- సెంటు భూమి వ్యాఖ్యాలపై పేదలే బుద్ధి చెబుతారు
- మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు
- చంద్రబాబు సెంటు భూమి వ్యాఖ్యలకు నిరసనగా అమరావతిలో ర్యాలీ, దిష్టిబొమ్మ దహనం
పేదలంటే చిన్నచూపు చూస్తున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ఆ పేద ప్రజలే బుద్ధి చెబుతారని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు మండిపడ్డారు. సెంటు భూమి శవాలు పూడ్చడానికే చాలదు అంటూ అవహేళనగా మాట్లాడారని పేర్కొన్నారు. ఈ మాటలు చంద్రబాబు అహంకారానికి దర్పణంగా నిలుస్తున్నాయన్నారు. పేదలకు అందించే ఇళ్లపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. ర్యాలీలో పాల్గొన్న పెదకూరపాడు ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు గారు మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.
నీచమైన భాష
ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా..? అని గతంలో కొన్ని వర్గాలను కించపరిచే విధంగా మాట్లాడారని.. ఇప్పుడు సెంటు భూమిలో ఇల్లు కట్టకొని సంతోషంగా ఉంటున్న పేదల పట్ల కుట్రలు కుతంత్రాలతో నీచమైన భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సెంటు భూమి అంటూ చులకనగా మాట్లాడుతున్న చంద్రబాబుకు అమరావతి ప్రాంతంలో కనీసం ఇల్లు లేదని విమర్శించారు. అమరావతి పేరుతో దోచుకున్నది చాలక.. అక్కడ ఉన్న పేదవారికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఇలాగే పేదల పట్ల చిన్నచూపుతో ఉంటూ వచ్చే ఎన్నికల్లో కనీసం ఇప్పుడు ఉన్న 23 సీట్లు కూడా రావని తెలుసుకోవాలన్నారు. అమరావతి రాజధాని అని..తనకు బలం ఉందని భావించిన చంద్రబాబుకు.. పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటన ఫెయిల్ కావడంతో నోరు అదుపు తప్పి ఏవేవో మాట్లాడుతున్నారన్నారు. అమరావతిలో పెత్తందార్లే ఉండాలన్న చంద్రబాబు కుట్రలకు సుప్రీంకోర్టు సరైన తీర్పు ఇచ్చిందన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు అండ్ కో ఎన్ని విమర్శలు చేసినా.. ఎన్ని కుట్రలు పన్నినా.. 2024లో మళ్లీ పేదప్రజలు జగనన్నకు పట్టం కట్టడం ఖాయమని తెలిపారు.