- చిన్న కాలేజీలకు వరంగా మారిన నిబంధనలు !
- ఏ బ్రాంచ్ విద్యార్థుల ఫలితాలు ఆ బ్రాంచ్ పేరుతోనే ప్రకటించాలి.
- ఇతర బ్రాంచీల విద్యార్థుల ఫలితాలు మరో బ్రాంచ్ విద్యార్థులతో కలిపి ప్రకటించటంపై నిషేధం.
- కార్పొరేట్ గుత్తాధిపత్యానికి చెక్ !
- ఈ నిబంధనలు కొనసాగిస్తారా లేక కొర్పొరేట్ ఒత్తిడికి తలొగ్గుతారా ?
విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రకటనలతో మభ్యపెడుతున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ఇంటర్ బోర్డ్ షాక్ ఇచ్చింది. ప్రకటనలకు వ్యతిరేకం కాదంటూనే తప్పుడు ప్రకటనలు ఇచ్చే సంస్థపై భారీ జరిమానా విధించేలా నిబంధనలు మార్చింది. ప్రకటనకు ఎంత వెచ్చిస్తే అంతే మొత్తాన్ని జరిమానాగా విధిస్తామని పేర్కొంది. సంబంధిత కాలేజీ తప్పుడు ప్రకటన అని తేలితే, ఇంటర్‌బోర్డే పత్రికల్లో కౌంటర్ అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తుందని స్పష్టం చేసింది. ఇందుకు అయ్యే ఖర్చును వసూలు చేసిన జరిమానా నుంచే చెల్లిస్తామని తెలిపింది. కాలేజీలిచ్చే అడ్వర్టైజ్‌మెంట్లపై నిఘా పెట్టేందుకు ఇంటర్‌బోర్డ్‌లోని ఐదుగురు ఉన్నతాధికారులతో పర్యవేక్షణ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్‌మిట్టల్ మీడియాతో మాట్లాడుతూ, పత్రికల్లో ప్రకటనలిచ్చేందుకు తాము వ్యతిరేకం కాదన్నారు. కాలేజీలకు అడ్వర్టైజ్‌మెంజ్‌మెంట్లు ఇచ్చే స్వేచ్చ ఉంటుందని, కానీ, తప్పుడు ప్రకటనలివ్వడం సరికాదని పేర్కొన్నారు. ఒకే పేరుతో వందలాది బ్రాంచీలు నిర్వహిస్తున్న యాజమాన్యాలు ఏ కాలేజీ (బ్రాంచ్) విద్యార్థికి ర్యాంకు వస్తే ఆయా కాలేజీ కోడ్ నంబర్‌తోనే అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వాలని, అంతేగాని గంపగుత్తగా ప్రకటించడం ఇకపై కుదరదని తెలిపారు.
మార్గదర్శకాలిలా...
- అడ్వర్టైజ్‌మెంట్‌పై కాలేజీ కోడ్స్, అడ్రస్, విద్యార్థి హాల్‌టికెట్ నంబర్, ర్యాంకు హోల్డర్‌ను ప్రచురించాలి.
- ఎంసెట్‌తో పాటు నీట్, ఐఐటీ జేఈఈ వంటి ప్రకటనలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
- అడ్వర్టైజ్‌మెంట్లే కాకుండా హోర్డింగ్స్, కరపత్రాలు, గోడరాతలకు కూడా ఇంటర్‌బోర్డు అనుమతి తప్పనిసరి.
- షెడ్యూల్ విడుదల కానిదే ఇంటర్‌లో ప్రవేశాలకు అడ్వర్టైజ్‌మెంట్లు ఇవ్వరాదు.