HCA : ప్రెసిడెంట్‌ జగన్‌మోహన్‌ రావు అరెస్ట్‌

0

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(HCA) ప్రెసిడెంట్‌ జగన్‌మోహన్‌ రావును తెలంగాణ సీఐడీ (CID) పోలీసులు అరెస్ట్‌ చేశారు. IPL 2025 సీజన్‌ టికెట్ల వివాదం నేపథ్యంలో జగన్‌మోహన్‌ రావుతో పాటు హెచ్‌సీఏకు చెందిన ఆరుగురు సభ్యులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. IPL 2025 సీజన్‌ టికెట్ల కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీని జగన్‌మోహన్‌ రావు బెదిరించారనే విజిలెన్స్‌ సిఫార్స్‌ మేరకు సీఐడీ చర్యలు తీసుకుంది. 

అభియోగాలు వాస్తవమేనని నివేదిక

ఐపీఎల్‌ 2025 సీజన్‌ టికెట్ల వ్యవహరంలో SRH మేనేజ్‌మెంట్‌, HCA మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అదనపు టికెట్ల కోసం HCA ప్రెసిడెంట్‌ జగన్‌మోహన్‌ రావు బెదిరింపులకు పాల్పడుతున్నాడని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ లేఖ రాయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం.. విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో విచారణ చేపట్టిన విజిలెన్స్‌ అధికారులు.. HCA ప్రెసిడెంట్‌పై వచ్చిన అభియోగాలు వాస్తవమేనని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక నేపథ్యంలో తెలంగాణ సీఐడీ చర్యలు చేపట్టింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యంతో హెచ్‌సీఏకు కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రతీ ఏడాది కాంప్లిమెంటరీ పాసుల కింద ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం హెచ్‌సీఏకు 10 శాతం టికెట్లు ఇస్తోంది. అయితే మరో 20 శాతం టికెట్లు ఇవ్వాలని హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ జగన్‌మోహన్‌ రావు బెదిరింపులకు దిగాడని సన్‌రైజర్స్‌ యాజమాన్యం ఆరోపించింది. 10 శాతం టికెట్లు తనకు వ్యక్తిగతంగా ఇవ్వాలని జగన్‌మోహన్‌ రావు డిమాండ్‌ చేసాడని, ఇబ్బందులకు గురి చేశాడని హెచ్‌సీఏకు రాసిన లేఖలో పేర్కొంది. ఈ లేఖ లీక్‌ కావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. లక్నో మ్యాచ్‌ సందర్భంగా వీఐపీ కార్పొరేట్‌ బాక్స్‌కు తాళాలు కూడా వేయించారని, ఈ ఘటన తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, ఇలా చేస్తే హైదరాబాద్‌ విడిపోతామని ఆ లేఖలో సన్‌రైజర్స్‌ హెచ్చరించింది.

అరెస్టుపై సీఐడీ ప్రకటన

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్‌రావు అరెస్టుపై సీఐడీ ప్రకటన చేసింది. శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌ పేరుతో జగన్మోహన్‌రావు నకిలీ పత్రాలు సృష్టించారు. గౌలిపురా క్రికెట్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి సి.కృష్ణయాదవ్‌ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్‌ ప్రెసిడెంట్‌ కవిత ఫోర్జరీ చేసి ఆ పత్రాలను జగన్మోహన్‌కు అందించారు. ఆ పత్రాలను ఉపయోగించి జగన్మోహన్‌రావు హెచ్‌సీఏ అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత నిధుల దుర్వినియోగం జరిగిందని టీసీఏ అధ్యక్షుడు గురువారెడ్డి ఫిర్యాదు చేశారు. జగన్మోహన్‌రావుకు హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, సీఈవో సునీల్‌ సహకరించినట్టు సీఐడీ గుర్తించింది. దీంతో హెచ్‌సీఏ అధ్యక్షుడితో పాటు శ్రీనివాసరావు, సునీత్‌, రాజేందర్‌ యాదవ్‌, కవితను అరెస్టు చేసినట్టు సీఐడీ తెలిపింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !