భారతీయ జనతా పార్టీకి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పారు. గురువారం గుంటూరులోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమైన అనంతరం తన రాజీనామాను ప్రకటించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. గత కొంతకాలంగా పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. నేడు పార్టీని వీడుతున్నట్లు వెల్లడిరచారు. రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపినట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు లేఖలో కన్నా పేర్కొన్నారు.
2014లో మోదీ నాయకత్వానికి ఆకర్షితుడినై బీజేపీలోకి వచ్చానన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు. 2019లో అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించానని... మోదీ నాయకత్వంపై ఇప్పటికీ నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. ‘‘నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని ఏకతాటిపై నడిపాను.. సోమువీర్రాజు అధ్యక్షుడు అయ్యాక పరిస్థితి అంతా మారిపోయింది’’ అని అన్నారు. సోమువీర్రాజు నాయకత్వంలో బీజేపీ ముందుకు వెళ్లడం లేదన్నారు. కక్ష సాధింపులతో సోమువీర్రాజు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర నాయకత్వ తీరు నచ్చకనే బీజేపీకి రాజీనామా చేసినట్లు వెల్లడిరచారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమన్వయం చేసుకోవడంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని కన్నా ఇటీవల వ్యాఖ్యానించారు. సోమువీర్రాజు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. పార్టీలో చర్చించి అభిప్రాయాలు తీసుకోవడం లేదని విమర్శించారు. తన పాటు రాజీనామా చేసిన అనుచరులకు ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. కాంగ్రెస్‌లో 40 ఏళ్లు పనిచేశానని..ఐదుగురు సీఎంల దగ్గర పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. పదవులు ఆశించి ఏ పార్టీలో పనిచేయలేదన్నారు. పని చేస్తున్నందున పదవులు అవే వచ్చాయని తెలిపారు. కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని పోరాడానని.. ఆ ఉద్యమంలో జీవీఎల్ పాల్గొని ఉంటే బాగుండేదని కన్నా అభిప్రాయపడ్డారు.