రాంచీలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 15న జరిగిన ఓ ఊరేగింపు వీడియోను ఒకరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. రాంచీలో నివసించే ప్రేమ్ గుప్తా అనే వ్యక్తి.. గతేడాది ఏప్రిల్‌లో తన కుమార్తె సాక్షి గుప్తాకు సచిన్ కుమార్ అనే వ్యక్తితో ఘనంగా వివాహం జరిపించారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే సచిన్ నుంచి తన కుమార్తెకు వేధింపులు మొదలయ్యాయి. సాధారణంగా ఏ తండ్రికైనా తన కుమార్తె అత్తింట్లో కష్టాలు పడుతుంటే చూసి భరించలేరు, కానీ ఈ తండ్రి తలరాత ఇంతేనని సరిపెట్టుకోలేదు. ఇక కుమార్తె సపోర్ట్ చేశాడు. విడాకులు తీసుకుంటానంటే ఆనందంగా సరే అని చెప్పి మేళతాళాలతో, బాణసంచా సందడి మధ్య అత్తింటి నుంచి పుట్టింటికి భారీ ఊరేగింపుగా తీసుకొచ్చాడు ఆ తండ్రి. కూతురు అంటే అతనికి ఎంత వల్లమాలిన ప్రేమో ఈ సంఘటనే నిదర్శనం. కూతురు నుఅంటే గుండెల మీద బరువు అని భావించే తల్లిదండ్రులు ఉన్న ఈ రోజుల్లో ఎంత తొందరగా అత్తారింటికి పంపేద్దామా అని చూసే ఈ రోజుల్లో కూతరు కష్టాన్ని చూసి మళ్ళీ తన కూతురుగా తిరిగి తెచ్చుకున్న ప్రేమ్‌గుప్తా...నేర్పిన పాఠం చరిత్రలో నిలిచిపోతుంది.
కుమార్తెకు వేధింపులు
రాంచీలోని కైలాశ్‌నగర్ కుమ్హర్టోలి ప్రాంతంలో నివసించే ప్రేమ్ గుప్తా అనే వ్యక్తికి కుమార్తె సాక్షి గుప్తా ఉంది. 2022 ఏప్రిల్ 28న రాంచీలోని సర్వేశ్వరి నగర్‌కు చెందిన సచిన్ కుమార్ అనే వ్యక్తితో కుమార్తె వివాహం ఘనంగా చేశాడు. విద్యుత్ పంపిణీ సంస్థలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా సచిన్ పనిచేస్తున్నాడు. వివాహం అయిన కొన్ని రోజులకే సచిన్ తన భార్య సాక్షిని వేధింపులకు గురిచేశాడు. కొన్నిసార్లు కొట్టి ఇంటి నుంచి బయటకు పంపించేవాడు. సచిన్ తల్లిదండ్రులు ఏమీ అనక పోగా.. తన కుమారుడికి సపోర్ట్ చేశేవారు. సచిన్‌కు అంతకు ముందే వివాహం అయినట్లు కొద్దినెలల క్రితమే తెలిసినా.. అతడితో వివాహ బంధం కొనసాగించాలనే సాక్షి తొలుత నిర్ణయించుకుంది. కానీ వేధింపులు ఎక్కువ అయ్యేసరికి సచిన్‌తో కలసి ఉండలేనని సాక్షి నిర్ణయించుకుంది. తన వైవాహిక జీవితానికి వీడ్కోలు పలకాలనుకుంటున్నాని సాక్షి తన తల్లిదండ్రులకు చెప్పగా.. వారు స్వాగతించారు. కుమార్తెను ఇంటికి తీసుకొచ్చేందుకు ప్రేమ్ గుప్తా ఘనంగా ఏర్పాట్లు చేశారు. భాజాభజంత్రీలు, టపాసులు కాలుస్తూ ఆమెకు పుట్టింటికి స్వాగతం పలికారు. తన కుమార్తె వేధింపుల నుంచి విముక్తి పొందిందని, ఆ ఆనందంతోనే ఇలా ఇంటికి తీసుకొని వచ్చినట్లు సాక్షి తండ్రి ప్రేమ్ గుప్తా తెలిపారు. కుమార్తెలు ఎంతో విలువైనవారని, అత్తింట్లో వారికి ఇబ్బందులు ఎదురైతే గౌరవంతో పుట్టింటికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఇక సచిన్‌తో విడాకులు ఇప్పించాలని న్యాయస్థానంలో సాక్షి కేసు దాఖలు చేసినట్లు తెలిపారు. భాజాభజంత్రీలు, బాణసంచా సందడికి తీసుకొచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.