Tillu Square : టిల్లు స్వ్కేర్‌ సినిమా రివ్య్వూ !

0

డీజే టిల్లు’ (Tillu Square Review) చిత్రంతో ఒక్కసారిగా సినీప్రియుల్లో భారీ క్రేజ్‌ సంపాదించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆ సినిమాలో టిల్లుగా అతడు చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడా పాత్రతో మరోమారు థియేటర్లలో నవ్వులు పూయించేందుకు ‘టిల్లు స్క్వేర్‌’ వచ్చేశాడు. ఈసారి ఇందులో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా నటించింది. టీజర్‌, ట్రైలర్లలో చూపించిన కంటెంట్‌ ‘డీజే టిల్లు’ (Tillu Square Review) తరహాలోనే వినోదాత్మకంగా ఉండటం.. విడుదలకు ముందే పాటలు కూడా మంచి ఆదరణ దక్కించుకోవడంతో అందరి దృష్టి ఈ సీక్వెల్‌పైనా పడిరది. మరి మరోసారి టిల్లు చేసిన సందడి సినీప్రియుల్ని నవ్వించిందా? తను ఈ చిత్రంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడా?

కథేంటంటే

టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) సొంతంగా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ప్రారంభిస్తాడు. పెద్ద పెద్ద ఈవెంట్స్‌ చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. పాత గొడవలన్నీ మర్చిపోయి మళ్లీ తనదైన శైలిలో సరదాగా జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుంటాడు. సరిగ్గా అప్పుడే అతని జీవితంలోకి లిల్లీ (అనుపమ పరమేశ్వరన్‌) అనే మరో అందమైన అమ్మాయి ప్రవేశిస్తుంది. వాళ్లిద్దరూ అనుకోకుండా ఓ పబ్‌లో కలుసుకుంటారు. ముందు టిల్లు ఆమెతో మాట కలుపుతాడు. అతడి మాటలు.. వ్యవహారశైలి నచ్చి ఆమె తనతో పెదవి కలుపుతుంది. అంతే.. అదే రాత్రి ఇద్దరూ ఒక్కటవుతారు. కట్‌ చేస్తే తెల్లారేసరికి గదిలో ఒక ఉత్తరంపెట్టి లిల్లీ అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. కానీ, ఆ ఒక్క పూటలోనే ఆమెను మనసంతా నింపేసుకున్న టిల్లు ఆ ఆలోచనలతో పిచ్చివాడైపోతాడు. ఆమెను వెతికి పట్టుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో నెలరోజుల తరువాత ఒకరోజు ఆసుపత్రి దగ్గర లిల్లి కనపడుతుంది. తను గర్భవతినని చెప్పడంతో టిల్లు షాకవుతాడు. ఆ తర్వాత తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంటికి తీసుకొస్తాడు. టిల్లు తల్లిదండ్రులు కూడా చేసుకోమని చెప్తారు, వేరే దారిలేక లిల్లిని పెళ్లి చేసుకుంటాను అంటాడు. ఈలోపు మళ్లీ టిల్లు పుట్టినరోజు వస్తుంది. లిల్లిని కూడా తీసుకురావటానికి టిల్లు, లిల్లి వున్న లొకేషన్‌ కి వెళతాడు. అక్కడే ఎదో తేడా కొడుతూ ఉంటుంది. ‘డీజె టిల్లు’ (Tillu Square Review) లో రాధిక కోసం కూడా అదే అపార్ట్మెంట్స్‌ కి రావటం టిల్లు కి తెలుసు, మళ్ళీ ఇప్పుడు లిల్లి కోసం కూడా అదే అపార్ట్మెంట్స్‌ కి రావటంతో ఎదో తేడా కొడుతోందని టిల్లుకి (Tillu Square Review) అర్థం అవుతోంది. లిల్లిని కలుస్తాడు, ఏమైంది అని అడిగితే తన అన్న రోహిత్‌ తప్పిపోయి అప్పటికి ఒక సంవత్సరం అయిందని చెపుతుంది. టిల్లు కంగారు పడతాడు, ఎందుకంటే రోహిత్‌ ని ‘డీజీ టిల్లు’ లో పూడ్చిపెట్టింది అతనే కాబట్టి. ఇంతకీ లిల్లీ ఎవరు? రోహిత్‌ నిజంగానే ఆమెకి అన్నయ్య అవుతాడా? అప్పటి పాత కేసు మళ్ళీ ఎందుకు తిరగతోడారు? ప్రిన్స్‌ సెసిల్‌ మళ్ళీ టిల్లు ని ఏమి చేస్తాడు? అంతర్జాతీయ డాన్‌ (మురళి శర్మ) హైదరాబాదు ఎందుకు వస్తున్నాడు? అతనికి టిల్లుకి ఏంటి సంబంధం? అసలు ఈ కథంతా ఎటు వెళుతుంది? టిల్లు పుట్టినరోజునాడు ఎందుకు అలా కేసుల్లో ఇరుక్కుంటూ ఉంటాడు? ఇవన్నీ తెలియాలంటే ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square Review)సినిమా చూడాల్సిందే.

