Phone Tapping : మీ ఫోన్‌ ట్యాపింగ్‌ అయ్యిందా లేదా అని తెలుసుకోండి ?

0

టెక్నాలజీ పెరిగిందని ఆనందపడాలో, వ్యక్తిగత భద్రతకు ముప్పు అని బాధపడాలో అర్థం కాని స్థితిలో ఉంది నేటి టెక్నోతరం. డిజిటలైజేషన్‌ నేపథ్యంలో ప్రతి పని టెక్నాలజీతో అనుసంధానం అయ్యింది. దీంతో  వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రత అతి కీలకమయ్యాయి. అధునాతన నిఘా పద్ధతుల నేపథ్యంలో ఇవి మరింత ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి. నిత్య జీవితంలో విడదీయలేని పరికరంగా మారిన ఫోన్ల మీదా నిఘా వేయటం, ట్యాపింగ్‌ చేయటమూ చూస్తున్నాం. ఇంతకీ ఫోన్‌ ట్యాపింగ్‌ అంటే? టెలిఫోన్‌ లైన్లు లేదా వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ల మీద ప్రసారమయ్యే సంకేతాలను అడ్డగించి.. ఫోన్లతో జరిపే సంప్రదింపులను అనధికారికంగా వినటం. మాటలను రికార్డు చేయటానికీ ఇది వీలు కల్పిస్తుంది. ఇదెంత ప్రమాదకరమో చెప్పనక్కర్లేదు. వ్యక్తిగత వివరాలు, రహస్య సమాచారం ఇతరులకు చిక్కితే ఇంకేమైనా ఉందా? మరి ఫోన్‌ను ట్యాపింగ్‌కు గురవుతుందోననే విషయాన్ని తెలుసుకోవటమెలా? నిజానికిది చాలా కష్టమైన పనే. అధునాతన నిఘా పద్ధతులు అలాంటివి. కానీ కొన్ని లక్షణాలను బట్టి ఫోన్‌ ట్యాపింగ్‌ను పోల్చుకోవచ్చు.

  • అసంబద్ధ నేపథ్య శబ్దాలు: ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు క్లిక్‌ క్లిక్‌ మనే చప్పుళ్లు, ప్రతిధ్వనులు, ఉన్నట్టుండి మాటలు ఆగిపోవటం వంటివన్నీ నిఘా పరికరాలు సంభాషణలను అడ్డగిస్తున్నాయని అనటానికి సంకేతాలు కావొచ్చు.
  • బ్యాటరీ ఛార్జ్‌ డౌన్‌ అవ్వటం, ఫోన్‌ వెడెక్కటం: మామూలుగా కన్నా.. ముఖ్యంగా ఫోన్‌ వాడనప్పుడూ ఫోన్‌ బ్యాటరీ త్వరగా డౌన్‌అవ్వటం, ఫోన్‌ అతిగా వెడెక్కటం గమనిస్తే సందేహించాల్సిందే. ఫోన్‌ నేపథ్యంలో నిఘా సాఫ్ట్‌వేర్‌ రన్‌ అవటం వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
  • అసాధారణంగా డేటా ఖర్చవటం: అకారణంగా ఉన్నట్టుండి ఫోన్‌ డేటా అతిగా ఖర్చవుతున్నా అనుమానించాల్సిందే. అనధికార అప్లికేషన్లు మనకు తెలియకుండానే డేటాను ప్రసారం చేస్తున్నాయనటానికి ఇదొక సూచనగా భావించాలి.
  • ఆలస్యంగా షట్‌డౌన్‌, రీస్టార్ట్‌: నిఘా సాఫ్ట్‌వేర్‌ వెనకాల రన్‌ అవుతుంటే ఫోన్‌ షట్‌డౌన్‌, రీస్టార్ట్‌ కావటానికి మామూలు కన్నా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇలాంటివి గమనిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.
  • అనూహ్య మెసేజ్‌లు, హెచ్చరికలు: అసాధారణ టెక్స్ట్‌ మెసేజ్‌లు, అలర్ట్‌లు, నోటిఫికేషన్లు వస్తున్నట్టయితే ట్యాపింగ్‌కు చిహ్నాలు కావొచ్చు. ముఖ్యంగా ర్యాండమ్‌ అక్షరాలు, చిహ్నాలతో కూడిన మెసేజ్‌లు అందుతుంటే ఫోన్‌ను ఇతరులెవరో దూరం నుంచి పర్యవేక్షిస్తున్నారని అనుమానించాలి.
  • కాల్స్‌ విచిత్రంగా: ఫోన్‌ మాట్లాడుతున్నప్పుడు కాల్స్‌ అర్ధంతరంగా ఆగిపోవటం, మన మాటలు మనకే వినిపించటం వంటివి కూడా నిఘాకు సంకేతం కావొచ్చు. అలాగే ఫోన్‌ వాడనప్పుడూ తెర వెలగటం, ఆరటం, రకరకాల చప్పుళ్లు చేయటం వంటివి గమనించినా అనుమానించాల్సిందే.

ఏం చేయాలి?

  • ఫోన్‌ ట్యాప్‌ అయ్యిందనే అనుమానం వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. గోప్యత, భద్రతను కాపాడుకోవటం తప్పనిసరని గుర్తించాలి.
  • ఫోన్‌ను నిశితంగా గమనించాలి. తనిఖీ చేయాలి. తెలియని యాప్‌లు కనిపిస్తే తొలగించుకోవాలి. సెటింగ్స్‌లో మార్పులను గమనిస్తే సరిచేసుకోవాలి. అనుమానిత నెట్‌వర్క్‌ కనెక్షన్లుంటే తీసేయాలి.
  • ఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి. ఏవైనా లోపాలుంటే సరిదిద్దుకుంటాయి.
  • పరికరాన్ని ఫ్యాక్టరీ రీసెట్‌ చేస్తే హానికర నిఘా సాఫ్ట్‌వేర్లు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. అయితే రీసెట్‌ చేయటానికి ముందు అవసరమైన డేటాను స్టోర్‌ చేసుకోవటం మంచిది.
  • విశ్వసనీయమైన యాంటీవైరస్‌ లేదా యాంటీ స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. హానికర ప్రోగ్రామ్‌లు, ఫైల్స్‌ను తొలగించుకోవటానికివి తోడ్పడతాయి. గోప్యతను కాపాడతాయి.
  • భద్రమైన వైఫై నెట్‌వర్క్‌నే వాడుకోవాలి. అన్‌సెక్యూర్డ్‌, పబ్లిక్‌ నెట్‌వర్క్‌లతో కనెక్ట్‌ కావొద్దు.
  • ఫోన్‌ యాక్టివిటీని తరచూ గమనిస్తుండాలి. డేటా వాడకం, నెట్‌వర్క్‌ కనెక్షన్స్‌, ఇన్‌స్టాల్‌ అయిన యాప్‌ల వంటి వాటిపై ఓ కన్నేసి ఉంచాలి. దీంతో ఏదైనా అనుమానం వస్తే వెంటనే అప్రమత్తం కావటానికి వీలుంటుంది.
  • ఫోన్‌ ట్యాప్‌ అయ్యిందో లేదో కచ్చితంగా తేల్చుకోలేని పరిస్థితుల్లో సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల సాయం తీసుకోవాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !