Telangana: కాంగ్రెస్‌ హైకమాండ్‌ సంచలనం...రాజ్యసభకు అభ్యర్థుల ప్రకటన !

0

తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ తరపున రాజ్యసభకు వెళ్లబోయే ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పేర్లను కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఖరారు చేసింది. యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ కొడుకు అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం. కాంగ్రెస్‌కు దక్కబోయే రెండు రాజ్యసభ సీట్ల కోసం ఒకటి ఏఐసీసీకి చెందిన నేతలకు, మరొకటి రాష్ట్ర నేతకు ఇవ్వాలని కాంగ్రెస్‌ భావించినట్టు వార్తలు వినిపించాయి. కానీ అనూహ్యంగా ఇద్దరు తెలంగాణ నేతలనే పెద్దల సభకు పంపింది కాంగ్రెస్‌. వారిలో రేణుకా చౌదరి రాజ్యసభ రేసులో ఉన్నప్పటికీ.. ఎవరూ ఊహించని విధంగా అంజన్‌ కుమార్‌ యాదవ్‌ కొడుకు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పేరును ఖరారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది కాంగ్రెస్‌. రేపు వీరిద్దరూ నామినేషన్‌ వేయనున్నారు. 

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరు ?

కాంగ్రెస్‌ తరపున ఇద్దరు అభ్యర్థులు ఖరారు కావడంతో.. ఇక బీఆర్‌ఎస్‌ తరపున రేసులో ఉండే ఆ ఒక్కరు ఎవరనే అంశంపై ఆసక్తి నెలకొంది. బీఆర్‌ఎస్‌ తరపున రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్రకు మరోసారి అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు రాజ్యసభ ఎంపీగా కేవలం రెండేళ్లు మాత్రమే అవకాశం దక్కింది. దీంతో ఆయనకు మరోసారి ఛాన్స్‌ ఇస్తారనే టాక్‌ వినిపిస్తోంది. బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావడం ఆయనకు కలిసొచ్చే అంశమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.తెలంగాణతో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్‌ జాబితాను విడుదల చేసింది ఏఐసీసీ.. కర్ణాటక నుంచి అజయ్‌ మాకెన్‌, సయ్యద్‌ నాసీర్‌ హుస్సేన్‌, జీసీ చంద్రశేఖర్‌ పేర్లను ప్రకటించింది. మధ్యప్రదేశ్‌ నుంచి అశోక్‌ సింగ్‌ కు ఛాన్స్‌ ఇచ్చింది. కాగా.. తెలంగాణ అసెంబ్లీలో పార్టీల బలాబలాల ప్రకారం కాంగ్రెస్‌ తరపున ఇద్దరు, బీఆర్‌ఎస్‌ తరపున ఒక్కరు రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. ఇందుకు సంబంధించిన ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 11 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైనప్పటికీ.. ఇప్పటికీ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించలేదు. రేపటితో నామినేషన్‌ గడువు కూడా ముగియనుంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.. అయితే బీఆర్‌ఎస్‌ తరపున ఎవరు రాజ్యసభ రేసులో ఉంటారనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. నామినేషన్లు దాఖలకు రేపే ఆఖరి తేది కావడంతో నేడు బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

సీనియారిటీకి దక్కిన గౌరవం..

రేణుకా చౌదరి రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. 1984లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె 1986లో హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కి జరిగిన ఎన్నికల్లో బంజారాహిల్స్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. 1986 నుంచి 98 వరకు రెండు సార్లు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. 1999, 2004లో ఖమ్మం లోక్‌సభ నియోజవకర్గం నుంచి ఎన్నికయ్యారు. హెచ్‌డీ దేవెగౌడ ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్య, కుటంబ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా, 2006 నుంచి కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో  ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీ చేసి నామా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. సీనియర్‌ నేతగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రేణుకా చౌదరికి కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం రాజ్యసభ అవకాశమిచ్చింది.

యువనాయకుడిగా గుర్తింపు పొందిన అనిల్‌..

సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అంజన్‌ కుమార్‌ యాదవ్‌ తనయుడే అనిల్‌ కుమార్‌ యాదవ్‌. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముఠా గోపాల్‌ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. 2023లో అదే నియోజవకర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌లో వన్‌ ఫ్యామిలీ.. వన్‌ టికెట్‌ ఫార్ములా అమలు చేయడంతో ముషీరాబాద్‌ సీటును తండ్రికోసం త్యాగం చేశారు. ప్రస్తుతం అనిల్‌ కుమార్‌ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. యూత్‌ కాంగ్రెస్‌లో చురుగ్గా పనిచేసి మంచి గుర్తింపు పొందడంతో రాజ్యసభ అవకాశం దక్కింది. ఆయన తండ్రి అంజన్‌ కుమార్‌ యాదవ్‌ 2004, 2009లో సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా గెలిచారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !