- బీసీలకే అత్యధిక సీట్లు
- ముఖ్యమర్రతి అభ్యర్థిగా ఈటల రాజేందర్ ?
- సరికొత్త ఈక్వేషన్స్ సెట్ చేస్తున్న బీజేపీ.
- బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీచేసేందుకు చర్చలు !
ఒక మీటింగ్...ఎన్నో ఊహాగానాలు...నారా లోకేష్ ఢల్లీిలో హోం మంత్రి అమిత్ షా ను కలిసిన మరుక్షణం నుంచి రాజకీయ విశ్లేషకులు, పరిశీలకుల ఊహాగానాలకు అంతే లేదు. లోకేష్, అమిత్ షా తో తన భేటీ తన తండ్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించింది మాత్రమే అని చెప్పారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు, ఆయన అరెస్టు, అరెస్టు అనంతర పరిణామాలు, జైల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి.. ఇవన్నీ వివరించడానికి తాను హోం మంత్రి అమిత్ షాను కలిసినట్టు లోకేష్ చెప్పుకొచ్చారు. కానీ రాజకీయ నాయకుల కలయికలు పైకి చెప్పినట్టు ఉండవు. ఊరక రారు మహానుభావులు అన్నట్టు రాజకీయ నాయకులు ఊరకనే కలుసుకోరు. అసలే ఐదు రాష్ట్రాల ఎన్నికలు నెత్తి మీదకు వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణ బిజెపికి ప్రతిష్టాత్మకంగా మారింది. మరోవైపు సర్వేలన్నీ ప్రధాన పోటీ కాంగ్రెస్, అధికార బీఆర్‌ఎస్ మధ్యనే ఉంటుందని, బిజెపి మూడో స్థానంలోకి జారిపోతుందని చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో బిజెపి తెలంగాణలో ఇమేజ్ డ్యామేజ్ కంట్రోల్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగానే లోకేష్ అమిత్ షాల మధ్య భేటీ జరిగిందనేది పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో వైపు లోకేష్ కిషన్‌రెడ్డి ఫోన్ చేసి అమిత్ షాను కలవమంటేనే కలిశాను అని చెప్పేశారు. తెలంగాణలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుతో తెలంగాణలో సత్తాచాటాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది.
నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ అధిష్టానం !
తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రా ఓటర్ల ప్రభావం గణనీయంగా ఉంటుంది. అలాగే కమ్మ సామాజిక వర్గం, ఐటీ ఎంప్లాయిస్ కూడా తెలుగుదేశానికి వెన్నుముకగా ఉంటోంది. ఈ ఓటర్లు అందరూ గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మళ్ళే సూచలనలు కనిపిస్తుండటంతో బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. అదే జరిగితే కాంగ్రెస్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇప్పటికే రెండుసార్లు అధికారంలో కొనసాగి మూడోసారి హ్యాట్రిక్ కొట్టడానికి బీఆర్‌ఎస్ పార్టీ తన ప్రయత్నాల్లో చిన్న గడ్డిపోచను కూడా వదలడం లేదు. అధికార పార్టీని ఎదుర్కోవడానికి, కర్ణాటక ఫలితాల తదనంతర ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా సమస్త శక్తుల్నీ కూడగట్టుకుంటూ ఎన్నికల వైపు కదులుతోంది. ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఆంధ్రా ఓటర్ల ప్రాబల్యం గణనీయంగా ఉంటుంది. వీరిని తమవైపు ఆకర్షించడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం తమకు కావాల్సిన సీట్లను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందు షరతులు పెట్టింది. హైదరాబాదులో ఆంధ్రా సెట్లర్లూ, ఖమ్మం, నిజామాబాద్ ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగస్తుల్లో టిడిపి సానుభూతిపరులు చాలామంది ఉంటారు. అసలే వార్ వన్ సైడ్ కాదని, అది టగ్ ఆఫ్ వార్ గా ఉంటుందని సర్వేలు చెబుతున్న ఈ సమయంలో ఒక్క ఓటును వదులుకున్నా అది శరాఘాతంలా పరిణమించవచ్చు. ఇలాంటి సమయంలో టిడిపి సానుభూతిపరులు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా చూడడం అనివార్యం. అధికార బీఆర్‌ఎస్ పార్టీ ప్రత్యక్షంగా టిడిపిని మద్దతు కోరలేదు. చంద్రబాబుకి కేసీఆర్ కి మధ్య ఉన్న వైరం అలాంటిది. అంతేకాదు ఇటీవల చంద్రబాబు అరెస్ట్ తర్వాత హైదరాబాదులో ఐటీ ఉద్యోగులు చేసిన నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిషేధించి కేటీఆర్, చంద్రబాబుకు తమకు మధ్య ఉన్న స్పర్థను ప్రత్యక్షంగా ప్రకటించారు.ఈ నేపథ్యంలో టిడిపి మద్దతు దారులు కమ్మ సామాజిక వర్గం గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మళ్ళకుండా బిజెపి తన వైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తోంది.
బీసీ నినాదం, బీసీ ముఖ్యమంత్రి ?
తెలంగాణ వ్యాప్తంగా పార్టీలు బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని బీసీ సంఘాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. ఈ సందర్భంలో బీజేపీ బీసీ నినాదాన్ని తలకెత్తుకునే సూచనలు కనిపిస్తున్నాయి. బీసీలకు ముఖ్యమంత్రి పదవి నినాదం బీసీల్లో ఐక్యత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరో వైపు బీసీ నాయకుడు ఆందరికీ ఆమోద యోగ్యుడు అయిన ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఎన్నికలు హోరాహోరీగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలకు తగినట్టు బీజేపీ తన రూటు మార్చుకుంటే బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ నడిచే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్‌కు షర్మిల రూపంలో ఓట్లు చీలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్ నేతల మధ్య అనైక్యత బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉంది.