అక్రమ నిర్మాణాలకు అడ్డాగా...హైద్రాబాద్‌ !

0



హైదరాబాద్‌లో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియటం లేదు. ఉన్నట్టుంటి నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌ కూలిపోవచ్చు. నిబంధనలు ఉల్లంఘించిన కట్టిన భవనంలో ఫైర్‌ యాక్సిడెంట్‌ జరగొచ్చు. ప్రమాదం ఎటు నుంచైనా ముంచుకు రావొచ్చు. కారణం ఏమిటంటే ఇబ్బడిముబ్బడిగా అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలు. అడుగడుగునా నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్న అధికారులు ఏం చేస్తున్నారు? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. కొత్త ఏడాదిలో నగరంలో అక్రమంగా నిర్మించిన భవనాలకు సంబంధించి రెండు పెద్ద ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. జనవరి 7న కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న శ్లాబ్‌ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. తాజాగా సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్‌ లో ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదం యావత్‌ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దాదాపు 12 గంటలకు పైగానే మంటలు కొనసాగాయి అంటే ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్ని ఫైరింజన్లు వచ్చినా ఆ మంటలను ఆర్పలేకపోయాయి. చివరికి ఆ బిల్డింగ్‌ చుట్టుపక్కల ఉన్న వాళ్లందరిని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రమాదం జరిగిన ఈ రెండు భవనాల్లో యధేచ్చగా నిబంధనలు ఉల్లంఘించి.. అదనపు అంతస్తులను నిర్మించారు. ఇవి రెండు మాత్రమే కాదు హైదరాబాద్‌లో ఇలాంటి అక్రమ నిర్మాణాలు లక్షకు పైనే ఉన్నాయని అధికార లెక్కలు చెబుతున్నాయి. వీటిలో చాలావరకు సెట్‌బ్యాక్‌లు లేకపోవడం, అక్రమంగా నిర్మించిన అదనపు అంతస్తులు ఉన్నాయి. పైగా ఇవన్నీ ఇరుకు ఏరియాల్లో ఉండటంతో ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. అయినా, అక్రమ నిర్మాణాలకు సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది.

     ఒక నిర్దిష్టమైన ప్లాన్‌కు అనుమతి పొందిన బిల్డింగ్‌ యజమానులు నిబంధనలు ఉల్లంఘించి అదనపు ఫ్లోర్లు కట్టేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో జీ ప్లస్‌ వన్‌కు అనుమతి తీసుకుని మూడు అంతస్తులు, నాలుగు అంతస్తులు కట్టిన వారు అనేకం. అయితే అదనంగా నిర్మించిన అంతస్తులు స్థిరంగా ఉండాలంటే అందుకు తగ్గట్లుగా పునాది అవసరం. కానీ, అవేమీ పెద్దగా కనిపించడం లేదు. ముఖ్యంగా ఇంటికి ఉండాల్సిన సెట్‌బ్యాక్‌లు కూడా లేకుండా అడ్డగోలుగా నిర్మాణాలు సాగిస్తుండటమే డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. 2016లో బీఆర్‌ఎస్‌ స్కీమ్‌ కింద జీహెచ్‌ఎంసీకి లక్షా 39వేల అప్లికేషన్స్‌ వచ్చాయి. అప్పటి నుంచి అధికారులు వాటి జోలికి కూడా వెళ్లడం లేదు. పైగా హైకోర్టు స్టే ఆర్డర్‌ ఎత్తివేస్తే అదనంగా రూ.1500 కోట్ల ఆదాయం వస్తుందనే ఆలోచనతో ఉన్నారు. గ్రేటర్‌లో అక్రమ నిర్మాణాలకు ఎల్బీ నగర్‌ సర్కిల్‌ కేంద్రంగా కనిపిస్తోంది. అక్కడ బీఆర్‌ఎస్‌ కింద భవనాలను క్రమబద్దీకరించుకునేందుకు అత్యధికంగా 22వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
అసలు.. ఏ ధైర్యంతో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్నారు? అనుమతిలేని భవనాలు వేలకు వేలు పెరిగిపోతున్నా అధికారులు ఎందుకు వాటిని చూసీచూడనట్లు వదిలేస్తున్నారు? ముందు నుంచే చర్యలు తీసుకుని ఉంటే.. ఇప్పుడిలా ఆలోచించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నగరంలో ఎన్ని సక్రమ నిర్మాణాలు ఉంటాయో.. అక్రమ నిర్మాణాలు కూడా అన్నే ఉంటాయి. సిటీలోని ఏ గల్లీలోని బిల్డింగ్‌ ను కదిపినా.. అందులో ఏదో ఒక ఉల్లంఘన కనిపిస్తుంది. అదనపు అంతస్తులో, సెట్‌బ్యాక్‌లు, భద్రతా ప్రమాణాలు లేకపోవడమో, ఫైర్‌ సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవడమో.. ఇలా ఏదో ఒకటి తక్కువే ఉంటుంది. ముఖ్యంగా కమర్షియల్‌ బిల్డింగ్స్‌లో ఈ తరహా ఉల్లంఘనలకు కొదవే లేదు.

ఏదో ఒక తాత్కాలిక ప్లాన్‌తో వెళ్తారు. దానికి అప్రూవల్‌ వస్తుంది. దాని ప్రకారం కట్టేసి ఆపైన అనుమతులు లేకుండానే అదనపు అంతస్తులు నిర్మించేస్తుంటారు. ముందైతే కట్టేద్దాం.. తర్వాత సంగతి తర్వాత అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. అందుకే నగరంలో ఈ స్థాయిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !