Parliament : లోక్‌సభలో అలజడి...ఎందుకు చేశారంటే !

0

ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే పార్లమెంట్‌లో బుధవారం దుండగులు సృష్టించిన అలజడి యావత్‌ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ ఘటనపై దిల్లీ పోలీసులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణలో నిందితుల గురించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లోక్‌సభలో పట్టుబడిన మనోరంజన్‌ అనే వ్యక్తే ఈ ఘటన మొత్తానికి మాస్టర్‌ మైండ్‌ అని పోలీసు వర్గాలు గుర్తించాయి. మనోరంజన్‌, సాగర్‌ శర్మ, నీలమ్‌, అమోల్‌ శిందె, విశాల్‌, లలిత్‌ అనే ఆరుగురు దుండగులు ఈ ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో మనోరంజన్‌, సాగర్‌శర్మ లోక్‌సభలోకి చొరబడగా.. నీలమ్‌, అమోల్‌ శిందే పార్లమెంట్‌ భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీరికి సహకరించిన విశాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా లలిత్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

రెక్కీ చేసింది మనోరంజనే..

ఈ ఘటన మొత్తానికి మాస్టర్‌ మైండ్‌ మనోరంజనే అని పోలీసు వర్గాలు తాజాగా వెల్లడిరచాయి. కర్ణాటకలోని మైసూరుకు చెందిన మనోరంజన్‌.. ఒక ఎంపీ నుంచి పార్లమెంటులో ప్రవేశానికి పాస్‌ తీసుకున్నాడు. సాగర్‌ శర్మను తన స్నేహితుడిగా పేర్కొంటూ అతడికీ పాస్‌ ఇప్పించాడు. అతడి పిలుపుతోనే మిగతా వారు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఏడాది జరిగిన బడ్జెట్‌ సమావేశాల సమయంలో మనోరంజన్‌ పార్లమెంట్‌ వద్ద రెక్కీ నిర్వహించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మనోరంజన్‌ తీరు నక్సల్స్‌ భావజాలంతో పోలి ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

వీడియో తీసి.. షేర్‌ చేసి..

ఈ ఘటన సమయంలో లలిత్‌ కూడా పార్లమెంట్‌ ప్రాంగణంలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్లమెంట్‌ సమీపంలో నీలమ్‌, అమోల్‌ ఆందోళన చేస్తుండగా ఆ వీడియోను లలిత్‌ ఫోన్లో రికార్డ్‌ చేసినట్లు తెలిసింది. భద్రతా సిబ్బంది వారిని పట్టుకోగానే.. నిందితులదరి ఫోన్లతో లలిత్‌ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం ఆ వీడియోను పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ ఎన్జీవో సభ్యురాలికి పంపినట్లు సమాచారం. సదరు ఎన్జీవో సభ్యురాలు ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గతంలో లలిత్‌ మా ఎన్జీవోతో కలిసి పనిచేశాడు. పార్లమెంట్‌ వద్ద ఆందోళనకు సంబంధించి నాకు వాట్సప్‌లో ఓ వీడియో షేర్‌ చేశాడు. దాన్ని వైరల్‌ చేయమని మెసేజ్‌ చేశాడు’’ అని ఆమె వెల్లడిరచారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా...

సాగర్‌ శర్మ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో కాగా.. మనో రంజన్‌ కర్ణాటకలోని మైసూర్‌. అమోల్‌ షిండే స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్‌ కాగా.. నీలం దేవి కౌర్‌ స్వస్థలం హర్యాణాలోని హిస్సార్‌. అయితే వీరందరికీ ఆన్‌లైన్‌లోనే పరిచయం ఏర్పడిరదని, పక్కా ప్లాన్‌ ప్రకారమే పార్లమెంట్‌లో అలజడి సృష్టించినట్లు పోలీసులు తెలిపారు.  ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పలు అంశాలపై దుండగులు నినాదాలు చేశారు. మైసూర్‌ ఎంపీ ప్రతాప్‌ సిన్హా పాస్‌లతోనే పార్లమెంట్‌లోకి వచ్చినట్టు వివరించారు. మరోవైపు.. సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌ సెంటర్‌లో నీలం దేవి కౌర్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనల్లో పాల్గొందని.. కానీ ఏ రాజకీయ పార్టీతో ఆమెకు సంబంధం లేదని నీలం దేవి సోదరుడు చెప్పారు. గతంలో పార్లమెంట్‌పై 2001 డిసెంబర్‌ 13 వ తేదీన ఉగ్రవాద దాడి జరిగింది. ఆ దాడిలో 5 ఉగ్రవాదులు సహా 15 మంది చనిపోయారు. ఈ దాడి జరిగి సరిగ్గా 22 ఏళ్లు పూర్తి కాగా.. చనిపోయిన వారికి పార్లమెంట్‌ నివాళులు అర్పించింది. ఈ నివాళుల కార్యక్రమం జరిగిన కొద్దిసేపటికే లోక్‌సభలో జీరో అవర్‌ నడుస్తుండగానే.. ఈ ఘటన చోటు చేసుకుంది.కాగా, గతవారం ఖలీస్థాన్‌ వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ పార్లమెంట్‌ను పునాదులతో సహా కదలిస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే, ఈ బెదిరింపులను ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్టు లేదని తాజా ఘటనతో రుజువైందనే విమర్శ వినిపిస్తోంది. దేశానికి గుండెకాయ వంటి పార్లమెంట్‌ భవనంలో ఇలాంటి ఘటనలు జరగడం ప్రజాప్రతినిధులకు సురక్షితమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఆ నలుగూరు 

