భగవద్గీత స్ఫూర్తితో చెరువుల పరిరక్షణ
భగవద్గీత స్ఫూర్తితో తాను ఈ పని చేస్తున్నట్లు రేవంత్‌రెడ్డి చెప్పారు. దానికి తగ్గట్టుగానే బీఆర్‌ఎస్ నుండి తన పార్టీలో చేరిన దానం నాగేందర్ అనుచరుడి కట్టడం, కాంగ్రెస్ నేత పల్లం రాజు బంధువుల కట్టడాలను హైడ్రా కూల్చి వేసింది. ఎం.ఐ.ఎం ఎమ్మెల్యేలు మహ్మద్ ముబీన్, ఎం.ఐ.ఎం ఎమ్మెల్సీ మహ్మద్ మీర్జా కు సంబంధించిన నిర్మాణాలను చెరువు భూముల్లో ఉన్న ఆక్రమణల పేరుతో హైడ్రా కూల్చి వేసింది. కేటీఆర్ ఆధీనంలోఉన్న జన్వాడ ఫాం హౌస్ కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరో వైపు పొంగులేటి, కేవీపీ, మధుయాష్కీ, పట్నం మహేందర్ రెడ్డిలకు ఉన్న ఫాం హౌస్ లు బఫర్ జోన్లోనే ఉన్నాయని వాటిని కూల్చాలని బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి అధికారులు నోటీసులు పంపారు. దుర్గం చెరువు ఎఫ్. టీ.ఎల్ జోన్లో తిరుపతిరెడ్డికి చెందిన కట్టడాలు ఉన్నాయని 30 రోజల్లో వాటిని కూల్చివేయాలని నోటీసులో పేర్కొన్నారు. ఇలా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, ఎం.ఐ.ఎం అన్ని పార్టీలకు హైడ్రా సెగ తగలింది. ఇది చివరకు ఎటు దారి తీస్తుందా అన్న చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
హైడ్రా రాజకీయాస్త్రమా?
రాజకీయ నాయకులు ఏం చేసినా అందులో రాజకీయ ప్రయోజనాలే ఉంటాయి. ఈ మాట స్వయాన సీఎం రేవంత్ రెడ్డి ఓ మీడియా ఇంటర్వూలో చెప్పారు. హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, పర్యావరణం వంటి అంశాలు ఉన్నప్పటికీ రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఎవరూ ఏ పని చేయరన్నది రాజకీయాలు ఏ మాత్రం అవగాహన ఉన్నా అవగతం అయ్యే విషయం. హైడ్రా పేరుతో జరుగుతున్న చర్చ గత కొద్ది రోజులుగా ప్రజల్లో బాగా నానుతుంది. అయితే ఈ ప్రయోగం వెనుక ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం.
సీఎంగా రేవంత్ రెడ్డి ఓ బ్రాండ్‌గా నిలిచిపోవాలనుకుంటున్నారా ?
గత రాజకీయాలు, సమకాలీన రాజకీయాలను పరిశీలిస్తే చరిత్రలో కొద్ది మంది ముఖ్యమంత్రుల పేర్లే శాశ్వతంగా నిలిచిపోయాయి. అలాంటి వారి జాబితాలో రేవంత్‌రెడ్డి ప్రజానాయకుడిగా గుర్తింపు పొందాలనే తపనతో ఉన్నట్లు తెలుస్తోంది. విస్తృతమైన ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా తన కంటూ ఓ బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకునేందుకు తనదైన ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు.
ప్రజా నాయకుడిగా ఎన్టీఆర్...
ప్రజాభిమానం మిన్నగా ఉన్న ప్రజా నాయకుడిగా ఎన్టీఆర్ పేరును తెలుగు ప్రజలంతా తలచుకుంటారు. సినిమా హీరోగా అనే ఇమేజ్ మాత్రమే కాకుండా డైనమిక్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. కిలో రెండు రూపాయల బియ్యం, మహిళలకు ఆస్థి హక్కు , జనతా వస్త్రాలు, పటేల్ పట్వారీ వ్యవస్థల రద్దు వంటి పథకాలతో సంక్షేమానికి చిరునామాగా ఎన్టీఆర్ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇప్పటికీ తెలుగు ప్రజలు ‘‘అన్న ఎన్టీఆర్’’ అని తమ హృదయాల్లో ఆయన పేరు భద్రపరుచుకున్నారు.
పాలనా దక్షుడిగా చంద్రబాబు
ఆ తర్వాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పని రాక్షసుడిగా, గొప్ప అడ్మినిస్ట్రేటర్ గా గుర్తింపు పొందారు. సైబరాబాద్ నిర్మాణం వెనుక ఆయన కృషి పేరు తెచ్చిపెట్టింది. పాలన విషయాల్లో చాలా మార్పులు తెచ్చిన వ్యక్తి గా పాలనా దక్షుడిగా చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారు.
