1986 బ్యాచ్ కర్ణాటక కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ సీబీఐ నూతన డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ప్రధాని నేతృత్వంలోని హై పవర్డ్ సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆయన రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ పదవీ కాలం మే 25తో ముగియనుంది. ఆయన తరువాత సీనియారిటీ ప్రవీణ్‌కు ఉంది. అయితే, కర్ణాటక ఎన్నికల్లో ఆయన భాజపాకు అనుకూలంగా పని చేశారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ గతంలో తీవ్ర విమర్శలు చేశారు. అధిష్ఠానం ఓకే అంటే తానే సీఎం అవుతానని డీకే భావిస్తున్న నేపథ్యంలో సీబీఐ నూతన డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ ఎంపిక జరగడం గమనార్హం.ప్రవీణ్ సూద్ ఎవరు ?
ప్రవీణ్ సూద్ ప్రస్తుతం కర్ణాటక డీజీపీగా పని చేస్తున్నారు. 1989లో మైసూరులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. తరువాత బళ్లారి, రాయచూర్‌లో ఎస్పీగా పనిచేశారు. అనంతరం బెంగళూరు నగర లా అండ్ ఆర్డర్ డీసీపీగా పదోన్నతి పొందారు. 1999లో డిప్యుటేషన్‌పై ఫారెన్ సర్వీసుకు వెళ్లారు. మారిషస్ ప్రభుత్వానికి పోలీస్ సలహాదారుగా మూడేళ్లు పని చేశారు. తరువాత కొన్నాళ్లు సెలవులో ఉండి న్యూయార్క్‌లోని సిరక్యూస్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించారు. అనంతరం మైసూరు నగర సీపీగా, బెంగళూరు ట్రాఫిక్ అదనపు కమిషనర్‌గా విధులు నిర్వహించారు.
నియామకం ఎలా జరిగిందంటే..!
సీబీఐ డైరెక్టరును ఎంపిక చేసే అధికారం ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐతో కూడిన ప్యానల్‌కు ఉంటుంది. ప్రవీణ్ సూద్ నియామకాన్ని ప్రధాని నరేంద్రమోదీ, సీజేఐ డీవై చంద్రచూడ్ సమర్థించగా లోక్‌సభలో ప్రతిపక్షనేత అధీర్ రంజన్ చౌదరి వ్యతిరేకించినట్లు సమాచారం. మైనారిటీ వర్గాలకు చెందిన మహిళా అధికారులను ఆ పోస్టుకు ఎంపిక చేయాలని ఆయన కోరారు. అయినప్పటికీ ప్రవీణ్ సూద్ నియామకం జరిగిపోయింది
