ఏపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్-5 జోన్ ఏర్పాటు, 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు, ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ ఐకాస హైకోర్టులో వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే.తీర్పు ఎలా ఉన్నా ప్రయోజనం వైసీపీకే !
రాజధాని అమరావతి ప్రాంతంలోని కృష్ణాయపాలెం గ్రామంలో ఇళ్ళ నిర్మాణానికి జగన్ జూలైలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఆర్భాటంగా భూమిపూజ చేశారు. మే 26న పేదలకు పంపిణీ చేసిన 50,793 పట్టాల్లో ఇప్పుడు పక్కా ఇళ్ళను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఇళ్ళ నిర్మాణాలకి ప్రభుత్వం రూ. 1829 కోట్ల ఖర్చు చేయబోతోతున్నట్లు తెలిపారు. ఆరు మాసాల్లో ఇళ్ళ నిర్మాణాలన్నీ పూర్తయిపోవాలని జగన్ డెడ్‌లైన్ పెట్టుకున్నారు. ఇప్పుడు కోర్టులో ఇళ్ళ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని తీర్పుతో రాజధాని రైతుల్లో సంతోషం వెల్లివరిసినా...50793 మంది రాజధానేతర లబ్దిదారులు తెలుగుదేశానికి వ్యతిరేకంగా మారిపోబోతున్నారు. జగన్ ఇచ్చిన ఇళ్ళను తమకు కాకుండా చేశారని ఆగ్రహం వెల్లువెత్తుతుంది. అది ఎలాగు వైసీపీకి జగన్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇదీ జగన్ దెబ్బ. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నమాట. ఇప్పుడు తెలుగుదేశం గెలిచినా, ఓట్ల రేసులో ఓడినట్లే. ఇంకా చెప్పాలంటే ఈ ఓటర్లంతా మంగళగిరి, తాటికొండ నియోజకవర్గాల ప్రజలే. ఇది లోకేష్ గెలుపుపై ప్రభావం చూపేలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.
