- గుంటూరులో దొంగల ముఠా !
- షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో దోపిడీ !
- బిచానా ఎత్తేసే పనిలో అవని వారి క్యాపిటల్ &ఇన్వెస్టర్స్ యాజమాన్యం !
- దూపాటి వీరాంజనేయ ప్రసాద్, పెడర్ల విజయలక్ష్మీల దోపిడీ బాగోతం బట్టబయలు !
- ట్రేడింగ్‌లో పెట్టుబడి పేరుతో అవని వారి క్యాపిటల్ & ఇన్వెస్టర్స్ రూ. 25 కోట్లు వసూలు !
- అవని రియల్ ఎస్టేట్ Ê డెవలపర్స్ మరియు విజయశ్రీ వారాహి చిట్‌ఫండ్ ప్రై.లి.లోని నిధుల మళ్ళింపు !
- కొన్ని నెలలకే లాస్ పేరుతో కస్టమర్లకు కుచ్చుటోపి !
- షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఉత్తదే !
- ఎస్.పి., ఏ.ఎస్.పి.లు తెలుసు కేసులు పెట్టుకోండి అంటూ బెదిరింపులు !
- ఇచ్చే వరకు ఆగండి, లేదంటే చేతులేత్తేస్తాం !
- రూ. 10/- వడ్డీ తీసుకోలేదా అంటూ కస్టమర్లపై ఎదురుదాడి !
మార్చి నెలలో ఊరువదిలి పారిపోయిన నవ్యశ్రీ వారాహి బిజినెస్ కన్సల్టెన్సీ & ట్రేడ్‌దోస్త్ యజమాని అన్నం పూర్ణచంద్రరావు చేసిన మోసం మరవక ముందే బోర్డ్ తిప్పివేసే పనిలో బిజీగా ఉన్నారు ఆయన శిష్యుడు దూపాటి వీరాంజనేయ ప్రసాద్ మరియు ఆయన సతీమణి పెడర్ల విజయలక్ష్మీ దంపతుల జంట. గతంలో అన్నం పూర్ణచంద్రరావు మరియు దూపాటి వీరాంజనేయ ప్రసాద్ శుప్రభాతం అగ్రి ఫామ్స్‌లో భాగస్వాములు కావటం విశేషం. ఆయన దారిలోనే షేర్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో పలువురు కస్టమర్లకు రూ. 10 వడ్డీ ఆశ చూపి దాదాపు 25 కోట్లు దండుకుని ఇప్పుడు రేపు మాపు అంటూ వాయిదాల పర్వం కొనసాగిస్తు ప్రజల్ని మోసగించే పనిలో ఉన్న ఈ జంట గురించి సవివరణాత్మక కథనం.
అందరిదీ ఒకటే బిజినెస్ మోడల్ !
షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీలాభాలు వస్తాయి అంటూ దీంతో మీ పెట్టుబడి 20 నెలల్లోనే 3 రెట్లు పెరుగుతుంది అని ఏజెంట్లు మభ్యపెట్టడంతో అమాయక ప్రజలు ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడి పెట్టించిన ఏజెంట్లకు ప్రతి లక్ష రూపాయలకు నెలకు రూ. 1000 చొప్పున కమీషన్ ఆశచూపింది కంపెనీ. పెట్టుబడిదారుడికి రూ.1 లక్షకు ప్రతినెలా రూ.10వేల వడ్డీ చెల్లిస్తామని ఎర వేశారు. అలాగే కొన్ని నెలలు చెల్లించి నమ్మకాన్ని కలిగించటం ఈ ముఠా ముందస్తు పథకంలో ఓ భాగం. దీంతో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య అమాంతం పెరిగింది. కోట్లాది రూపాయలు ప్రవాహంలా వచ్చి పడ్డాయి. పలువురు తమ వద్ద ఉన్న నగదుతో పాటు తమ స్నేహితులు, బంధువులతో దాదాపు రూ.10లక్షల నుంచి రూ.2కోట్ల వరకు పెట్టుబడులు పెట్టించారు. అలా రెండు, మూడు వందల మంది నుంచి సుమారు రూ.20 నుండి 25 కోట్లకు పైగా వసూలు చేశారు. పెట్టుబడి పెట్టిన వారికి కేవలం కొన్ని నెలలు మాత్రమే వడ్డీలు చెల్లించారు. కొందరైతే గత నెలలో చెల్లించి అసలు ఒక్క రూపాయి తీసుకున్నది లేకపోవటం ఆందోళన చెందుతున్నారు. కొన్ని నెలలు సక్రమంగా చెల్లించిన కంపెనీ ప్రజల నుండి డబ్బు పెద్దఎత్తున రాకపోవటంతో కస్టమర్లకు చెల్లింపులు ఆపివేసింది. డబ్బులు చెల్లించే పరిస్థితి లేకపోవటంతో బ్యాంక్ ఆకౌంట్ ఫ్రీజ్ అంటూ కొత్త నాటకానికి తెరతీసింది కంపెనీ యాజమాన్యం. ఒక నెల గడపటంతో సక్సెస్ అయిన యాజమానులు ఇప్పుడు కంపెనీకి నష్టాలు వచ్చాయి కొన్ని రోజులు ఆగండి అంటూ గడువులు విధిస్తోంది. గట్టిగా డబ్బులు అడిగే వారిని కేసులు పెట్టుకోండి అంటూ బెదిరింపులకు దిగటం గమనార్హం. కొంత మందినైతే మీరు మాకు డబ్బులు ఇవ్వలేదు, ఏజెంట్లకు ఇచ్చారు వారిని అడిగి తీసుకోండి అంటూ ప్లేటు ఫిరాయించటం, ఏజెంట్లు డబ్బులు అడిగితే కమీషన్లు తీసుకోలేదా కొన్ని రోజులు ఆపండి అంటూ సాగతీత ధోరణి అవలంభిస్తుండటంతో గుంటూరు, అరండల్‌పేట బాధితుల రోదనలతో అట్టుడికిపోతోంది. ఇక బాధితులు అందరూ అవని వారి క్యాపిటల్ & ఇన్వెస్టర్స్ పేరుతో కోటక్ మహీంద్ర బ్యాంక్‌లో ఉన్న కరెంట్ అకౌంట్‌లో డబ్బులు వేయగా, జామీనుగా దూపాటి వీరాంజనేయ ప్రసాద్ పేరుతో తన వ్యక్తిగత అకౌంట్ చెక్కులు ఇవ్వటం ఇక్కడ కొసమెరుపు.
ట్రేడింగ్ లేదు, అంతా మనీ సర్కులేషన్ !
పెట్టుబడికి రెండింతలు, మూడింతలు మనీ రిటర్న్ ఇస్తాం అంటూ పెట్టుబడులను ఆకర్షించే ఈ ముఠా అమాయక ప్రజýను టార్గెట్ చేసుకుంది. నమ్మి పెట్టుబడులు పెట్టించి కేవలం కొన్ని నెలలు మాత్రమే చెల్లించి క్రమక్రమంగా దుకాణం సర్దేయటం వీళ్ళ ఆలోచనగా తెలుస్తోంది. మొదట్లో కొంచం షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినా యజమానులకు షేర్ మార్కెట్ గురించి కనీస అవగాహన లేకపోవటంతో 3 వ వ్యక్తిని నమ్మి పెట్టుబడి పెట్టి కొంత మేర నష్టపోవటంతో షేర్ మార్కెట్ జోలికి పోకుండా తెలిసిన రియల్ ఏస్టేట్‌లోని భూములపై పెట్టుబడులు పెట్టటం జరిగింది. ఇక చేసేది లేక జనం నుండి వసూలు చేసిన సొమ్మునే మళ్ళీ జనానికి తిరిగి చెల్లిస్తున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రజల నుండి డబ్బులు రాకపోవటంతో అందరికీ డబ్బులు చెల్లించటం ఆపివేసింది అవని వారి క్యాపిటల్ & ఇన్వెస్టర్స్. భూమి యజమానికి సగం ధర చెల్లించి అగ్రిమెంట్లు చేసుకోవటం దానిని డెవలప్ చేసి రెండింతలు అధికంగా ధర చూపి కస్టమర్లకు అంటగట్టటం ఇదో నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది.
చిట్‌ఫండ్స్ మాయాజాలం !
విజయశ్రీవారాహి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అధికారికంగా 3 నెలల క్రితం దూపాటి వీరాంజనేయ ప్రసాద్, పెడర్ల విజయలక్ష్మీ పేర్ల మీద ఒక ప్రై.లి. కంపెనీ అదే ఆఫీసు ప్రాంగణంలో వెలిసింది. కానీ 13 నెలల క్రితమే అనధికారికంగా ప్రారంభమైన ఈ చిట్‌ఫండ్ కంపెనీలో చిట్‌లు పాడిన వారికి డబ్బులు ఇవ్వటం లేదు. చిట్ పాడుకున్న వారిని మభ్యపెట్టి అధిక వడ్డీ ఆశ చూపి వారి దగ్గరే ఉంచుకోవటం గమనార్హం. ఈ డబ్బులన్నీ వేర్వేరు కుటుంబసభ్యుల పేరు మీద భూములు కొనుగోలుకు వినియోగిస్తున్నట్లు పరిశీలనలో తేలింది. మరోవైపు అవని వారి క్యాపిటల్ Ê ఇన్వెస్టర్స్‌లో డబ్బులు పెట్టిన ఏజెంట్ల కమీషన్లు సైతం ఇవ్వకుండా తెలివిగా కమీషన్ డబ్బులను చిట్స్‌లోకి మళ్ళించటం, చిట్ పాడుకున్న డబ్బులు ఇవ్వకపోవటంతో యాజమాన్యంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే ఐ.పీ. పెట్టి ఆస్ట్రేలియా వెళ్ళే పనిలో యాజమాన్యం ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
పెడర్ల విజయలక్ష్మీ కూతురు పేరు మీద భారీగా ఆస్తుల కొనుగోలు !
ప్రజల నుండి వసూలు చేసిన డబ్బును పెడర్ల విజయలక్ష్మీ తెలివిగా తన సొంత కూతురు పేరు మీద భారీగా ఆస్తులు పోగోసినట్టు తెలుస్తుంది. రూ. 1.50 కోట్ల విలువైన ప్లాట్‌తో పాటు 2.5 కోట్ల విలువైన బంగారం, హాస్పిటల్ కోసం స్థలం ఇలా కస్టమర్ల డబ్బును పెడర్ల విజయలక్ష్మీ తన కూతురు పేరు మీద కోట్లాది రూపాయలు వెనకేసుకుంది. కస్టమర్ల నుండి ఒత్తిడి తీవ్రమవుతున్న నేపథ్యంలో అభియోగాలు అన్ని దూపాటి వీరాంజనేయప్రసాద్‌పైకి నెట్టి తను తన కూతురు తాను తప్పించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిస్తుంది. ఐ.పి. పెట్టే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆఫీసుకు రాకపోవటం, సమాచారం మొత్తం వీరాంజనేయ ప్రసాద్ అనుచరుడి ఇంట్లో దాచిపెట్టడం, డబ్బులు అడుగుతున్న కస్టమర్లను వాయిదాలతో మభ్యపెట్టడం కొనసాగుతోంది.
పెడర్ల విజయలక్ష్మీ దురుసు ప్రవర్తన !
కస్టమర్లు ఎవరైనా డబ్బులు అడిగితే చీర చించుకోవటం, అత్యాచారానికి ప్రయత్నించాడు అని అభియోగం మోపి తెలిసిన పోలీసుల ద్వారా కేసులు పెట్టిస్తా అని భయపెట్టడం ఆమెకు ముందస్తు ప్రణాళికలో ఒక భాగం. గట్టిగా డబ్బులు అడిగిన వారికి రేప్ కేసు పెడతా అంటూ ఎదురుదాడికి దిగటం, డబ్బులు ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరింపులకు పాల్పడుతుండటం గమనార్హం. గట్టిగా డబ్బులు అడిగిన పాపానికి ఒకతనికి 10 మంది రౌడీలను తీసుకొచ్చి చంపేయమని పురమాయించటం ఆమె వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. గతంలోనే పెడర్ల విజయలక్ష్మీ పేరు మీద పలు స్టేషన్లలో కేసులు ఉండగా, ఒక సి.ఐ.తో సాన్నిహిత్యం పెంచుకుని, సి.ఐ. పేరు వాడుకుంటూ ఇతరులపై బెదిరింపులకు పాల్పడుతుండటం విశేషం.

