వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. మరో ఎంపీ బీద మస్తాన్‌రావుతో కలిసి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. త్వరలో తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖలు సమర్పించనున్నట్లు చెప్పారు. వైసీపీ ఆవిర్భావం నుంచి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కుడి భుజంగా వ్యవహరించిన మోపిదేవి వెంకటరమణ.. ఇన్నాళ్లు పార్టీలో విసిగివేసారిపోయిన ఆయన గుడ్ బై చెప్పేశారు.. ఈ సందర్భంగా మోపిదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ వల్లే జైలుకి...
‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే నేను జైలుకు వెళ్లాను. వైఎస్సార్‌కు, వైఎస్ జగన్‌కు చాలా తేడా ఉంది. నేను ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. స్థానిక నేతగానే ఉండాలని నేను కోరుకున్నాను. వైఎస్ జగన్ రెడ్డే నన్ను రాజ్యసభకు పంపారు. నా రాజీనామాకు చాలా కారణాలు ఉన్నాయి. వైసీపీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాను. వైసీపీ ద్వారా సంక్రమించిన రాజ్యసభకు రాజీనామా చేస్తున్నాను. ఏ సందర్భంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నాను..? ఏమిటనేది..? వైసీపీ నేతలే ఆలోచించాలి. నేను తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో వైసీపీ వాళ్లే చెబుతారు. చిల్లరగా మాట్లాడే మనస్తత్వం నాది కాదు’ అని మోపిదేవి చెప్పుకొచ్చారు.
రాజ్యసభపై ఆసక్తి లేదు.
అధికారం నాకు కొత్తేమీ కాదు.. గతంలో ఎన్నో పదవుల్లో పనిచేశాను. గత ఏడాదికాలంగా నా నియోజవర్గంలో జరుగుతున్న పరిణామాలతో ఇబ్బంది పడ్డా. రాజ్యసభ పదవిపై మొదటి నుంచి ఆసక్తి లేదు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులతో రాజీనామా చేస్తున్నాను. ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ప్రజలు ఘోరాతిఘోరమైన తీర్పు ఇచ్చారు. ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరికొంత మంది రాజీనామా చేశారు. లోపం ఎక్కడ ఉందనే దానిపై వైసీపీ అధిష్ఠానం విశ్లేషించుకోవాలి. అనుభవం ఉన్న నేత సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని ఆయన గాడిలో పెడుతున్నారు. చంద్రబాబు సారథ్యంలో పనిచేయాలని భావిస్తున్నాను. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నా. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నా’’అని మోపిదేవి అన్నారు.