Excellencia : అనుమతుల్లేని అడ్మిషన్లు.. తల్లిదండ్రుల జేబులకు చిల్లులు: ఎక్స్‌లెన్సియా కాలేజీల దందా!

0

  • 10 క్యాంపస్‌లలో 4 కాలేజీలకు లేని బోర్డు గుర్తింపు.. నిబంధనలకు నిలువునా తూట్లు!
  • ఒక చోట చేరిక.. మరో చోట నామినల్ రోల్స్.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం!
  • ఫోర్జరీ పత్రాలతో దమ్మాయిగూడ కాలేజీ సీజ్.. అయినా మారని యాజమాన్యం తీరు!
  • నిద్రమత్తులో విద్యాశాఖ అధికారులు.. అక్రమార్కులకు అండగా యంత్రాంగం?

భాగ్యనగరంలో కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ, తల్లిదండ్రుల ఆశలను సొమ్ము చేసుకుంటూ 'ఎక్స్‌లెన్సియా జూనియర్ కాలేజీ' యాజమాన్యం సాగిస్తున్న అక్రమాల పర్వం బట్టబయలైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మొత్తం 10 క్యాంపస్‌లను (8 డే-స్కాలర్, 2 రెసిడెన్షియల్) నిర్వహిస్తున్న ఈ సంస్థకు, కేవలం 6 కళాశాలలకు మాత్రమే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) నుంచి అధికారిక అనుమతి ఉంది. మిగిలిన నాలుగు క్యాంపస్‌లను ఎలాంటి అనుమతులు లేకుండానే దర్జాగా నడిపిస్తూ అడ్డగోలు దోపిడీకి తెరలేపింది.

గుర్తింపు ఉన్నవి 6.. అక్రమంగా నడుస్తున్నవి 4 ! 

అధికారిక లెక్కల ప్రకారం కేవలం మాదాపూర్ (కోడ్: 58479), ఎల్.బి. నగర్ (కోడ్: 58489), అబ్దుల్లాపూర్‌మెట్ (కోడ్: 58335), నార్సింగి (కోడ్: 58545), షామీర్‌పేట్ (కోడ్: 59340), వెస్ట్ మారేడ్‌పల్లి (కోడ్: 62260) క్యాంపస్‌లకు మాత్రమే బోర్డు గుర్తింపు ఉంది. కానీ బాచుపల్లి, మియాపూర్, ఈసీఐఎల్ (ECIL), సుచిత్ర బ్రాంచీలకు కనీస అనుమతులు లేవు. అయినప్పటికీ ఏటా వేలాది మంది విద్యార్థులను చేర్చుకుంటూ కోట్లాది రూపాయలు వసూలు చేస్తోంది. ఈ అనధికార క్యాంపస్‌లలో చేరిన విద్యార్థుల నామినల్ రోల్స్‌ను తమకు సంబంధించిన ఇతర గుర్తింపు పొందిన కాలేజీల కోడ్‌ల ద్వారా బోర్డుకు పంపిస్తూ కళ్లుగప్పే నాటకానికి తెరలేపింది.

జీవో పేరుతో మాయాజాలం.. ఆధారాలు అడిగితే మౌనం! 

బాచుపల్లి క్యాంపస్‌కు అనుమతి లేకపోవడంపై యాజమాన్యాన్ని నిలదీస్తే, "ప్రత్యేక జీవో (G.O.) ద్వారా నడిపిస్తున్నాం" అంటూ బుకాయించే ప్రయత్నం చేసింది. తీరా ప్రభుత్వ పోర్టల్‌లో తనిఖీ చేస్తే అటువంటి జీవో ఉనికిలోనే లేదని తేలింది. కనీసం ఆ జీవో కాపీని బయటపెట్టడానికి కూడా యాజమాన్యం సాహసించకపోవడం ఈ అక్రమ దందాకు నిదర్శనం.

కోచింగ్ ముసుగులో నిబంధనల ఉల్లంఘన 

ఇంటర్మీడియట్ చదువులతో పాటు జేఈఈ (JEE), నీట్ (NEET), సీఏ ఫౌండేషన్ (CA Foundation), క్లాట్ (CLAT), ఇంటిగ్రేటెడ్ శాట్ (SAT) శిక్షణ ఇస్తున్నామంటూ ఊదరగొడుతున్న యాజమాన్యం, నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన కోచింగ్ సెంటర్ అనుమతుల ఊసే ఎత్తడం లేదు.

ఫోర్జరీ పత్రాలతో దొరికిపోయిన దమ్మాయిగూడ బ్రాంచ్! 

యాజమాన్యం అక్రమాలకు దమ్మాయిగూడ క్యాంపస్ ఉదంతమే పరాకాష్ట. ఇంటర్ బోర్డు అనుమతులు లేకపోవడమే కాకుండా, ఏకంగా నకిలీ ఫైర్ ఎన్ఓసీ (Fire NOC) పత్రాలను సృష్టించి కళాశాలను నడుపుతున్నట్లు 'తెలంగాణ స్టూడెంట్స్ యూనిట్' ఫిర్యాదుతో వెలుగుచూసింది. విచారణలో ఫోర్జరీ నిజమేనని తేలడంతో అధికారులు షోకాజ్ నోటీసు ఇచ్చి రూ. 8 లక్షల జరిమానా విధించారు. అడ్మిషన్లు నిలిపివేయాలని ఆదేశించినా యాజమాన్యం లెక్కచేయకపోవడంతో, చివరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు గత సెప్టెంబర్‌లో ఆ క్యాంపస్‌ను సీజ్ చేశారు.

స్కూళ్ల నిర్వహణలోనూ అదే 'కంటితుడుపు' వ్యవహారం! 

ఎక్స్‌లెన్సియా యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలదీ ఇదే దారి:

  • ది క్వాంటమ్ స్కూల్ (మోకిల): 12 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఉన్న ఈ స్కూల్‌కు పూర్తిస్థాయి అనుమతులు లేవు. నవంబర్ 20, 2026న కేంబ్రిడ్జి (Cambridge) అనుమతులు వచ్చాయని చెబుతున్నా, ఏ తరగతుల వరకు అనే స్పష్టత లేదు. సీబీఎస్ఈ (CBSE), ఐబీ (IB) సిలబస్ పేరుతో నర్సరీ నుండి 12వ తరగతి వరకు అడ్మిషన్లు తీసుకుంటూ, లోపల మాత్రం స్టేట్ బోర్డ్ పర్మిషన్‌తో నెట్టుకొస్తోంది. ఇక్కడి విద్యార్థుల వివరాలను 'ఎక్స్‌లెన్షియా ఆనందిని', 'ఎక్స్‌లెన్షియా ఇన్ఫినిటమ్' స్కూళ్ల ఖాతాల్లో చూపిస్తూ అక్రమాలకు పాల్పడుతోంది.

  • ఎసెన్షియా స్కూల్ (మియాపూర్): సీబీఎస్ఈ గుర్తింపు ఉందంటూ భారీగా ప్రచారం చేసుకుంటున్న ఈ స్కూల్ ప్రిన్సిపల్‌ను అనుమతి పత్రాలు అడగగా, "వాట్సాప్‌లో పంపుతాం" అంటూ తప్పించుకున్నారు తప్ప ఇంతవరకు ఎలాంటి ఆధారాలు చూపలేదు.

ఇంతటి బహిరంగ ఉల్లంఘనలు జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడకముందే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ అనుమతులు లేని క్యాంపస్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !