నగర పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వం ఆస్తుల పరిరక్షణే ధేయంగా నెలకొల్పబడిన ‘హైడ్రా’ (Hydra) అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. గ్రేటర్ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తూ, ప్రభుత్వ భూములను కబ్జా చెర నుంచి విడిపిస్తూవస్తోంది. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను నిరుపేద, ధనిక అనే తేడాలు లేకుండా ముందుకు సాగుతోంది. అయితే, ప్రాసెస్‌లో భాగంగా సలకం చెరువులో నిర్మించిన ఒవైసీ ఫాతిమా కాలేజీని కూడా కూల్చివేసేందుకు హైడ్రా పూనుకుంది. కానీ, బిల్డింగ్ కూల్చివేతపై అధికారులు వెనక్కి తగ్గారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నాయకులు పేదోళ్లకు ఓ న్యాయం.. ఒవైసీ బ్రదర్స్ ఓ న్యాయమా అని స్టేట్‌మెంట్లు ఇస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఫాతిమా కాలేజీని కూల్చివేయకపోవడంపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో కాలేజీ నిర్మించినందుకు గత సెప్టెంబర్‌లోనే తొలగించాలని అనుకున్నామని అన్నారు.
సామాజిక కోణంలో ఆలోచించి !
పేద ముస్లిం విద్యార్థినుల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ సంస్థ నడుస్తోందని అన్నారు. కళాశాలలో ఎవరి నుంచి ఒక్క రూపాయి కూడా ఫీజులు వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. ఫాతిమా కాలేజీలో సుమారు 10 వేల మందికిపైగా విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. నిరుపేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నామని అన్నారు. ఇలాంటి కళాశాలలు సామాజికంగా మంచి ప్రయోజనాన్ని అందిస్తున్నాయని, ఎందుకంటే అవి పేద ముస్లిం మహిళలను సామాజిక వెనుకబాటుతనం నుంచి విముక్తి చేస్తాయని అన్నారు. కానీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను కూల్చివేశామని తెలిపారు. 25 ఎకరాల చెరువును ఫ్లాట్లుగా మార్చిన ఓవైసీ కుటుంబానికి సన్నిహితుడి కట్టడాలను కూడా కూల్చేసినట్లు చెప్పారు. ఎంఐఎం నాయకుల నుంచి దాదాపు వెయ్యి కోట్ల ఆస్తులను ఇప్పటికే రికవరీ చేసుకున్నామని.. చాంద్రాయణ గుట్టలో ఎంఐఎం కార్పొరేటర్ కబ్జా చేసిన స్థలాన్ని స్వాధీనపరుచుకున్నమని అన్నారు. సామాజిక కారణాలవల్లనే ఫాతిమా కాలేజీ కూల్చివేతను నిలిపివేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. సామాజిక స్పృహతో కాలేజీ నడుస్తుందని దాని పట్ల మెతకవైఖరి అవలంబిస్తున్నట్లు ‘హైడ్రా’ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడిరది.