కేరళలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కేరళలో మలయాళ నటి రీనీ ఆన్ జార్జ్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఆమె సోషల్ మీడియా పోస్టులో.. ‘కేరళకు చెందిన ఓ యువ రాజకీయ నాయకుడు తనను హోటల్‌కు రమ్ముంటున్నాడని అన్నారు. తనకు అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. గత మూడేళ్లుగా ఇలా జరుగుతోందన్నారు. అయితే, సదరు నేత వేధింపులకు సంబంధించి.. ఆ పార్టీలోని సీనియర్లకు ఈ విషయంపై ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు. అయినా కూడా ఆయనపై చర్యలు తీసుకోకుండా.. ఉన్నత పదవులు ఇస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు నేత.. తనను మాత్రమే కాదు.. ఇప్పటి చాలా మంది యువతులను ఇలా వేధించినట్టు తనకు తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, పోస్ట్‌లో మాత్రం ఆమె ఎక్కడా.. అతడి పేరును, రాజకీయ పార్టీని ప్రస్తావించలేదు. దీంతో, నటి ఆరోపణలపై కేరళలో రాజకీయ దుమారం చెలరేగింది. ఇదిలా ఉంటే రచయిత్రి హనీ భాస్కరన్ కూడా రాహుల్ మమ్‌కూటథిల్‌పై ఆరోపణలు చేశారు. తనను కూడా వేధింపులకు గురి చేశాడని తెలిపింది. సోషల్ మీడియాలో పదే పదే సందేశాలు పంపి వేధించాడని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. యూత్ కాంగ్రెస్‌లో మహిళలను కూడా ఇలానే వేధించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు కాంగ్రెస్ నేత వేధింపుల వ్యవహారం కేరళలో కొత్త చర్చకు దారి తీసింది.
రాహుల్ మామ్‌కూటత్తిల్ రాజీనామా
నటి రీనీ ఆన్ జార్జ్ ఆరోపణలతో కేరళలో రాజకీయ దుమారం రేగటంతో కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ వ్యవహారంపై పార్టీలో అంతర్గత విచారణ చేపట్టినట్లు, దోషులు తప్పించుకోలేరని కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ ప్రకటించారు. వెంటనే ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు రాహుల్ మామ్‌కూటత్తిల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన పాలక్కడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగానూ ఉన్నారు. అదూర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. తన రాజీనామాను ప్రకటించారు. తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా ప్రకటించారు. ‘‘నాపై వచ్చిన ఆరోపణల విషయంలో పార్టీ పెద్దలతో మాట్లాడాను. వారెవరూ నన్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేయలేదు. ఆ నటి నా స్నేహితురాలు. ఆమె ఆరోపణలు చేసిన వ్యక్తి నేను కాదని నమ్ముతున్నాను. నేను ఎటువంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడలేదు’’ అని పేర్కొన్నారు