- దేశంలోనే ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం
- పీఠం 50 అడుగులు, విగ్రహం 125 అడుగుల స్మారకం
- ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ప్రారంభానికి సిద్ధమైంది. దేశంలోనే రెండవ అతిపెద్ద కాంస్య విగ్రహాం కాగా, ఇప్పటివరకూ ఉన్న అంబేడ్కర్ విగ్రహాల్లోకెల్లా ఎత్తయినదిగా హైదరాబాద్‌లో నిర్మించిన ఈ స్మారకం ఖ్యాతి గడిరచబోతోంది. పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠం, ఆపైన 125 అడుగుల నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఈ నెల 14న అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. హుస్సేన్‌సాగర్ తీరంలో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. విగ్రహావిష్కరణ తరువాత హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తారు. ఇందులో అంబేడ్కర్ మ్యూజియం, ఆయన జీవితానికి సంబంధించిన ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా 20 మంది బౌద్ధ గురువులు ప్రార్థనలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యేలా రవాణా సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరయ్యేలా 750 బస్సులను ఆయా ప్రాంతాలకు పంపనుంది.
అంబేడ్కర్ విగ్రహ ప్రత్యేకతలు
అంబేడ్కర్ స్మారక ప్రాంగణ విస్తీర్ణం.. 11.80 ఎకరాలు, పీఠం నిర్మాణం, విగ్రహం ఏర్పాటు విస్తీర్ణం.. రెండు ఎకరాలు, విగ్రహ స్తూపం(పీఠం) ఎత్తు .. 50 అడుగులు, విగ్రహం వెడల్పు.. 45 అడుగులు, పీఠం వెడల్పు.. 172 అడుగులు, విగ్రహం బరువు.. 435 టన్నులు, విగ్రహం తయారీకి వినియోగించిన ఉక్కు.. 791 టన్నులు, విగ్రహం తయారీకి వినియోగించిన ఇత్తడి.. 96 మెట్రిక్ టన్నులు, విగ్రహం తయారీకి రోజూ పని చేసిన కార్మికులు.. 425 మంది, దేశంలోనే అతి ఎత్తయిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ప్రముఖ శిల్పి రామ్ వి సుతార్ రూపొందించారు.
దిల్లీలో తయారీ.. ఇక్కడికి తరలింపు
కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థను ఎంపిక చేసి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. స్తూపాన్ని నిర్మించిన తరువాత విగ్రహ భాగాలను దిల్లీలో సిద్ధంచేసి హైదరాబాద్‌కు తరలించారు. భారీ క్రేన్‌ల సహాయంతో వాటిని క్రమపద్ధతిలో అమర్చారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా తయారీలో పటిష్ఠ లోహ సామగ్రిని వినియోగించారు. విగ్రహం పాదాల వద్దకు చేరుకునేందుకు వీలుగా మెట్లమార్గం, ర్యాంపుతోపాటు 15 మంది ఎక్కగల సామర్థ్యంతో రెండు లిఫ్టులు ఏర్పాటుచేశారు.