లీడర్ గా వైఎస్..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా ప్రస్థానం పేరుతో 1470 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అనంతరం ప్రజల ముఖ్యమంత్రిగా వైఎస్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పేదలకు ఆరోగ్య శ్రీ ద్వారా కార్పోరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చి ప్రాణదాతగా పేరు తెచ్చుకున్నారు. ఉచిత విద్యుత్ ఇచ్చి రైతులకు ఆపద్భాంధవుడు అయ్యారు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాలతో అన్ని వర్గాల నేతగా వైఎస్ గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు రాజన్న అని వచ్చే వారికి అన్నగా ఆదుకుంటాడన్న ఇమేజ్ వై.ఎస్ స్వతంతం. టోటల్ గా చెప్పాలంటే ఓ లీడర్ గా వై.ఎస్ ను అందరూ అభిమానిస్తారు.
తెలంగాణ సాధకుడిగా కేసీఆర్
తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్ అంటే తెలంగాణ అన్న ఇమేజ్ ను కేసీఆర్ సంపాదించుకున్నారు. అంతే కాకుండా రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టి తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ సృష్టించుకున్నారు కేసీఆర్. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ పాత్ర ఎవరూ.. మరిచిపోలేనిది
రేవంత్ రెడ్డి బ్రాండ్ ఇమేజ్ ఏంటి...?
తెలంగాణ రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓ ఇమేజ్ సృష్టించుకున్నారు. దూకుడు రాజకీయాలు, స్పష్టంగా, సరళంగా, సూటిగా మాట్లాడే వాక్పటిమ రేవంత్ స్వంతం. ఎలాంటి సమస్య వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లే తత్వం రేవంత్ ది అని ఆయన సన్నిహితులు చెబుతారు. పార్టీ అధ్యక్షుడిగా పాస్ మార్కులు సాధించిన రేవంత్ రెడ్డి , ఇప్పటికే బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న సీఎంల సరసన చేరాలంటే పాలనలో తనకంటూ ఓ సరళిని ఏర్పాటు చేసుకోవాల్సిందే. అందులో భాగంగానే డ్రగ్స్‌పై ఉక్కుపాదం మరియు హైడ్రా అస్త్ర ప్రయోగం చేశారా అన్న చర్చ సాగుతోంది.
నిష్పాక్షికత కలిగిన డైనమిక్ సీఎంగా ఇమేజ్ సాధించుకునే లక్ష్యం
హైదరాబాద్ నగరంలో చెరువు భూముల్లో అక్రమంగా నిర్మించుకున్న కట్టడాల్లో దాదాపు 95 శాతం బడా బాబులవే. వాటిని కూల్చడాన్ని ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు మద్ధతు తెలపడం చూస్తున్నాం. ఇలా పెద్దలను దెబ్బ కొట్టడం ద్వారా పేద, మధ్య తరగతి వర్గాల ముఖ్యమంత్రిగా ఇమేజ్ సంపాదించుకుంటున్నారా అన్న చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, మంత్రులు, స్వపక్ష, విపక్ష తేడా లేకుండా అక్రమ కట్టడాలు కూల్చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం కూడా సీఎంకు నిష్పాక్షికత కలిగిన డైనమిక్ సీఎంగా ఇమేజ్ సాధించుకునే లక్ష్యంలో భాగమేనా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. భవిష్యత్తులో చరిత్రను పరికిస్తే ముఖ్యమంత్రుల్లో తనకంటూ ఓ పేజీ ఉండాలని రేవంత్ కోరుకుంటున్నారా.. అందుకే ఇంటా,బయట పెద్ద ఎత్తున హైడ్రా చర్యలపై విమర్శలు వస్తున్నా... లెక్క చేయకుండా, ఇలాంటి సాహసోపేతమైన చర్యలకు సిద్దపడ్డారా అన్నది కూడా ఆలోచించాల్సి ఉంది. ఏది ఏమైనా రాజకీయ నేతల మౌనం వెనుక, వారు చేసే ప్రకటనల వెనకు, వారు చేసే చర్యల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉండటం సామాన్యమైన విషయం. ఇది కూడా ఆ కోవలేకి రాదని చెప్పలేం. కారణమేదైనా....హైదరాబాద్ నగరంలోని చెరువుల పరిరక్షణకు రేవంత్ నడుం కట్టడం మాత్రం నగరవాసుల నుండి మంచి స్పందన రావడం అందరూ గమనించాల్సిన అంశం.