మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఈమేరకు శనివారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. ‘‘తుమ్మడికుంట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలోని ఆక్రమణలు హైడ్రా, జీహెచ్‌ఎంసీ, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. తుమ్మిడికుంటలోని అనధికార నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటి. చెరువులోని ఎఫ్‌టీఎల్‌లో ఎకరా 12 గుంటలు, బఫర్ జోన్ పరిధిలోని 2 ఎకరాల 18 గుంటల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. ఈ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు లేవు. బీఆర్‌ఎస్ (BRS) కింద అనుమతుల కోసం ఎన్ కన్వెన్షన్ ప్రయత్నించింది. సంబంధిత అధికారులు బీఆర్‌ఎస్‌కు అనుమతించలేదు. తుమ్మడికుంటపై 2014లో హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ తర్వాత ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లింది. చట్టబద్ధంగా ఉండాలని గతంలో ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. 2017లో ఎఫ్‌టీఎల్ సర్వే నివేదికపై కేసు పెండిరగ్‌లో ఉంది. ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఏ కోర్టు స్టే ఇవ్వలేదు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌కు సంబంధించి ఎన్ కన్వెన్షన్ తప్పుదోవ పట్టించింది. తప్పుదోవ పట్టించి వాణిజ్య కార్యక్రమాలు సాగించింది’’ అని రంగనాథ్ వివరించారు.