మార్చి నెలలో ట్రేడ్ దోస్త్ పేరుతో కస్టమర్లను నిలువుదోపిడీ చేసిన అన్నం వెంటక పూర్ణచంద్రరావు సంఘటన మరువక ముందే అదే కోవలో మరో సంస్థ రూ. 10 వడ్డీ పేరుతో మరోసారి కుచ్చుటోపి పెట్టే ప్రయత్నం చేస్తోంది. మైల్యాండ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ పేరుతో రియలఎస్టేట్ ముసుగుతో ప్రజల నుండి డబ్బులు వసూలు చేసే ప్రక్రియను మొదలుపెట్టారు రాజు, శాంసన్. రాజు పేరుతో ప్రాంఛైజీ తీసుకుని మధ్యతరగతి వారినే టార్గెట్ చేసుకుని పెట్టుబడుల పేరుతో వసూళ్ళకు పాల్పడుతున్నారు.
బుకాయింపు !
గుంటూరు ఫ్రాంచైజీ యజమాని రాజును ఫోన్‌లో సంప్రదించగా మాకు అన్నిరకాల పర్మిషన్లు ఉన్నాయి అని బుకాయించే ప్రయత్నం చేశారు. అన్నిరకాల టాక్స్‌లు, జీఎస్టీలు కడుతున్నాం అని తెలియజేశారు. ఇప్పటికే గుంటూరు ప్రాంఛైజీ రూ. 1.5 కోట్ల పెట్టుబడులను సేకరించింది. దానిలో ఎంత అడ్వాన్స్ టాక్స్ కట్టారు, ఏ నంబర్ మీద కట్టారు ? ఎప్పుడు కట్టారు ? అని అడిగితే మౌనమే సమాధానం అయ్యింది. అసలు డబ్బులన్నీ మై ల్యాండ్ ఇన్‌ప్రా డెవలపర్స్ అకౌంట్‌కి మాత్రమే జమ అవుతున్నాయి. ఆ పేరు మీదే కస్టమర్లకు చెక్కులు ఇస్తున్నారు. మై ల్యాండ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ కంపెనీ పేరు మీద ఎలాంటి ప్రై.లి. కంపెనీ రిజిస్టర్ కాలేదు, దాని జీఎస్టీ నంబర్ చెప్పండి అని అడిగినా బుకాయించే ప్రయత్నం తప్పించి సాక్ష్యాలు చూపే ప్రయత్నం చేయకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది.
మోసానికి పరాకాష్ట !
ఉదాహరణకి రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు లేదా బంగారం ష్యూరిటీ కింద ఇస్తామని నమ్మిస్తుంది మైల్యాండ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్. కానీ 4 లేదా 4.5 లక్షలకే బంగారం ఇస్తుంది. అదేమంటే జీఎస్టీ కింద 5%, మరో 5% అడ్మిన్ ఛార్జెస్ పేరుతో కోత విధిస్తారు. అదీ కూడా విజయవాడలో తమ ఆధీనంలోని బంగారు ఆభరణాల సంస్థలోనే తీసుకోవాలి. వారు ఎంత తరుగు చెప్తే అంతకే తీసుకోవాలి. ఇదో రకమైన దందా. ఇవన్నీ ఒకేలే అని సరిపెట్టుకున్నా మిగిలిన రూ. 5 లక్షలకు భూమి అగ్రిమెంట్ అత్యంత కీలకమైంది. గుంటూరులో రూ. 1. 5 కోట్ల రూపాయలు పెట్టుబడి పేరుతో వసూలు చేసిన ఎవరికీ భూమి అగ్రిమెంట్ చేయలేదు. ఎందుకంటే భూమిని ఇంకా కొనలేదు. అది కూడా అగ్రిమెంట్ దశలో ఉన్నట్లు సమాచారం. 1.5 ఎకరాల భూమికి 25% డబ్బులు చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. రైతు దగ్గర అగ్రిమెంట్ చేసుకున్న భూమిని కస్టమర్లకు 50 గజాలు, 100 గజాల పేరుతో కస్టమర్లకు రీ అగ్రిమెంట్ చేయటం, చేసిన ప్లాటునే నమ్మించేందుకు మళ్ళీ మళ్లీ అగ్రిమెంట్లు చేయటం ఏదైతే ఉందో...కావాలని చేస్తున్న మోసం. ఇంతకు ముందు మోసం చేసిన సంస్థలు కూడా ఇదే తరహాలో ఇదే పంథాను అనుసరించాయి. అంటే మైల్యాండ్ చేసిన అగ్రిమెంట్ దేనికి పనికిరాదు అని అర్థం చేసుకోవాలి. కొంత మంది వ్యక్తులు ఏజెంట్లుగా అవతారం ఎత్తి ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో కస్టమర్లను మోసం చేయటం ఒక అలవాటుగా మారింది.
బాధితులారా ఏకంకండి !
మళ్ళీ మళ్లీ ఇలాంటి సంస్థలు పెట్టుబడుల పేరుతో కుచ్చుటోపిలు పెడుతుంటే చూస్తూ ఊరుకోవటం ఇంక ఎంత వరకు సమంజసం కాదు. ఇలాంటి మోసపూరిత సంస్థల పట్ల ముందుగానే మేల్కొని అప్రమత్తతతో వ్యవహరించి ప్రజల్లో అవగాహన కల్పించటం మా కర్తవ్యంగా భావిస్తున్నాయి. సంస్థల మోసపూరిత చర్యలను బహిరంగపరచి వారిని తరిమివేయాల్సి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే మై ల్యాండ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఒడిస్సా (భువనేశ్వర్), ఛత్తీస్‌ఘడ్ (రాయచూర్), శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతంల్లో గత రెండు నెలల నుండి డబ్బులు చెల్లించటం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. బాధితులందరూ ఏకమై పోరాడాల్సిన అవసరం ఏంతైనా ఉంది. ఇప్పటికే కొందరు మమ్మల్ని సంప్రదించటం జరిగింది. బాధితులందరూ అందరూ ఏకమై, వివిధ పోలీస్ స్టేషన్లలో భయపడకుండా కేసులు వేయటం వలన ఆర్.బి.ఐ. అనుమతి లేకుండా ప్రజల నుండి అక్రమ డిపాజిట్లు వసూళ్లు చేస్తున్నందుకు గాను రూ. 3 కోట్లు దాటిన మోసాలపై బాధితులందరూ కలిసి బడ్స్ యాక్ట్, 2019 నమోదు చేయవచ్చు. ఏవరైతే మై ల్యాండ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ను నమ్మి పెట్టుబడులు పెట్టారో దానికి సంబంధించిన బ్యాంకు అకౌంటు వివరాలు లేదా మై ల్యాండ్ వారి ఇచ్చిన రసీదు మరియు అగ్రిమెంట్ల వివరాలను samajtoday1@gmail.com ఈ-మెయిల్ చేయగలరు. వాటిని పరిశోధించి ఎక్కడ ఎలాంటి మోసం జరిగిందో అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తాము.