వేర్వేరు బ్యాక్‌గ్రౌండ్‌కు చెందినవాళ్లు. వాళ్ల విద్యార్హతలు కూడా వేరే. ప్రాంతాలు కూడా వేరే. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లు. పొగ క్యాన్లతో అటాక్‌ చేసిన సాగర్‌ శర్మ, నీలమ్‌ ఆజాద్‌, మనోరంజన్‌ డీ, అమోల్‌ షిండే, విక్కీ శర్మ, లలిత్‌ జా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. వీళ్లంతా భగత్‌ సింగ్‌ ఫ్యాన్‌ క్లబ్‌కు చెందినట్లు గుర్తించారు. నీలమ్‌ ఆజాద్‌, అమోల్‌ షిండేలు.. తమకు కావాల్సిన ఉద్యోగాలు రాబట్టడంలో విఫలం అయ్యారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మణిపూర్‌ హింస గురించి హైలెట్‌ చేసేందుకు స్మోక్‌ అటాక్‌ చేసినట్లు చెబుతున్నారు.

రిక్షా డ్రైవర్‌..

లోక్‌సభ విజిటర్స్‌ గ్యాలరీలో తొలుత స్మోక్‌ క్యాన్‌తో దూకిన వ్యక్తిని 27 ఏళ్ల సాగర్‌ శర్మగా గుర్తించారు. అతను ఢల్లీిలో జన్మించాడు. లక్నోలో పెరిగాడు. అతను తన సోషల్‌ మీడియాలో భగత్‌ సింగ్‌,చెగువీరా గురించి పోస్టులు చేస్తుంటాడు. స్పీకర్‌ చైర్‌ దిశగా తన చేతుల్లో స్మోక్‌ క్యాన్‌తో అతను దూసుకెళ్లిన విషయం తెలిసిందే. సాగర్‌ శర్మను కొందరు ఎంపీలు పట్టుకుని, దేహశుద్ది చేశారు. ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢల్లీి వెళ్తున్నట్లు అతను ఇంట్లో చెప్పి వెళ్లినట్లు సమాచారం. శర్మ ఈ-రిక్షా డ్రైవర్‌గా చేస్తున్నాడు.

ఇంజినీర్‌..

మనోరంజన్‌ది మైసూరు. కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో అతను డిగ్రీ చేశాడు. 34 ఏళ్ల అతని వద్ద విజిటర్స్‌ గ్యాలరీ పాస్‌ ఉంది. శర్మ తర్వాత లోక్‌సభ ఛాంబర్‌లోకి అతను దూకాడు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత అతను జాబ్‌ చేశాడా లేదా అన్న విషయం తెలియదు. తన కుమారుడు అలా చేసి ఉండడని తండ్రి దేవరాజ్‌ గౌడ తెలిపారు. ఒకవేళ అతను అలా చేస్తే అతన్ని ఉరి తీయాలన్నాడు. మనోరంజన్‌, శర్మ వద్ద ఉన్న పాస్‌లు.. మైసూరుకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహా పేరుమీద ఉన్నాయి.

టీచర్‌..

నీలమ్‌ ఆజాద్‌ది హర్యానాలోని హిస్సార్‌. ఆమెకు ఎంఫిల్‌ డిగ్రీ ఉంది. నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్టు కూడా ఆమె పాసైంది. పార్లమెంట్‌ ఆవరణలో రంగుల స్మోక్‌ క్యాన్లతో నిరసన చేపట్టిన వ్యక్తుల్లో ఆమె ఒకరు. ఆమె వయసు 37 ఏళ్లు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. రెజ్లర్ల నిరసన సమయంలోనూ ఆమె కనిపించారు. ఉన్నత విద్యను ఆర్జించినా.. ఆమెకు ఉద్యోగం దక్కలేదు.

ఆర్మీ ఔత్సాహికుడు..

అమోల్‌ షిండే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి. పార్లమెంట్‌ ఆవరణలో నీలమ్‌తో కలిసి అమోల్‌ నిరసనలో పాల్గొన్నాడు. మహారాష్ట్రలోని లాతూరు గ్రామం అతనిది. 25 ఏళ్ల అతను అనేక పోలీసు, ఆర్మీ పరీక్షల్లో విఫలం అయ్యాడు. పోలీసు రిక్రూట్మెంట్‌ డ్రైవ్‌ కోసం వెళ్తున్నట్లు డిసెంబర్‌ 9వ తేదీన అతను ఇంట్లో చెప్పి వెళ్లాడు. కొడుకు ఏం చేశాడన్న విషయంపై తమకు ఏమీ తెలియదని అతని పేరెంట్స్‌ తెలిపారు. షిండే, మనోరంజన్‌, శర్మ, నీలమ్‌ను అరెస్టు చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !