నరకాసురుడినైనా నమ్మొచ్చేమో కానీ చంద్రబాబును మాత్రం నమ్మొద్దని ఏపీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. వెంకటాయపాలెంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు, టీవీ5 న్యూస్ చానల్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. వాటిని గజదొంగల ముఠాగా అభివర్ణించారు. నరకాసురుడ్ని అయినా నమ్మొచ్చేమో కానీ చంద్రబాబును మాత్రం నమ్మడానికి వీల్లేదని అన్నారు.
వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు
ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేసినట్టు చెప్పారు. 30 లక్షలమందికిపైగా అక్కచెల్లెమ్మలకు పట్టాలు అందించామని పేర్కొన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి అమలు చేస్తున్నట్టు తెలిపారు. నాలుగేళ్లలో అవినీతి, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, ఎన్నికలు రాగానే మోసపూరిత హామీలు ఇస్తారని, ఆయనను నమ్మొద్దని కోరారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఒక్క పట్టా కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాల విషయంలోనూ చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, మహిళల పేరుమీదే పట్టాలు ఉంటాయని అన్నారు. వారి చేతుల్లో రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్ల సంపద ఉందని జగన్ పేర్కొన్నారు. ఇళ్లు నిర్మించే కార్యక్రమం కూడా ఈ వారంలోనే ప్రారంభమవుతుందని, మూడు పద్ధతుల్లో ఇళ్లు నిర్మిస్తామని వివరించారు. తొలి విధానంలో సొంతంగా ఇల్లు కట్టుకునే వారికి రూ. 1 లక్షా 80 వేలు ఇస్తామని, రెండ విధానంలో నిర్మాణ కూలీ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. తాను ఇస్తున్నవి ఇళ్ల పట్టాలు మాత్రమే కావని, సామాజిక న్యాయ పత్రాలని జగన్ అన్నారు. అమరావతి ఇకపై సామాజిక అమరావతి అవుతుందన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రభుత్వమే స్వయంగా సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి విజయం సాధించినట్టు జగన్ వివరించారు.
51 వేల మందికి భూమి పట్టాలు
మరోవైపు వైసీపీకి అధికారం అమరావతికి శాపం అని అమరావతికి భూమి ఇచ్చిన రైతులు శాపనార్ధాలు పెడుతున్నారు. గత నాలుగేళ్లుగా అమరావతిని ఎంతలా నిర్వీర్యం చేయాలో అంతలా రాజధానికి నష్టం చేసింది. చివరకు అమరావతిని సీనియర్ మంత్రి బొత్సలాంటి వాళ్లు శ్మశానంతో పోల్చారు. అయితే ఇప్పుడు అదే అమరావతిని అడ్డం పెట్టుకొని రాజకీయానికి తెరలేపారు. రాజధాని కోసం ఇచ్చిన భూములను పేదలకు పంచేసి పొలిటికల్ మైలేజీ పొందాలని భావిస్తున్నారు. తద్వారా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని రాజధాని ప్రాంత ప్రజలు వ్యతిరేక భావన నుంచి ప్రభుత్వ అనుకూలురుగా మారిపోయారని ప్రచారం చేయడం ప్రారంభించారు. దానిని తనకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన తరువాత అమరావతి ఉద్యమం పతాక స్థాయికి ఎగసింది. రైతులు ఉద్యమ బాట పట్టారు. తీవ్రస్థాయికి తీసుకెళ్లారు. అమరావతి టు తిరుపతి, అమరావతి టు అరసవల్లి వంటి మహాయాత్రలకు సైతం సిద్ధపడ్డారు. చట్టపరంగా వైసీపీ సర్కారుతో ఢీ కొడుతూనే నిరసన కార్యక్రమాలను కొనసాగించారు. ఆ సమయంలో అమరావతి రైతులకు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు వెలుగుచూశాయి. 23 గ్రామాల సమస్యను.. రాష్ట్ర సమస్యగా మార్చేశారంటూ తిరిగి అమరావతి రైతులపైనే విమర్శల జోరు కురిపించారు. అది అమరావతి కాదు కమ్మరావతి అంటూ కులాలను సైతం అంటగట్టారు.
కృష్ణ, గుంటూరు జిల్లాల్లో సానుకూల వాతావరణం
రాజధాని ఇష్యూలో జగన్ సర్కారును ఏపీలో మెజార్టీ ప్రజలు తప్పుపడుతున్నారు. అయితే ఆ తప్పు దిద్దుకోకపోగా.. ఇప్పుడు రైతుల నుంచి సేకరించిన భూముల్లో ఏకంగా 51 వేల మందికి సెంటు స్థలం చొప్పున జగన్ సర్కారు ఇళ్ల పట్టాలను అందించింది. దీంతో అమరావతి ప్రాంతంలో వైసీపీకి అనుకూల వాతావరణం ఏర్పడిరదని ప్రచారం ప్రారంభించారు. అయితే నాడు 23 గ్రామాల సమస్యే కదా అని ఎద్దేవా చేసిన వారే.. ఇప్పుడు 51 వేల మందికి పట్టాలు అందించేసరికి కృష్ణ, గుంటూరు జిల్లాల్లో సానుకూల వాతావరణం ఏర్పడిరదని ప్రభుత్వ భావిస్తోంది.