ఎలా సాగిందంటే

‘డీజే టిల్లు’లో కథ కంటే ఎక్కువగా ప్రేక్షకుల్ని కట్టిపడేసింది టిల్లు పాత్రను తీర్చిదిద్దుకున్న తీరే. ఆ పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ చెప్పే సంభాషణలు.. అతని వ్యవహార శైలి.. పలికించే హావభావాలు అందర్నీ కడుపుబ్బా నవ్వించాయి. ‘కథ.. కాకరకాయ’ అంటూ లాజిక్‌లు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా రెండున్నర గంటల పాటు థియేటర్లలో హాయిగా పడి పడి నవ్వుకునేలా చేశాయి. ఇప్పుడదే మ్యాజిక్‌ను ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square Review) తో మరోసారి పునరావృతం చేయడం కోసం సిద్ధు తన కలం బలంతో.. నటనా ప్రతిభతో శక్తివంచన లేకుండా కృషి చేశాడు. ఆ ప్రయత్నంలో విజయం సాధించాడు. ఈ సీక్వెల్‌ కథ కూడా తొలి భాగం తరహాలోనే సింపుల్‌ లైన్‌లో సాగిపోతుంది. కాకపోతే మరోసారి టిల్లు పాత్రే ఆ సాధారణమైన కథను అసాధారణమైన నటనతో అద్భుతంగా నిలబెట్టేసింది.ఈ కథ తొలి భాగంలో జరిగిన కథతో కొంత వరకు ముడిపడి ఉంటుంది. అందుకే చిత్ర బృందం టైటిల్‌ కార్డ్స్‌తోనే తొలి భాగం కథను క్లుప్తంగా మరోసారి పరిచయం చేసే ప్రయత్నం చేసింది. ‘డీజే టిల్లూ చూడూ’ (Tillu Square Review) రీమిక్స్‌ పాటతో సిద్ధు పరిచయమైన తీరు ప్రేక్షకులకు హుషారు తెప్పిస్తుంది. సినిమా మొదలవటమే డీజీ టిల్లు కాస్తా టిల్లు ఈవెంట్స్‌ అని మార్చడం, టిల్లు కోసం పెళ్ళిలో పెళ్లికూతురు పెళ్లి చేసుకోను అనేదాకా రావటం, ఈ సన్నివేశాలన్నీ ముందు నుంచీ సినిమా మీద ఆసక్తిని పెంచుతాయి. అనుపమ పరమేశ్వరన్‌ కనిపించిన తరువాత కథ కొంచెం మామూలుగా వున్నా, ఎప్పుడైతే టిల్లు మళ్ళీ ఆ పాత అపార్ట్మెంట్స్‌ కి రావటం, అక్కడ ముందు సినిమాలో చనిపోయిన రోహిత్‌, రాధిక పాత్రలను గుర్తు చెయ్యడం, ఇవన్నీ కథలో ఆసక్తిని పెంచడమే కాకుండా ‘డీజీ టిల్లు’ (Tillu Square Review) కథని ఇక్కడ బాగా కలిపాడు. అలాగే అనుపమ పరమేశ్వరన్‌ ముందు అమాయకంగా కనిపించినా ఆమె నిజస్వరూపం చూపించే సన్నివేశం అయితే థియేటర్‌ మొత్తం నవ్వులతో నిండిపోతుంది. ఎందుకంటే ఆ సన్నివేశానికి ఇచ్చిన నేపధ్య సంగీతం ఆలా ఉంటుంది. అలాంటివి చాలానే వున్నాయి సినిమాలో. అనుపమ నేపధ్యం కూడా బాగానే చూపించాడు. అలాగే ముందు సినిమా ‘డీజే టిల్లు’ కి లింకప్‌ కూడా బాగానే ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి తొలి భాగాన్ని గుర్తు చేసేలాగే మరోసారి టిల్లు లైఫ్‌ సాగుతుంది. లిల్లీ పాత్ర పరిచయ సన్నివేశాలు.. టిల్లు ఠక్కున ఆమె మాయలో పడిపోవడం.. ఒక్క రాత్రిలోనే ఇద్దరూ ఒక్కటవ్వడం.. ఇలా అంతా రాధిక ఎపిసోడ్‌ మరోసారి లిల్లీ వెర్షన్‌లో పునరావృతమవుతున్నట్లు అనిపిస్తుంది. ఇక టిల్లు తన బర్త్‌డే పార్టీని వదిలేసి లిల్లీని వెతుక్కుంటూ పాత రాధిక అపార్ట్‌మెంట్‌కే వెళ్లడం.. ఆరోజు చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూ మళ్లీ అదే సమస్యలోకి దిగడం ఆసక్తిరేకెత్తిస్తుంది. ఆ తర్వాత నుంచే ఈ కథలో కొత్త కోణం బయటకొస్తుంది. నిజానికి ఈ మధ్యలో సాగే తతంగమంతా కొందరికి పాత కథను మళ్లీ చూస్తున్నామన్న అనుభూతి కలిగించినా టిల్లు పాత్ర చేసే అల్లరితో అదంతా కొట్టుకుపోతుంది. దీనికి తోడు మధ్యలో టిల్లు-లిల్లీ మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలు యువతరానికి కనుల విందుగా అనిపిస్తాయి. అలాగే ఆస్పత్రిలో టిల్లు ఫ్యామిలీకి.. లిల్లీ తండ్రికీ మధ్య జరిగే ఎపిసోడ్‌ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు గంగ చంద్రముఖిగా మారినట్లుగా లిల్లీ ఓ కొత్త అవతారంలో తెరపైకి వచ్చి పడుతుంది. అది మరీ అంత థ్రిల్‌ ఇవ్వకున్నా ఫర్వాలేదనిపిస్తుంది. ఇక ద్వితీయార్ధం షేక్‌ మహబూబ్‌ అలీని పట్టుకునే మిషన్‌ నేపథ్యంలో సాగుతుంది. అంత పెద్ద క్రిమినల్‌ను చంపడానికి టిల్లులాంటి సాధారణ వ్యక్తితో ఎలాంటి సాహసాలు చేయిస్తారన్న ఆసక్తి అందరిలోనూ కలుగుతుంది. నిజానికి ఆ ప్రయత్నం మరీ అంత థ్రిల్లింగ్‌గా సాగకున్నా ఎక్కడా బోర్‌ కొట్టించదు. ఇక ప్రీక్లైమాక్స్‌కు ముందు రాధిక పాత్ర కూడా కథలోకి దిగడంతో సినిమాలో వినోదం మరోసారి తారస్థాయికి వెళ్తుంది. ఈ క్రమంలో తన గతాన్ని గుర్తు చేసుకుంటూ టిల్లు చెప్పే సంభాషణలు నవ్విస్తాయి. క్లైమాక్స్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగినా.. అందులోని ట్విస్ట్‌ ఊహలకు అందేలాగే ఉంటుంది. ముగింపు సంతృప్తికరంగానే అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్‌ చిన్న చిన్న ట్విస్టులతో ఆసక్తిగా చూపించాడు. కథ మొత్తం చెప్పేస్తే చూసే ప్రేక్షకుడికి ఆసక్తి ఉండకపోవచ్చు అని ఇక్కడ అవన్నీ మాట్లాడటం లేదు కానీ, సినిమాలో ఆశ్చర్యం కొలిపే సన్నివేశాలు చాలానే వున్నాయి. దర్శకుడు మల్లిక్‌ రామ్‌, సినిమాని ఆసక్తిగా చూపించడంలో సఫలం అయ్యాడు. అలాగే సిద్దు జొన్నలగడ్డ కథ, మాటలు ఇప్పుడు ప్రేక్షకులకి ఎలా ఉండాలో, ఎలా ఉంటే ప్రేక్షకులకి నచ్చుతుందో వాళ్ళ నాడిని తెలుసుకొని అలానే రాసాడు సిద్దు. రామ్‌ మిరియాల సంగీతంలో ఇచ్చిన పాటలు అన్నీ సినిమా విడుదలకి ముందే మంచి విజయం సాధించాయి, సినిమాలో ఇంకా బాగుంటాయి. భీమ్స్‌ నేపధ్య సంగీతం సినిమాకి ఒక ఆయువుపట్టులా పనిచేసింది. ఛాయాగ్రహణం బాగుంది. 


