ఇప్పటి వరకు పెట్టుబడులకు స్వర్గసీమలా భావిస్తున్న ఇన్వెస్టర్లకు క్రిప్టో మార్కెట్లు నేడు నేలచూపులు చేస్తున్నాయి. ట్రిలియన్ డాలర్ల నష్టాలతో ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను మిగుల్చుతున్నాయి. ఇన్ని రోజులు ఆకాశమే హద్దుగా పెరిగిన బిట్‌కాయిన్ గత నెల రోజులుగా పెరగటమే తెలియనంతగా పతనం దిశగా సాగుతోంది. జూన్ 14 తేదీ నాటికి 18 నెలల కనిష్టాన్ని తాకింది. 20813 డాలర్ల చేరి 1 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని మిగిల్చిందని క్రిప్టో డేటా బ్లాగ్ ‘కాయిన్ మార్కెట్ క్యాప్’ తెలిపింది.
2021 నవంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ మార్కెట్ 2.9 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. కానీ పెరిగిపోతున్న కరోనా కేసులు, కొత్తగా పుట్టుకొస్తున్న మంకీఫాక్స్ వంటి వైరస్‌లు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం, ఆయా దేశాల ప్రధాన బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు, వివిధ దేశాల్లో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు క్రిప్టో మార్కెట్ల పతనానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.