తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రూ.100 స్మారక నాణేంను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆగస్టు 28న విడుదల చేశారు. రాష్ట్రపతిభవన్‌లో ఎన్టీఆర్ కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ పలు పార్టీల ప్రముఖులతో దాదాపు 200 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ ముర్ము మాట్లాడుతూ.. భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీర్ ఎంతో ప్రత్యేకమన్నారు. కృష్ణుడు, రాముడి వంటి పాత్రల్లో ఆయన నటన అద్భుతమని, ప్రజల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ తన ప్రత్యేకత చాటుకున్నారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారని వెల్లడిరచారు. ఎన్టీఆర్ విలక్షణ వ్యక్తిత్వాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పారు.
ఎన్టీఆర్ శత జయంతి
అలాగే పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్టీఆర్ వెన్నెటి ఉన్న అయ్యన్న పాత్రుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కుంభంపాటి రామ్మోహన్ రావు, ఎద్దుపల్లి సుబ్రహ్మణ్యం, దగ్గుబాటి సురేశ్, విజ్ఞాన్ విద్యాసంస్తల అధినేత రత్తయ్య కూడా హజరుకానున్నారు. అయితే తనకు ఆహ్వానం అందకపోవడంపై రాష్ట్రపతికి లేఖ రాశారు లక్ష్మీ పార్వతి. ఆహ్వానితుల జాబితాలో తన పేరు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లో తయారైన ఈ స్మారక నాణెం.. 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ కలిపి ఉంటుంది. ఓ వైపు ఎన్టీఆర్ బొమ్మ ఉంటే మరోవైపు మూడు సింహాల బొమ్మ ఉంటుంది. ఎన్టీఆర్ శత జయంతి అని హిందీలో రాసి దాని కింద 1923-2023 అని రాసుంటుంది.
హాజరుకానీ జూనియర్ ఎన్టీఆర్ !
అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావట్లేదని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటమే కారణంగా తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో జరుగుతోంది. గతంలో హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు కూడా హాజరు కాలేదు జూనియర్ ఎన్టీఆర్. ఈ విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు వచ్చాయి.