IPL 2024 : ఐపీఎల్‌లో అదరగొడుతున్న మయాంక్‌ యాదవ్‌ !

0

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో కొత్త కుర్రాడు వెలుగులోకి వచ్చాడు. వరుసగా ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. మెరుపు వేగంతో బంతులు వేస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. 156 కి. మీ వేగంతో బంతులు వేస్తూ రికార్డులు సృష్టిస్తున్నాడు. అతడు ఎవరో కాదు మయాంక్‌ యాదవ్‌. బెంగళూరును తన సొంతమైదానంలో ఓడిరచి ఈ మెగా టోర్నీలో లఖ్‌నవూ  రెండో విజయాన్ని నమోదు చేసింది. యువ ఆటగాడు మయాంక్‌ యాదవ్‌ సంచలన బౌలింగ్‌తో బెంగళూరును వణికించాడు. తొలుత డికాక్‌ (81), పూరన్‌ (40) చెలరేగడంతో 5 వికెట్ల నష్టానికి లఖ్‌నవూ 181 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరును 19.4 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూల్చింది. మహిపాల్‌ లోమ్రోర్‌ (33) టాప్‌ స్కోరర్‌. రజత్‌ పటీదార్‌ (29), కోహ్లీ (22), డుప్లెసిస్‌ (19) పరుగులు చేశారు. మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. లఖ్‌నవూ బౌలర్లలో మయాంక్‌ యాదవ్‌ 3, నవీనుల్‌ హఖ్‌ 2, యశ్‌ ఠాకూర్‌, స్టోయినిస్‌, సిద్ధార్థ్‌ తలో వికెట్‌ తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు.

దేశానికి ఆడడమే అంతిమ లక్ష్యం..

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైన అనంతరం మయాంక్‌ మాట్లాడాడు. ‘‘వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికవ్వడం ఆనందంగా ఉంది. రెండు మ్యాచుల్లోనూ మేము గెలిచాం. ఎప్పటికైనా దేశానికి ఆడడమే నా అంతిమ లక్ష్యం. నా ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించానని అనుకుంటున్నా. కామెరూన్‌ గ్రీన్‌ వికెట్‌ను తీసినందుకు ఎంతో సంతోషించాను. వేగంగా బౌలింగ్‌ చేయడానికి డైట్‌, సరిపడ నిద్ర, శిక్షణ చాలా అవసరం. వేగంగా రికవరీ కావడానికి చన్నీటి స్నానం, డైట్‌పై నిరంతరం శ్రద్ధపెడుతున్నాను’’ అని మయాంక్‌ పేర్కొన్నాడు.



156.7 కి.మీ బౌలింగ్‌తో టాప్‌ 4కి..

ఆడిన తొలి మ్యాచ్‌లోనే సంచలన బౌలింగ్‌తో సర్వత్రా ప్రశంసలు అందుకున్న మయాంక్‌.. రెండో మ్యాచ్‌లోనూ అలాంటి ప్రదర్శనే ఇచ్చాడు. ఫలితంగా వరుసగా రెండు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లకు ఎంపికయ్యాడు. 4 ఓవర్లు వేసిన అతడు కేవలం 14 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లోనూ గంటకు 150 కి.మీ వేగంతో బంతులేసిన మయాంక్‌.. ఒక బంతిని 156.7 కి.మీ వేగంతో వేసి రికార్డు సృష్టించాడు. దీంతో ఐపీఎల్‌ టోర్నీలోనే అత్యంత వేగంగా వేసిన బౌలర్ల జాబితాలో టాప్‌ 4కి చేరుకున్నాడు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !