దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటు చేసుకొంది. కేవలం రూ.350 కోసం 18 ఏళ్ల యువకుడిని 16 ఏళ్ల బాలుడు అనేకసార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర దిల్లీలో వెల్‌కమ్ ప్రాంతంలో ఒక బాలుడు దారిన వెళుతున్న యువకుడిపై దాడికి దిగాడు. బాధితుడిపై దాడి చేసి ఊపిరాడనీయలేదు. ఆ తర్వాత నిర్ధాక్షిణ్యంగా బాధితుడి ముఖం, చెవులు, ముఖంపై కత్తితో పొడిచి అతని మెడపై కోసేశాడు. హత్య చేస్తున్న సమయంలో కొద్దిసేపు ఆపి చుట్టుప్రక్కల పరిసరాలను గమనిస్తున్నాడు. అతడు స్పృహ కోల్పోయిన తర్వాత తన వద్ద ఉన్న కత్తితో దాదాపు 60 సార్లు పొడిచాడు. దీంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అతడి వద్ద ఉన్న రూ.350 నగదు తీసుకొన్నాడు. కొద్దిసేపు మృతదేహం ఎదుట డాన్స్ చేస్తూ.. పైశాచికంగా ప్రవర్తించాడు. లభించిన ఆధారాల ప్రకారం నిందితుడు మద్యం తాగి ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దారుణమంతా సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ యువకుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధితుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మురం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ పుటేజీని పరిశీలించగా.. ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. మరణించిన వ్యక్తితో నిందితుడికి గతంలో ఎలాంటి పరిచయం లేదని తేలింది. కేవలం డబ్బు కోసమే హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.