మూడు రాజధానులు తూచ్‌...విశాఖపట్నమే రాజధాని !

0


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని వ్యవహారంలో ప్రస్తుత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం వైపు అడుగులేస్తోంది. విశాఖపట్నమే ఏకైక రాజధానిగా ప్రకటించేందుకు ప్రభుత్వ పెద్దలు తమ గొంతును సవరించుకుంటున్నారు. మొన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఢల్లీి పర్యటన, నిన్నటికి నిన్న బెంగళూరులో బుగ్గన రాజేద్రనాథ్‌రెడ్డి మాటలే అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. అమరావతి రాష్ట్ర రాజధానిగా 2015లో నాటి నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం నోటిఫై చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2020లో ‘అధికార వికేంద్రీకరణ’ పేరుతో మూడు రాజధానులు చేస్తున్నామని ప్రకటించింది. దానిపై చట్టం చేసే వరకూ వెళ్లింది. ఇప్పుడు మూడు రాజధానులు కాదు..తూచ్‌.. ఒక్కటే రాజధాని అని.. ఆ ఒక్కటీ విశాఖపట్నం అని కొందరు మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో తీవ్ర గందరగోళం, అయోమయం తలెత్తుతోంది. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే అంశం మీద వివాదం సుప్రీంకోర్టులో ఉంది. ఈలోగా త్వరలోనే పాలన విశాఖపట్నానికి మారుతుందని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ ప్రకటనలు గుప్పించటం వెనుక మర్మం ఏమిటి ? సడన్‌గా వైజాగ్‌ను రాజధానిగా ఎందుకు ప్రకటిస్తున్నారు ? మరి మిగిలిన రెండు రాజధానులపై ప్రభుత్వం అభిప్రాయం ఏమిటి ? అనేది తెలియాల్సి ఉంది. 

విశాఖ ఒక్కటే రాజధాని అంటున్న మంత్రులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా విశాఖపట్నం ఉంటుందంటూ ఏపీ మంత్రులు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తొలుత శ్రీకాకుళంలో జరిగిన బహిరంగసభలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ మాట అన్నారు. విశాఖపట్నం ఏకైక రాజధాని అని ఆయన రెండు నెలల క్రితం చెప్పారు. తర్వాత పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కూడా అదే విధంగా వ్యాఖ్యానించారు. జనవరి 30న దిల్లీలో విశాఖ పెట్టుబడుల సదస్సు సన్నాహాక సమావేశంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి కూడా త్వరలోనే విశాఖపట్నం రాజధాని అవుతుందని చెప్పారు. తాజాగా ఫిబ్రవరి 14న బెంగళూరులో జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మరో అడుగు ముందుకేసి మూడు రాజధానులు అనేది ‘మిస్‌ కమ్యూనికేషన్‌’ అని చెప్పారు. సమావేశంలో ఎదురయిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఇలా స్పందించారు. ‘‘మూడు రాజధానులు అనేది సమాచార లోపం. పాలన విశాఖ నుంచే జరుగుతుంది. పాలనా రాజధానిగా విశాఖను ఎంపిక చేశామంటే విభజిత ఆంధ్రప్రదేశ్‌లో విశాఖలో సదుపాయాలున్న ప్రాంతమే కాకుండా అభివృద్ధికి అవకాశం ఉన్న నగరం. కాబట్టి పోర్ట్‌ సిటీగా, కాస్మోపాలిటన్‌ నగరంగా ఉండడం, వాతావరణం అన్నీ కలిసివస్తాయి. ఇతర నగరాలు రాజధాని అని కాదు. కర్ణాటకలో గుల్బర్గా, ధార్వాడ్‌లో హైకోర్టు బెంచి ఉన్నట్టే. అలా కర్నూలు ఎంపిక చేసుకోవడానికి వందేళ్ల నాటి కారణాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడకముందే 1937లో పాలనా రాజధాని ఒక ప్రాంతంలో ఉంటే హైకోర్టు మరో ప్రాంతంలో ఉండాలని శ్రీబాగ్‌ ఒడంబడిక జరిగింది. అందులో భాగంగా హైకోర్టు ప్రిన్సిపల్‌ బెంచ్‌ కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించాము’’ అంటూ ఆయన సమాధానమిచ్చారు. అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి బుగ్గన తెలిపారు. కర్ణాటకలో శాసనసభ ఒక సెషన్‌ బెల్గాంలో నిర్వహిస్తున్నట్టుగానే తాము కూడా ఒక సెషన్‌ గుంటూరులో నిర్వహిస్తామన్నారు. కోవిడ్‌ సహా వివిధ కారణాల రీత్యా విశాఖలో రాజధాని ఏర్పాటు ఆలస్యమయ్యిందని, త్వరలోనే అది జరుగుతుందని బుగ్గన చెప్పారు.


