All India Oppsition Leaders meeting : విపక్ష నేతల కూటమి నేతల మధ్య ఐక్యత సాధ్యమేనా ?

0

 


బిహార్‌ రాజధాని పాట్నాలో బిజెపియేతర పార్టీలన్నీ ఈ నెల 23న సమావేశం కానున్నాయి. లోక్‌సభ ఎన్నికలు జరిగిన ప్రతీసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ దేశంలోని విపక్ష నేతలందరూ హడావుడి చేస్తుంటారు. కానీ ఎన్నికలకు ముందో లేదా తర్వాతో ఆ కూటమి విచ్ఛిన్నం అవుతుంటుంది. అలాంటి సమావేశమే ఇప్పుడు మళ్ళీ జరుగుతోంది. విధి విచిత్రం ఏమిటంటే ఈసారి కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆ కూటమితో కలిసి సాగేందుకు సిద్దం అవుతోంది. నిజానికి కాంగ్రెస్‌ మిత్రపక్షాల కూటమి (యూపీఏ) ఒకప్పుడు దేశాన్ని పాలించింది. కానీ ఇప్పుడు మిత్రపక్షాల అధ్వర్యంలో ఏర్పాటవుతున్న కూటమిలో కాంగ్రెస్‌ పార్టీ చేరుతోంది. 

నితీశ్‌ కుమార్‌ అధ్వర్యంలో

బిహార్‌ సిఎం నితీశ్‌ కుమార్‌ అధ్వర్యంలో జరుగబోతున్న ఈ సమావేశానికి కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్‌), తృణమూల్‌ కాంగ్రెస్‌ (పశ్చిమ బెంగాల్‌), ఆమాద్మీ (ఢల్లీి, పంజాబ్‌), సమాజ్‌వాదీ (ఉత్తరప్రదేశ్‌), ఎన్సీపీ (మహారాష్ట్ర), శివసేన (మహారాష్ట్ర), జేడీయూ (బిహార్‌), ఆర్‌జేడీ (బిహార్‌), డీఎంకె (తమిళనాడు) తదితర పార్టీల అధినేతలు, కార్యదర్శులు, ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సహా మరికొందరు ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

కేసీఆర్‌ ఒంటరి పోరాటం

తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ కాంగ్రెస్‌, బిజెపిలతో సమాన దూరం పాటించాలనుకొంటున్నారు. పైగా తన నాయకత్వంలోనే అన్ని పార్టీలు పనిచేయాలని, ప్రధాని అభ్యర్ధిగా తానే ఉండాలనుకొంటున్నారు. కనుక ఈ సమావేశానికి హాజరుకాకపోవచ్చు. విపక్ష కూటమి సమావేశానికి హాజరవుతున్న పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులు అందరినీ కూడా కేసీఆర్‌ కలిశారు. ఇటీవలే ఢల్లీి సిఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సిఎం భగవంత్‌ మాన్‌ ఇద్దరూ హైదరాబాద్‌ వచ్చి కేసీఆర్‌ని కలిసి వెళ్ళారు. విపక్ష కూటమి నిలబడలేదని కేసీఆర్‌ అప్పుడే చెప్పినప్పటికీ వారిరువురూ ఈ సమావేశానికి హాజరవుతుండటం గమనిస్తే, కేసీఆర్‌ ఒంటరి పోరాటం చేయకతప్పదని, కాంగ్రెస్‌, బిజెపిల కంటే ముందుగా వారితోనే తలపడక తప్పదని స్పష్టం అవుతోంది. కనుక కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికలలో ఇతర రాష్ట్రాలలో బిఆర్‌ఎస్‌ పార్టీని బరిలో దింపుతారో లేదో అనుమానమే.

టిడిపి, బిజెపితో పొత్తుల కోసం ఎదురుచూపులు 

ఏపీలో వైసీపీ ప్రభుత్వం కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి మనుగడ సాగిస్తోంది కనుక సిఎం జగన్మోహన్‌ రెడ్డి కూడా ఈ సమావేశానికి దూరంగా ఉండబోతున్నారు. జనసేన బిజెపితో పొత్తులోనే ఉండగా, టిడిపి ఇంకా బిజెపితో పొత్తుల కోసం ఎదురుచూపులు చూస్తోంది కనుక ఆ రెండు పార్టీలు కూడా ఈ సమావేశానికి హాజరుకావు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కూటమిలో ముగ్గురు అభ్యర్థులు ప్రధాని పదవికి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌ గాంధీ, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులు నితీశ్‌ కుమార్‌, మమతా బెనర్జీ ప్రధాని పదవి ఆశిస్తున్నారు. కనుక ముందుగా వారిలో ప్రధాని అభ్యర్ధి ఎవరో ప్రకటించగలిగితేనే ప్రజలకు వారి కూటమిపై నమ్మకం ఏర్పడుతుంది లేకుంటే ఎప్పటిలాగే విచ్ఛిన్నం అయిపోవడం ఖాయం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !