక్సీలపై ఉంది. అయితే, ఈ హోర్డింగ్స్ చూసిన జనం.. ఇదేం మాస్ ర్యాగింగ్ రా బాబు అంటూ చెవులు కొరుక్కుంటున్నారు.