నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప మందు ప్రసాదం (Fish Medicine Distribution) పంపిణీ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav) చేప ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... చేప ప్రసాద పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. 175 ఏళ్ళ నుంచి బత్తిని ( Battini Brothers) కుటుంబ సభ్యులు ఆస్తమా భాదితులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారన్నారు. రేపు ఉదయం 8 గంటల వరకు 24 గంటల పాటు చేప ప్రసాద పంపిణీ జరుగుతుందన్నారు. చేప ప్రసాదం పంపిణీ కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో దాదాపు 32 క్యూలైన్లను ఏర్పాటు చేశామని, చిన్నపిల్లలకు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
చేప మందు కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉబ్బస వ్యాధిగ్రస్తులు ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకున్నారు. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి 10 అర్ధరాత్రి వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. అలాగే చేప మందు వచ్చే ప్రయాణీకుల కోసం 9, 10వ తేదీలలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ఎయిర్ పోర్టు వంటి ప్రాంతాల నుంచి దాదాపు 50 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతల నుంచి 80 బస్సులు ఏర్పాటు చేశారు