Saripodhaa Sanivaaram : సరిపోదా శనివారం మూవీ రివ్య్వూ !

0

సరిపోదా శనివారం అంటూ నాని సినిమా అనౌన్స్‌ చేయగానే.. శనివారానికి ఎదో ప్రత్యేకత ఉంది అనిపించేలా ఉంది. సినిమాలో శనివారానికి ఏదో ఇంపార్టెన్స్‌ ఉందనేది టైటిల్‌తోనే ప్రేక్షకులలోకి తీసుకెళ్లారు. నేచురల్‌ స్టార్‌ నాని ట్రాక్‌ రికార్డ్‌, ఎస్‌.జె. సూర్య ప్రస్తుత ఫామ్‌, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి సెన్సేషన్‌ని అందించి టాలీవుడ్‌ ‘ఓజీ’ సంస్థగా పేరొందిన డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌ కాంబినేషన్‌లో సినిమా అనగానే కచ్చితంగా సినిమాపై భారీ అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా ప్రతి శనివారం మేకర్స్‌ ఇచ్చిన అప్డేట్స్‌, ట్రైలర్‌.. అలాగే నాని, ఎస్‌.జె. సూర్యల ప్రమోషన్స్‌ హోరు.. సినిమాని జనాల్లోకి వెళ్లేలా చేశాయి.. టికెట్స్‌ తెగేందుకు కారణమయ్యాయి. ఇలా ఎన్నో అంచనాల నడుమ, పేరులో శనివారం ఉన్నా సరే.. రెండు రోజుల ముందుగానే థియేటర్లలోకి వచ్చిన ఈ ‘సరిపోదా శనివారం’.. ప్రేక్షకులకు సరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చిందో, లేదో రివ్యూలో తెలుసుకుందాం.

కథ ఏమిటంటే 

సూర్య (నాని)కి చిన్నప్పట్నుంచీ కోపం ఎక్కువ. ఏ చిన్న సంఘటన జరిగినా కోపంతో ఆవేశానికి లోనయ్యే క్యారెక్టర్‌ సూర్యది. ఆ కోపాన్ని అదుపులో పెట్టడం కోసం మనిషి కోపానికి ఓ విలువ ఉండాలని చెప్పి తను చనిపోతూ ఓ మాట తీసుకుంటుంది తల్లి ఛాయాదేవి (అభిరామి). దురదృష్టవశాత్తూ ఆమె క్యాన్సర్‌తో చనిపోతుంది. అప్పట్నుంచి వారమంతా ఎంతగా కోపం వచ్చినా నియంత్రించుకుంటూ, శనివారం మాత్రమే తన కోపానికి కారణమైన వాళ్ల పని పడుతుంటాడు.అలాంటి సూర్య లైఫ్‌లోకి వయలెన్స్‌ అనే పదమే నచ్చని కానిస్టేబుల్‌ చారులత (ప్రియాంక మోహన్‌) ప్రవేశిస్తుంది. వారి పరిచయం ప్రేమ వరకు వెళుతుంది. కానీ అదే సమయంలో నాని శనివారం కాన్సెప్ట్‌ తనకి తెలుస్తుంది. నాని గురించి తెలిసిన తర్వాత ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది? తన స్టేషన్‌ సీఐ దయానంద్‌ (ఎస్‌.జె.సూర్య) చేసే పనులు అస్సలు నచ్చని చారులత.. సోకులపాలెం విషయంలో సూర్య హెల్ప్‌ ఎందుకు తీసుకోవాలని అనుకుంటుంది? అసలు సోకులపాలెం ఇష్యూ ఏమిటి? ఆ సోకులపాలెంపై దయానంద్‌ పగబట్టడానికి కారణమేంటి? చివరికి ఆ ఇష్యూని ఎలా సాల్వ్‌ చేశారు? అసలు చారులతకు, సూర్యకు ఉన్న బంధమేంటి? చివరికి వారిద్దరూ ఒక్కటయ్యారా? అనేది తెలుసుకోవాలంటే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాని చూడాల్సిందే.

ఎలా ఉందంటే

వివేక్‌ ఆత్రేయ తెలివైన కథనంతో సాగే ఓ యాక్షన్‌ డ్రామా ఇది. విడుదలకు ముందు చిత్రబృందం కూడా కథ కంటే, ఆ కథని ఎలా చెప్పామన్నదే కీలకం అంటూ ప్రచారం చేసింది. అందుకు తగ్గట్టే బలమైన పాత్రలు, సంఘర్షణకి వైవిధ్యమైన కథనాన్ని మేళవించింది. ఏ కథ అయినా అమ్మ నుంచే మొదలవుతుందంటూ అమ్మ, ఆమె తన కొడుకు నుంచి తీసుకున్న మాటతోనే సినిమా ప్రారంభమవుతుంది. తల్లి మరణం అనంతరం శనివారం కాన్సెప్ట్‌ని ఎలా అమలు పరిచేది కూడా తండ్రి (సాయికుమార్‌) పాత్రతో రివీల్‌ చేయడంతో ఆ ఎపిసోడ్‌తోనే సినిమాకి ఈ పేరు ఎందుకో స్పష్టమవుతుంది. కథ, పాత్రల పరిచయంతో కూడిన ఆరంభ సన్నివేశాలు కాస్త నెమ్మదిగా అనిపించినా, దయా పాత్రపరిచయం చేసిన తీరు ప్రేక్షకులతో క్లాప్స్‌ కొట్టిస్తుంది. సోకులపాలెంని ఓ వస్తువులా చూస్తూ, తన కోపాన్ని ఆ ఊరిపై చూపించే ఇన్‌స్పెక్టర్‌ దయ, అతనికి అన్నతో ఉన్న వైరం చిత్రంలో కీలకం. ఆరంభం, మలుపు, పీటముడి, మధ్యభాగం, ముగింపు అంటూ పార్శ్వాలుగా కథని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మలుపు అంకం నుంచి సన్నివేశాలు ఆసక్తికరంగా సాగిపోతుంటాయి. ఆ క్రమంలోనే పరిచయమయ్యే చారులత, కూర్మానంద్‌ పాత్రలు... వాటి ద్వారానే అన్నదమ్ముల మధ్య సంఘర్షణ, సోకులపాలెం కథలు వెలుగులోకి వచ్చే క్రమం ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేస్తాయి. సూర్య, చారులత ప్రేమకథలో వచ్చే ఈగ స్టోరీ నవ్విస్తుంది. సినిమాలో కీలకమైన ప్రతి పాత్ర వెనకా ఓ కథ ఉంటుంది. ఆ కథల్ని వివరించే క్రమంలో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగుతున్న భావన కలిగినా, పీటముడి, మధ్యభాగం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. సూర్య, చారులత దగ్గరయ్యే సన్నివేశాలు... చారులతకి సూర్య తన శనివారం సంగతిని చెప్పాలనుకోవడం, ఆ క్రమంలోనే వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌, విరామ సన్నివేశాలు ద్వితీయార్ధంపై మరిన్ని అంచనాల్ని పెంచాయి. అప్పటి నుంచి కథ సూర్య వర్సెస్‌ దయా అన్నట్టుగా మారిపోతుంది. సోకులపాలెంలో ధైర్యం నింపడం కోసం సూర్య, చారు కలిసి ఓ వ్యూహాన్ని రచించడం, ఆ క్రమంలో అనూహ్యంగా చోటు చేసుకునే సంఘటనలు, సూర్య ఇంట్లో సాగే పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. కోపం నలుగురిలో ధైర్యాన్ని నింపేలా ఉండాలంటూ పతాక సన్నివేశాల దిశగా సినిమా సాగుతుంది.

ఎవరెలా చేశారంటే

నాని యాక్షన్‌ అవతారం ఆకట్టుకుంటుంది. సూర్య పాత్రలో ఒదిగిపోయాడు. ఉద్యోగిగా సహజ సిద్ధమైన లుక్‌, నటనతో ఒకవైపు అలరిస్తూనే, మరోవైపు కోపంతో రగిలిపోయే కోణాన్ని ప్రదర్శించాడు. ఎస్‌.జె.సూర్య విలన్‌గా స్క్రీన్‌ని ఆక్రమించేశాడు. అతిక్రూరమైన శాడిస్ట్‌ తరహా పాత్రలో ఎస్‌.జె. సూర్య అభినయం ఈ సినిమాకు ప్లస్‌ అయ్యింది. విలనిజంతో నవ్వించడం, క్లాప్స్‌ కొట్టించుకోవడం అంటే.. అంత సామాన్యమైన విషయం కాదు. కానీ ఎస్‌.జె. సూర్య తన విలనిజంతో మెప్పించడమే కాకుండా.. మిగతావి కూడా చేసి చూపించాడు. అందుకే ఈ సినిమాలో దయా పాత్రకు ఎస్‌.జె. సూర్యని తప్ప వేరేకరిని ఊహించలేం. నాని విషయానికి వస్తే.. అంతకు ముందు చేసిన ఎం.సి.ఏ మూడ్‌ని క్యారీ చేస్తూ.. శనివారం వచ్చేసరికి మాత్రం కొత్త తరహా నాని ఇందులో కనిపిస్తాడు. నాని పాత్రలో మెరుపులేం లేవ్‌ కానీ.. ఆ నేచురాలిటీ మాత్రం మిస్సవలేదు. హీరోయిన్‌గా ప్రియాంక క్యూట్‌గా కనిపించింది. రెండు, మూడు సీన్లు తప్పితే.. ఆమె పాత్రకు అంత ఇంపార్టెన్స్‌ ఏం లేదు. కాస్త స్క్రీన్‌ స్పేస్‌ పెరగడానికి నానితో డ్యూయట్స్‌ కూడా లేవు. సాయికుమార్‌ ఎప్పటిలానే తన అనుభవాన్ని ప్రదర్శించారు. నాని తల్లి పాత్రలో చేసిన అభిరామి కనిపించింది కొంచెం సేపే అయినా మంచి మార్కులు వేయించుకుంటుంది. మురళీశర్మ పాత్రకు కూడా పెద్దగా స్కోప్‌ లేదు కానీ.. ఉన్నంతలో తన మార్క్‌ని ప్రదర్శించాడు. హర్షవర్ధన్‌, శివాజీరాజా, అజయ్‌, అదితిబాలన్‌, అజయ్‌ ఘోష్‌, శుభలేఖ సుధాకర్‌ వంటి వారంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. జేక్స్‌ బిజోయ్‌ నేపథ్య సంగీతంతో సినిమాపై బలమైన ప్రభావం చూపించాడు. దర్శకుడు వివేక్‌ ఆత్రేయ తన మార్క్‌ యాక్షన్‌ ప్రధానమైన సినిమా ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించారు. పాత్రల రచన, కథనాన్ని మలిచిన తీరు ఈ సినిమాకి హైలైట్‌

(ఇది కేవలం రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !