టాలీవుడ్ వెండితెరపై ఇప్పుడు కొత్త రకం కథల గాలి వీస్తోంది. కానీ, ఈ వినూత్నమైన ఆలోచనలకు పునాది ఎక్కడ పడింది అని ఆరా తీస్తే.. దర్శకుడు జయశంకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ఎప్పుడో చేసిన ప్రయోగాలు, నేటి బాక్సాఫీస్ హిట్‌లకు స్ఫూర్తిగా నిలుస్తుండటం విశేషం.
‘క’ (KA) విజయం.. ఆనాడే ‘ది గాడ్ మస్ట్ బి క్రేజీ’!
ఇటీవల కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ (KA) చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే, ఈ సినిమాలోని దేవుడికి-మనిషికి మధ్య జరిగే ఆ విలక్షణ సంభాషణలు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే చూస్తుంటే సినీ విశ్లేషకులకు 2015లో జయశంకర్ రూపొందించిన ‘ది గాడ్ మస్ట్ బి క్రేజీ’ షార్ట్ ఫిల్మ్ గుర్తుకు వస్తోంది. దశాబ్దం క్రితమే ఆయన ఆవిష్కరించిన ఆ కాన్సెప్ట్ నేటి సినిమాల్లో మెయిన్ పాయింట్‌గా మారుతుండటం ఆయన విజన్‌కు నిదర్శనం.
కోలీవుడ్ ‘LIK’ వెనుక ‘విటమిన్ షీ’ ఛాయలు?
ప్రస్తుతం కోలీవుడ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న ‘LIK’ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్ర కథాంశం కూడా జయశంకర్ 2020లో తెరకెక్కించిన ‘విటమిన్ షీ’ని పోలి ఉండటం గమనార్హం. నోమోఫోబియా (Nomophobia) అంటే మొబైల్‌కు బానిసైన యువకుడి జీవితం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి జీవితాన్ని ఎలా శాసిస్తుందనే పాయింట్ మీద నాలుగేళ్ల క్రితమే జయశంకర్ ఎంతో ముందుచూపుతో వెండితెరపై ఆవిష్కరించారు.
వివాదంతో మరుగున పడిన ‘అరి’ (ARI)
జయశంకర్ తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం ‘అరి’ (Ari: My Name is Nobody). భారతీయ వెండితెరపై ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయయని ఒక లోతైన ఫిలాసఫికల్ పాయింట్‌తో రూపొందిన ఈ సినిమా దురదృష్టవశాత్తు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ చుట్టూ ముసురుకున్న వివాదం ఈ సినిమా పబ్లిసిటీపై దెబ్బకొట్టింది. ఫలితంగా ఒక గొప్ప కంటెంట్ ఉన్న సినిమాకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు.
కంటెంట్ నమ్ముకున్న దార్శనిక దర్శకుడు
టాలీవుడ్‌లో కమర్షియల్ ఫార్ములాల కంటే కంటెంట్‌ను నమ్ముకునే దర్శకులు చాలా తక్కువ. ఆ జాబితాలో జయశంకర్ ముందు వరుసలో ఉంటారు. “సక్సెస్ ఎవరిని వరించినా.. ఆ సక్సెస్ వెనుక ఉన్న ‘ఐడియా’ మాత్రం జయశంకర్ వంటి దార్శనికత ఉన్న దర్శకుడిదే” అని ఇండస్ట్రీ టాక్. ట్రెండ్‌ను ఫాలో అవ్వడం కాదు, ట్రెండ్‌ను సెట్ చేసే సత్తా ఉన్న జయశంకర్ నుండి త్వరలోనే మరిన్ని వినూత్న చిత్రాలు రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

