- జాక్ డోర్సే కీలక వ్యాఖ్యలు !
- ఖండిరచిన కేంద్రం !
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వాన్ని విమర్శించే ట్విటర్ హాండిల్స్‌ను బ్లాక్ చేయాలని నాపై విపరీతమైన ఒత్తిడి వచ్చిందని, ముఖ్యంగా రైతు ఉద్యమ సమయంలో భారత్‌లో ట్విటర్‌ను నిషేధిస్తామని బెదిరింపులు సైతం వచ్చాయని జాక్ డోర్సే తెలిపారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ ట్విటర్‌లో షేర్ చేశారు. గత సంవత్సరం ట్విటర్ బోర్డు నుంచి జాక్ డోర్సే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మీరు ట్విటర్ సీఈఓగా ఉన్న సమయంలో విదేశీ ప్రభుత్వాల్లో ఏ దేశం నుంచి మీపై ఎక్కువ ఒత్తిడి వచ్చిందన్న ప్రశ్నకు జాక్ డోర్సే సమాధానం ఇచ్చారు.
ట్విటర్ హ్యాండిల్స్ బ్లాక్ చేయాలని ఒత్తిడి !
భారతదేశంలో రైతుల నిరసన సమయంలో ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులతో సహా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే ట్విటర్ హ్యాండిల్స్‌ను బ్లాక్ చేయాలని అనేక సిఫార్సులు వచ్చాయని అన్నారు. ఆ సమయంలో భారత్‌లో ట్విటర్‌ను సైతం మూసివేస్తామని, లేదంటే మీ అధికారుల ఇళ్లపై దాడులు చేస్తామని బెదిరింపులు సైతం వచ్చాయంటూ డోర్సే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలోనే జరిగిందని అన్నారు. భారత్‌తో పాటు టర్కీ నుంచి కూడా జాక్ డోర్సేకు బెదిరింపులు వచ్చాయట. ట్విటర్ సహ వ్యవస్థాపకుడు డోర్సే వ్యాఖ్యలను శ్రీనివాస్ ట్విటర్‌లో పోస్టు చేసి.. ‘ప్రజాస్వామ్య మాత ` ఫిల్టర్ చేయబడలేదు’ అని రాశారు. రైతుల నిరసనల సందర్భంగా భారత ప్రభుత్వం మాపై ఒత్తిడి తెచ్చి మీ ఆఫీసులు మూసేస్తాం, మీ ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేస్తాం. మీరు చెప్పింది పాటించకుంటే అని జాక్ డోర్సే ప్రకటనను ఉటంకిస్తూ శ్రీనివాస్ రాశారు. రైతు చట్టాలపై ఆందోళన జరిగిన సమయంలో భారత ప్రభుత్వం నుంచి తమకు ఒత్తిడి ఎదురైందంటూ ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే వ్యాఖ్యలకు కేంద్రం ప్రభుత్వం స్పందించింది. కేంద్ర సాంకేతిక, సమాచార శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ డోర్సే వ్యాఖ్యలను కొట్టిపారేశారు. డోర్సే చెబుతున్న విషయాలు పచ్చి అబద్ధాలని చెప్పారు. బహుశా ట్విటర్ చరిత్ర నుంచి చాలా సందేహాస్పద కాలాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారంటూ రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు.
Mother of Democracy - Unfiltered
— Srinivas BV (@srinivasiyc) June 12, 2023
"During farmer protest, Modi govt pressurized us and said we will shut down your offices, raid your employees' homes, which they did if you don’t follow suit."
- Jack Dorsey, former Twitter CEO pic.twitter.com/tOyCfyDWcz