వికేంద్రీకరణ నుంచి మళ్లీ మొదటికి...

పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి అంటూ బయట మాత్రమే కాకుండా అసెంబ్లీ, హైకోర్టు వేదికగా చెప్పిన ప్రభుత్వం, తర్వాత ఒకటే రాజధానిగా విశాఖ వైపు మళ్లుతున్నట్టు ఈ పరిణామాలు చెబుతున్నాయి. ప్రభుత్వం మూడు రాజధానుల నుంచి మళ్లీ ఒక రాజధాని అనేందుకు సిద్ధపడడం వెనుక రాజకీయ, చట్ట, శాసనపరమైన కారణాలున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే రాజధాని విషయంలో సుప్రీంకోర్టు ముందు పలు పిటిషన్లు విచారణలో ఉన్నాయి. ఫిబ్రవరి 23న వాటిని విచారించే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడిస్తూ అఫిడవిట్‌ కూడా సుప్రీంకోర్టు ముందుంచింది. గతంలో రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ముందు అఫిడవిట్‌లో చెప్పిన కేంద్ర ప్రభుత్వం తాజాగా తన వాదనను సవరించుకుంది.

రాజధాని విషయమై ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్‌ 5, 6 ని ప్రస్తావించింది. శివరామకృష్ణన్‌ కమిటీ ఏర్పాటు గురించి కూడా తాజా అఫిడవిట్‌లో గుర్తు చేసింది. సెక్షన్‌ 94 ప్రకారం రాజధాని ఏర్పాటు కోసం అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన విషయాన్ని కూడా కోర్టు ముందుకు తీసుకొచ్చింది. అంతకుముందు ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో విశాఖనే రాజధానిగా పేర్కొంది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌లో ఈ విషయం ప్రస్తావించింది. రాజధాని మార్పు విషయంలో శాసనసభకు హక్కు లేదంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వాలని కోరింది. తొలుత సుప్రీంకోర్టు మాత్రం హైకోర్టు విధించిన కాలపరిమితి వరకే స్టే విధించింది. కేసు విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరుతూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.ప్రస్తుతం ఈ కేసులో వివిధ సంఘాలు, కొందరు వ్యక్తులు ఇంప్లీడ్‌ అయ్యారు. సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉంది. కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉండగానే రాజధాని విషయంపై ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవడం చర్చనీయమవుతోంది. పదే పదే విశాఖ పేరు ప్రస్తావిస్తూ సీఎం నుంచి మంత్రుల వరకూ త్వరలోనే అదే రాజధాని అని చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదంతా డ్రామానే: టీడీపీ

విశాఖలో విలువైన భూములు కాజేసెందుకు చేస్తున్న డ్రామాగా తాము ఇన్నాళ్లుగా చేస్తున్న ఆరోపణ తాజాగా ప్రభుత్వ తీరుతో బట్టబయలు అవుతోందని టీడీపీ వ్యాఖ్యానిస్తోంది.‘‘మూడు రాజధానులు, అన్ని ప్రాంతాల అభివృద్ధి అనేది బూటకం. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. రాష్ట్రమంతా అభివృద్ధి, అందుబాటులో రాజధాని ఉండాలని మేము నిర్ణయించాము. దాన్ని విధ్వంసం చేసి మూడేళ్లుగా రాష్ట్రాన్ని సందిగ్ధంలో నెట్టారు. రాయలసీమ, కోస్తా జిల్లాల ప్రజలను మోసం చేశారు. ఉత్తరాంధ్రలో భూకబ్జాలకు పాల్పడుతున్నారు. ఇంతటి మోసం ఎన్నడూ చూడలేదు’’ అని టీడీపీ అధికార ప్రతినిధి కె.పట్టాభి విమర్శించారు.మరోవైపు విశాఖ రాజధాని అంటే వైజాగ్‌ వాసులు కూడా అంగీకరించడం లేదని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ప్రభుత్వం రాజీనామా చేసి విశాఖ రాజధాని అంశంపై ప్రజా తీర్పు కోరాలని డిమాండ్‌ చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !