దేశవ్యాప్తంగా 21 లక్షల మంది విద్యార్థులు హాజరు
విద్యార్థులు తమ రోల్ నంబర్లు, స్కూల్ నంబర్లతో ఈ ఫలితాలను పొందవచ్చు. సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 21 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 93.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాది (94.40శాతం)తో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత 1.28శాతం తగ్గింది. అత్యధికంగా తిరువనంతపురంలో 99.91శాతం, బెంగళూరులో 99.18శాతం, చెన్నైలో 99.14శాతం ఉత్తీర్ణత నమోదైంది. 1,95,799 మంది విద్యార్థులకు 90 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇందులో 44,297 మంది 95శాతం కంటే ఎక్కువ స్కోరు సాధించినట్లు బోర్డు తెలిపింది. విద్యార్థుల మధ్య అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు 12వ తరగతి మాదిరిగానే 10వ తరగతి విద్యార్థులకూ మెరిట్ లిస్ట్‌ను ప్రకటించట్లేదని సీబీఎస్‌ఈ వెల్లడిరచింది. మే 16వ తేదీ నుంచి రీ ఎవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
సీబీఎస్‌ఈ 12 వ తరగతి ఫలితాల ప్రకటన
ఇక, ఈ ఉదయం విడుదలైన సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో 87.33శాతం మంది ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా 16,96,770 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది 87.33 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాది (92.71శాతం)తో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత 5.38శాతం తగ్గిందని సీబీఎస్‌ఈ బోర్డు వెల్లడిరచింది. ఇక విద్యార్థుల మధ్య అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు గతేడాదిలాగే ఈసారి కూడా మెరిట్ లిస్ట్‌ను ప్రకటించట్లేదని బోర్డు అధికారులు వెల్లడిరచారు. అయితే, ప్రతి సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించిన 0.1శాతం విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. మొత్తంగా 1,12,838 మంది విద్యార్థులు 90శాతం కంటే అధిక మార్కులు సాధించారు. ప్రాంతాల వారీగా తిరువనంతపురంలో అత్యధికంగా 99.91శాతం, ప్రయాగ్‌రాజ్‌లో అత్యల్పంగా 78.05శాతం ఉత్తీర్ణత నమోదైంది.