ఎవరెలా చేశారంటే

టిల్లు పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ తనదైన నటనతో మరోసారి కట్టిపడేశాడు. తన పాత్ర కోసం రాసుకున్న వన్‌ లైనర్‌ డైలాగ్‌లన్నీ హిలేరియస్‌గా పేలాయి. అతను తెరపై కనిపిస్తున్నంత సేపూ మాటల్ని తూటాల్లా పేల్చుతూనే ఉంటారు. అవన్నీ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో పెద్దగా సంభాషణలు లేకున్నా.. హావభావాలతోనే నవ్వించే ప్రయత్నం చేశాడు. కాకపోతే అక్కడక్కడా వినిపించే కొన్ని ద్వంద్వార్థ సంభాషణలు కాస్త ఇబ్బంది పెడతాయి. లిల్లీ పాత్రలో అనుపమ తెరపై చాలా హాట్‌గా కనిపించింది. లిప్‌లాక్‌ల విషయంలో మొహమాట పడకుండా నటించింది. టిల్లు తల్లిదండ్రుల పాత్రలూ నవ్వులు పంచాయి. రాధిక పాత్రలో నేహా శెట్టి అతిథిలా తళుక్కున మెరిసింది. అలాగే ప్రియాంక జవాల్కర్‌ కూడా ఓ చిన్న పాత్రలో మెరిసింది. మురళీధర్‌ గౌడ్‌ తండ్రిగా మెప్పించాడు. సిద్దు స్నేహితులుగా అందరూ సహజంగా వున్నారు. మురళి శర్మ అతిధి పాత్రలో కనిపిస్తాడు. ప్రిన్స్‌ సెసిల్‌ తో పాటు ‘డీజే టిల్లు’ లోని కొన్ని పాత్రలు ఇందులో కూడా కనపడతారు. అక్కడక్కడా చిన్న చిన్న అడల్ట్‌ జోక్స్‌ ఉంటాయి. ఇంకొక డైలాగ్‌ వుంది ఈ సినిమాలో, ‘నువ్వు నిజంగానే ఈ కొశ్చన్‌ నన్ను అడుగుతున్నావా రాధికా?’ ఈ డైలాగు ఎంత పాపులర్‌ అంటే, ఈ మాటలు సిద్దు చెపుతుంటే ప్రేక్షకులు నవ్వులే నవ్వులు. సినిమాలోని రెండు పాటలు తెరపైనా కనువిందు చేస్తాయి. భీమ్స్‌ నేపథ్య సంగీతం చక్కగా కుదిరింది. కూర్పు బాగా కుదిరింది. నిడివి తక్కువ ఉండటం కలిసొచ్చే అంశం. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

(ఇది రచయిత యొక్క వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే) 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !