Kochi Water Metro : దేశంలోనే మొట్టమొదటి జల మెట్రో !

0

మెట్రో రైలు అనగానే పట్టాలపై పరుగులు పెట్టే రైళ్లను మాత్రమే చూశాం. మెట్రో నగరాల్లో వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించి, తక్కువ సమయంలో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడం ఈ సర్వీసుల ముఖ్య ఉద్దేశం. దేశ వ్యాప్తంగా అన్ని మెట్రో నగరాల్లో వీటి సేవలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా, దేశంలోనే తొలిసారిగా నీటిపై నడిచే మెట్రో సర్వీస్‌ అందుబాటులోకి రానుంది. కోచి వాటర్‌ మెట్రో సర్వీస్‌ పేరుతో కేరళ ప్రభుత్వం ఈ సర్వీసులను అందుబాటులోకి తీసురానుంది. ఈ వాటర్‌ మెట్రోను ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్‌ 25న జాతికి అంకితం చేయనున్నారు. 

కోచిలో వాటర్‌ మెట్రో రైల్‌ !

దేశంలో, దక్షిణాసియాలోనే తొలి వాటర్‌ మెట్రో ఇదేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు. కేరళ రాష్ట్రం కలల ప్రాజెక్ట్‌గా దీన్ని అభివర్ణించారు. కోచి మెట్రో రైల్‌ లిమిటెడ్‌ దీని నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. కోచి వాటర్‌ మెట్రో సర్వీస్‌లో బ్యాటరీ సాయంతో నడిచే 78 ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ బోట్లు ఉంటాయి. వీటి కోసం 38 టెర్మినళ్లు నిర్మించారు. కోచి  చుట్టుపక్కల ఉండే 10 ద్వీపాలను కలుపుతూ ఈ వాటర్‌ మెట్రో రాకపోకలు సాగిస్తుంది. వాటర్‌ మెట్రో ప్రాజెక్ట్‌ను 1,136.83 కోట్ల వ్యయంతో నిర్మించారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం, జర్మనీకి చెందిన ఫండిరగ్‌ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాయి. ఇది పూర్తిగా విద్యుత్‌ సాయంతో పనిచేస్తుండటంతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉందదు. అలాగే, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.  వాటర్‌ మెట్రో సర్వీస్‌తో కోచి పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. దశల వారీగా ఈ సర్వీసుల సంఖ్య పెంచనున్నట్లు సీఎం విజయన్‌ తెలిపారు. ప్రస్తుతం రోజుకు 12 గంటల పాటు ఈ మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. 

అత్యాధునిక భద్రత

ఇందులో ఏసీ, వైఫై సౌకర్యం అందిస్తున్నారు. ఒక్కో బోటులో 50 నుంచి 100 మంది ప్రయాణించవచ్చు. ఇవి కనిష్ఠంగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 22 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అత్యాధునిక భద్రత, సమాచార వ్యవస్థ వీటిలో ఉన్నాయి. కోచి వాటర్‌ మెట్రో సర్వీస్‌లో టికెట్‌ ప్రారంభ ధర  20 కాగా, గరిష్ఠ టికెట్‌ ఖరీదు 40. టికెట్లతోపాటు పాస్‌ల సౌకర్యాన్ని కూడా కేరళ ప్రభుత్వం తీసుకొచ్చింది. వారం రోజుల పాస్‌ ఖరీదు 180, నెల వారీ పాస్‌ ధర  600, మూడు నెలల పాస్‌ ఖరీదు 1500గా నిర్ణయించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !