రాజా రఘువంశీ ఘోర హత్య గురించి యావత్ భారతం మర్చిపోకముందే తెలుగు నేలపైన అదే తరహాలో జరిగిన తేజేశ్వర్ ఘటన నివ్వెరపోయేలా చేసింది. సోనమ్, ఐశ్వర్య, శివానీ, ముస్కాన్, రాధిక... ఈ మధ్య కాలంలో భర్తల చావుకు కారణమైన నవ వధువులు వీళ్లంతా. ఇంకోవైపు టీనేజ్ అమ్మాయిలూ ప్రేమ మాయలో పడి కన్నవాళ్లనే చంపించడం... వీటిని చూశాక అసలు ఆడవాళ్లకు ఏమైందన్న చర్చ, ఆందోళనే మొదలైంది. సున్నితత్వానికి మారుపేరైన అమ్మాయిల్లో ఈ కర్కశత్వం వెనక కారణాల ఏంటి ? అసలు ఈ తరహా ఘటనలకు ఎందుకు పాల్పడుతున్నారు ?
ఇష్టం లేని పెళ్ళి !
వేరే వ్యక్తిని ప్రేమించటం, ఇష్టం లేని వ్యక్తితో పెళ్ళి జరగటం...ఈ రెండు కారణాలు ఆడవాళ్ళలో విపరీతమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తున్నాయి అంటున్నారు మానసిక నిపుణులు. ప్రేమించిన వ్యక్తిని ఎలాగైనా దక్కించుకోవాలి అని అనుకున్నారే కానీ... దానివల్ల వచ్చే పర్యవసానాల్ని ఊహించలేకపోయారు. ఒకరిని చంపడం తప్పు. జైలుకి వెళ్లాలి, అప్పుడు ప్రేమించిన వ్యక్తితో కలిసి జీవించడం అసాధ్యమని ఆలోచించలేకపోయారు. ఇందుకు తల్లిదండ్రులూ కారణమే. ఎవరినైనా ప్రేమించాం అనగానే తాము చెప్పిన పెళ్లి చేసుకో, లేదంటే చచ్చిపోతామంటారు. పరువు, సమాజం అంటూ బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తారు. వాళ్ల మాటలకు తలొగ్గి తాళి కట్టించుకున్నా ప్రేమించినవాడే కావాలనిపిస్తుంది. పారిపోయినా తిరిగి తీసుకొచ్చి బలవంతంగా సంసారం చేయిస్తారు. అసలు కట్టుకున్నవాడే లేకపోతే సమస్య ఉండదని భావిస్తున్నారు. అన్ ఐడెంటిఫైడ్ మెంటల్ ఇల్‌నెస్ ఉన్నవారిలో ఇలా ఉంటుంది. ట్రామా, సప్రెషన్, అనుకున్నది సాధించాలనే తత్వం ఉన్నవారు ఇలాంటి వాటికి పూనుకుంటారు. అందుకే పెళ్లిళ్లు చేసేటప్పుడు, చేసుకునేవాళ్లు అవతలివారి ఇష్టాయిష్టాలను కనుక్కోవాలి. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ? పెళ్ళి చేసుకోవటం ఇష్టమేనా ? అని వారి అభిప్రాయాలు తెలుసుకుంటేనే మంచిది. ఆసక్తి లేదంటే చేసుకోకపోవడమే మేలు. చంపేవారిలో సహానుభూతి ఉండదు. వాళ్ల గురించే ఆలోచించుకుంటారు. ఇలాంటి ప్రవర్తన వాళ్లలో మొదట్నుంచీ ఉంటుంది. లేదు అనుకోకుండా జరిగింది అంటే వాళ్లు తీవ్రమైన అణచివేతకో, భావోద్వేగానికో గురయ్యారని అర్థం చేసుకోవాలి.
పెళ్ళికి ముందే ప్రేమ !
పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు ఉండటం నేటి సమాజంలో సహాజం. కానీ... వాటిని వదులుకోకుండానే మరో పెళ్లి చేసుకోవడం, ఆ అనైతిక బంధాల్ని కొనసాగించడానికి భాగస్వామి ప్రాణాల్ని తీయడం వంటి పోకడలు సమాజాన్ని కలవర పెడుతున్నాయి. ఇంతటి రాక్షస ప్రవృత్తికి ఇంటర్నెట్లో చూస్తున్న దృశ్యాలు, పెంపకంలో లోపాలు, పెరిగిన వాతావరణం... ఇవన్నీ కారణాలే. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే... తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై శ్రద్ధ వహించడం, స్కూల్స్, కాలేజీల్లో విలువల బోధన అవసరం. నిజానికి వివాహమనేది జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. ప్రేమ వివాహమైనా, తల్లిదండ్రులు కుదిర్చినదైనా సరే... ఒకరితో ఒకరు ఎలా ఉంటారో ఊహించడం కష్టం. ఆస్తులు, జాతకాలు, గోత్రాలు... మాత్రమే చూస్తారు. పెళ్లి చేసుకోబోయే వారి ఇష్టాయిష్టాలు, మనసులు, మనస్తత్వాలు, అలవాట్లు కలవాలని ఆలోచించరు. తీరా తరవాత తమ అంచనాలు తారుమారు అయ్యాయని కొందరు విడాకులకు వెళ్తుంటే... మరికొందరు అవతలి వారిని వదిలించుకోవడానికి కర్కశ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాకాకుండా ఉండాలంటే ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ అవసరం. ఇది కాబోయే దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు... టీనేజీ, కాలేజీ పిల్లలు పక్కదారి పట్టకుండా కూడా సహాయపడతాయి. ఆకర్షణకు వాస్తవ జీవితానికి మధ్య తేడా అర్థమవుతుంది. ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు అంచనా వేసేందుకు అవకాశం ఇస్తుంది.
కలవరపెడుతున్న వివాహేతర సంబంధాలు !
కుటుంబ సమస్యలో, ఆర్థిక లేదా మరో రకమైన సమస్యని బయటవారితో తొందరగా పంచుకోవద్దు. వాళ్లు సానుభూతి నటిస్తూ దగ్గరై ఆలోచనల్ని ప్రభావితం చేస్తారు. నేటి ఉరుకుల పరుగుల జీవితం, ఉద్యోగాలు, పనిఒత్తిడి, ఫాస్ట్‌ఫుడ్ జీవితంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒకరితో ఒకరు కలిసి కూర్చోని మనసువిప్పి మాట్లాడుకునే సందర్భాలు అరుదు కావటంతో ఆలోచనలు అదుపు తప్పుతున్నాయి. కార్యాలయాల్లోని సహచరులతోనే, ఫేస్‌బుక్, ఇన్‌స్టాలోని అపరిచితులకు దగ్గర అవటం ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో బంధాలు విచ్ఛిన్నమవటం తరచుగా మనం మధ్యన చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా టీనేజర్లు ఆకర్షణకు లోనవుతున్నారు. జీవితం అంటే ఏ మాత్రం అవగాహన లేకపోవటంతో తొందరపాటు నిర్ణయాలకు పాల్పడుతున్నారు. సినిమా, మీడియా, సామాజిక మాధ్యమాల నుంచీ ప్రభావితమవుతున్నారు. వారి ప్రేమ కాదంటే తల్లిదండ్రులనే అంతమొందించే తీవ్ర నిర్ణయాలకు పాల్పడుతున్నారు. ఏది ఏమైనా తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. పిల్లలు ఏ అంశాన్నైనా కుటుంబ సభ్యులతోనే పంచుకునేలా వారిని తీర్చిదిద్దాలి. సెల్‌ఫోన్ అవసరమని కొంటాం. తర్వాత వినోదమే ప్రధానంగా మారిపోతారు. సమయానికి మించి వాడొద్దని స్నేహపూర్వకంగా చెప్పాలి. స్కూల్, కాలేజీలకు వెళ్లే పిల్లల్ని ఆరోజు జరిగిన విషయాల గురించి తల్లిదండ్రులు అడగాలి. ఏదీ దాచకుండా చెప్పే స్వేచ్ఛ ఇవ్వాలి. సమస్య ఉంటే తల్లిదండ్రులు అప్రమత్తమవ్వాలి. పిల్లలు చేజారకముందే జాగ్రత్తపడాలి. వివాహేతర సంబంధాల విషయంలో సమాజం ఏమనుకుంటుందోనన్న భయం ఒకవైపు, నచ్చినట్టు ఉండలేకపోతున్నాననే ఆలోచనలు మరోవైపు ఉంటాయి. ఆ క్రమంలో మరొకరి ప్రభావమూ తోడైతే విచక్షణ మరచి ఏదైనా చేయడానికి సిద్ధమవుతారు.