Amit Choudhary: న్యాయవిద్య చదివి.. తన కేసు తానే వాదించుకుని !

0

చేయని నేరానికి రెండేండ్ల జైలు.. తలకిందులైన జీవితం.. చెల్లాచెదురైన కలలు.. అయినా కుంగిపోలేదు.. ఆశను వీడలేదు.. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని బలంగా నిశ్చయించుకున్నాడు.. సంక్షోభాన్ని అవకాశంగా మలచుకున్నాడు.. తన కేసును తానే వాదించుకోవాలని నిర్ణయించుకున్నాడు.. బెయిల్‌పై బయటకు వచ్చి పట్టుదలతో న్యాయవిద్యను అభ్యసించాడు.. కేసును వాదించి గెలిచాడు.. చివరికి నిర్దోషిగా బయటకు వచ్చాడు.. తన చుట్టూ అల్లుకున్న చిక్కుముళ్లను తానే ఛేదించుకొని నిర్దోషిగా బయటపడి జీవితాన్ని గెలిచిన స్ఫూర్తిగాథ ఇది.

కష్టాలకు కుంగిపోకుండా

చేయని నేరానికి ఎవరైనా శిక్ష అనుభవించాల్సి వస్తే ఆ బాధ వర్ణనాతీతం. చాలా మంది మానసికంగా కుంగిపోతారు. సాధారణ జీవితాన్ని గడపలేని స్థితికి చేరుకుంటారు. కానీ, అమిత్‌ చౌదరి ఇందుకు భిన్నం. 2011లో ఆయన 18 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు చేయని ఓ నేరంలో నిందితుడిగా ఇరుక్కున్నాడు. మీరట్‌లో ఇద్దరు కానిస్టేబుళ్ల హత్యకు సంబంధించిన కేసులో నాటి ముఖ్యమంత్రి మాయావతి ఆదేశాల మేరకు భారత శిక్షా స్మృతి (ఐపీసీ)తోపాటు జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. వాస్తవానికి హత్యలు జరిగిన సమయంలో అమిత్‌ మేరఠ్‌లోనే లేడు. శామ్లీ పట్టణంలోని తన సోదరి ఇంట్లో ఉన్నాడు. అయినప్పటికీ ఈ కేసులో అరెస్టయిన 17 మందిలో అమిత్‌ను కూడా చేర్చారు. కైల్‌ అనే వ్యక్తికి చెందిన ముఠాలో సభ్యుడిగా ఉంటూ హత్యకు కుట్ర పన్నారని ఆరోపించి, ఆయనపై గ్యాంగ్‌స్టర్‌ ముద్ర కూడా వేయడంతో జైలులో రెండేళ్ళు ఊచలు లెక్కించాల్సి వచ్చింది. దీంతో అమిత్‌ చౌదరి జీవితంలో అంధకారం అలుముకున్నది. అయినప్పటికీ ఆయనేమీ కుంగిపోలేదు. న్యాయ విద్యను అభ్యసించడం ద్వారా తన కేసును తానే వాదించుకుని నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాడు. రైతు బిడ్డ అయిన అమిత్‌ చౌదరిని ముజఫర్‌నగర్‌ జైలులో కరుడు గట్టిన గ్యాంగ్‌స్టర్లు ఎన్నో ప్రలోభాలు పెట్టారు. తమ గ్యాంగ్‌లలో చేరాలని ఒత్తిడి తెచ్చారు. అయినా ఆయన లొంగలేదు. ఈ విషయంలో జైలర్‌ తనకు ఎంతో సహకరించారని, గ్యాంగ్‌స్టర్లు ఉన్న బ్యారక్‌ నుంచి తనను వేరే బ్యారక్‌కు మార్చారని అమిత్‌ చౌదరి తెలిపారు.

బెయిల్‌పై విడుదలై..

ఇలా రెండేళ్ల జైలు జీవితం తర్వాత 2013లో అమిత్‌ బెయిలు మీద విడుదలయ్యారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం ద్వారా తన కుటుంబం తిరిగి తలెత్తుకొని తిరిగేలా చేయాలని అమిత్‌ నిశ్చయించుకున్నారు. కుంగుబాటు ఆలోచనలను పక్కన పెట్టి.. బీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. బార్‌ కౌన్సిల్‌ పరీక్షలోనూ ఉత్తీర్ణులయ్యాక.. చట్టపరమైన అంశాలపై వచ్చిన పట్టుతో తన కేసును తానే చేపట్టాడు. ఈ కేసులో అమిత్‌ చౌదరిపై మోపిన అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమవడంతో ఆయనతో సహా 13 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ కేసులో అసలు నేరస్థులైన ముగ్గురిలో సుమిత్‌ కైల్‌ అనే వ్యక్తి 2013లో ఓ ఎన్‌కౌంటర్‌లో మరణించగా.. నీతూ అనే మరో వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది. మరో నేరస్థుడు ధర్మేంద్ర ఇటీవల క్యాన్సర్‌తో మృతి చెందాడు. కాగా, ఈ కేసు వల్ల సైనిక దళంలో చేరాలన్న అమిత్‌ చౌదరి కలలు చెల్లాచెదురైపోయాయి. అయినప్పటికీ తన మాదిరిగా అపనిందల పాలైనవారికి అండగా నిలవాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకోసం క్రిమినల్‌ జస్టిస్‌లో పీహెచ్‌డీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

లాయర్‌గా చూసి.. గుర్తుపట్టని పోలీసు అధికారి

పోలీసులు మొదట్లో ఎలాంటి స్టేట్‌మెంట్లు, ఆధారాలు సేకరించకపోవడంతో ఈ కేసు నత్తనడకన సాగిందని అమిత్‌ తెలిపారు. తాను పూర్తిగా ఈ కేసుపైనే దృష్టి సారించి కోర్టులో వాదనలు వినిపించినట్లు చెప్పారు. విచారణలో భాగంగా ఓసారి ఆయనను అరెస్టుచేసిన పోలీసు అధికారి బోనులో నిలబడాల్సి వచ్చింది. న్యాయవాదిగా కేసు వాదిస్తున్న తనను ఆ అధికారి గుర్తుపట్టకపోవడం జడ్జిని ఆశ్చర్యానికి గురిచేసిందని అమిత్‌ వెల్లడిరచారు. దీంతో ఈ కేసులో నిందితుల పేర్లను ఎంత గుడ్డిగా చేర్చారో న్యాయమూర్తికి అర్థమైందన్నారు. జంటహత్యల్లో తన ప్రమేయం ఉన్నట్లుగా నిరూపించే ఒక్క ఆధారాన్నీ పోలీసులు కోర్టుకు సమర్పించలేకపోయారని అమిత్‌ తెలిపారు. ఆయనతోపాటు మొత్తం 13 మందిని నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !