తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను కోరారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో తెలంగాణ నెంబర్ 1గా ఎదగడానికి పునాది వేసింది టీడీపీనే అని పేర్కొన్నారు. వెనుకబడిన తెలంగాణ ఒక్క నిర్ణయంతో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు చంద్రబాబు.
తెలుగు జాతి ఉన్నంత కాలం టీడీపీ ఉంటుందన్నారు. అతి తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం అన్నారు. తెలంగాణ గడ్డపై టీడీపీ పుట్టిందన్నారు చంద్రబాబు. తెలుగు జాతి అభివృద్ధికి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. రాజకీయాలకు కొత్త అర్థం తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు చంద్రబాబు. పాలనను పేదవాడి ఇంటిముందుకు తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు వచ్చాయన్న ఆయన.. భాగ్యనగరంలో ల్యాండ్ విలువ బాగా పెరిగిందన్నారు. ఇప్పుడు కేవలం రంగారెడ్డిలోనే 200 కాలేజీలు వచ్చాయన్నారు. తెలంగాణలో ఇరిగేషన్ అభివృద్ధికి నాంది పలికింది టీడీపీనే అన్నారు చంద్రబాబు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి నాంది పలికింది టీడీపీ కాదా? అని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయం చేసే రైతు బిడ్డ నాగలితో పాటు.. మౌస్ పట్టుకోవాలని అప్పుడే చెప్పానని ఆయన తెలిపారు.
కాగా చంద్రబాబు ఆదేశానుసారం టీడీపీలో చేరారని నూతనంగా నియమితులైన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. చంద్రబాబు ఆశీస్సులతో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. పార్టీకి పూర్వ వైభవం రావడానికి గ్రామగ్రామాన తిరిగి కృషి చేస్తామని తెలిపారు. సూర్యచంద్రులు ఉన్నంతవరకు తెలుగు దేశం పార్టీ ఉంటుందన్నారు. ఈ సారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కాసాని జ్ఞానేశ్వర్.