KCR Coverts Into Congress : ఇట్లయితే మరోసారి కేసీఆరే ముఖ్యమంత్రి !

0

రాజకీయ వ్యూహాలకు కేసీఆర్‌ పెట్టింది పేరు. ఆయన ఆలోచనలు ఇతరులు అర్థం చేసుకునేలోపు యుద్ధం ముసిగిపోతుంది. అందుకే ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రి అవ్వగలిగారు అంటే ఆయన చతురత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో హ్యాట్రిక్‌ గెలుపుతో కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు వ్యూహప్రతివ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. అందుకే ఉన్న ఫళంగా 115 అసెంబ్లీ సీట్లను ప్రకటించారు. సీట్ల కేటాయింపులో అందరికన్నా ముందున్నారు. అసమ్మతి గళం వినిపించినా ఏమాత్రం అదరటంలేదు, బెదరటం లేదు. కానీ అలా టికెట్‌ రాని వాళ్ళందరూ కాంగ్రెస్‌ పంచన చేరేలా ప్లాన్‌ సిద్ధం చేశారు. 

ఈసారి సర్వేలన్నీ కాంగ్రెస్‌కే మొగ్గు ! 

ఈ సారి ప్రజల నాడి తెలంగాణ ఇచ్చిన పార్టీ అయిన కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతోందని చాలా సర్వేల్లో వెల్లడైంది. ప్రజల్లో కూడా 10 ఏళ్ళ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్లాన్‌ బీని రెడీ చేసుకుంది. ఈసారి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే బలమైన పోటీ జరగనుందని అర్థం అయిన నేపథ్యంలో రెండో వైపు కూడా తనకు నమ్మిన బంటులనే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. 20 నుండి 30 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచిన తర్వాత గోడ దూకినా చాలు అనుకుంటోంది. బీఆర్‌ఎస్‌లో చాలా మంది టికెట్‌ రాని వారు కాంగ్రెస్‌ తరుఫున పోటీచేసేందుకు ఆల్‌ రెడీ దరఖాస్తులు చేసేశారు. వారందరూ కూడా కేసీఆర్‌ కోవర్టులు అని ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. కేసీఆర్‌ ముందే వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ పార్టీలోకి కొందరు నేతలను పంపారని.. బలమైన నేతలకు 30 కోట్ల చొప్పున ఇచ్చి వారిని నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యతను తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. బీఆర్‌ఎస్‌ నేతలు ఓడిపోయే చోట ఈ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గెలిపించేసి వారిని తిరిగి గెలిచాక బీఆర్‌ఎస్‌లోకి లాగే ఎత్తుగడ వేసినట్టుగా రాజకీయవర్గాల్లో ఓ ప్రచారం మొదలైంది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కూడా కేసీఆర్‌ను కాంగ్రెస్‌ నమ్మకూడదని.. బీఆర్‌ఎస్‌ పార్టీకి మెజార్టీ రాకపోతే మొదట చీల్చేది కాంగ్రెస్‌నే అని.. కాంగ్రెస్‌లోకి కేసీఆర్‌ కోవర్టులను పంపించారని ఆరోపించారు.

బాల్క సుమన్‌ సంచలన వ్యాఖ్యలు 

ఇప్పుడు ఈ ఆరోపణలను నిజం చేస్తూ చెన్నూర్‌ ఎమ్మెల్యే.. మళ్లీ టికెట్‌ పొందిన బాల్క సుమన్‌ సంచలన ఆరోపణలు చేశారు. ‘నియోజకవర్గంలో తిరిగే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులను నాయకులను ఎవ్వరూ ఏం అనకండి.. వాళ్లు మనవాళ్లే.. మేమే కొంత మందిని ఎంపిక చేసి కాంగ్రెస్‌లోకి పంపినం.. వాళ్లు బీఆర్‌ఎస్‌ కోసమే పనిచేస్తారు. గెలిచినా బీఆర్‌ఎస్‌లోకే వస్తారు. అది మా గేమ్‌ ప్లాన్‌.. ఎవరికీ చెప్పకండి’ అంటూ సంచలన నిజాన్ని బయటపెట్టారు. ఇటీవల కేసీఆర్‌ అసెంబ్లీ టికెట్ల ప్రకటన సందర్భంగా ఆయన వెనుకనే బాల్క సుమన్‌ ఉన్నారు. కేసీఆర్‌ ఆ లిస్ట్‌ తోపాటు పలు కీలక పత్రాలు అందజేశారు. సో ఈ వ్యూహంలో బాల్కసుమన్‌ కూడా ఉన్నాడని.. ఆయన చెప్పేవన్నీ కేసీఆర్‌ చేస్తున్నాడని.. కాంగ్రెస్‌ లోకి కేసీఆర్‌ కోవర్టులను పంపాడని అర్థమవుతోంది. ఈ నిజం ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో పెను సంచలనమైంది. కాంగ్రెస్‌ లో పెద్ద కుదుపునకు కారణం అవుతోంది. కేసీఆర్‌ కాంగ్రెస్‌లోకి పంపిన ఆ కోవర్టులు ఎవరన్న చర్చ మొదలైంది.

కాంగ్రెస్‌ని కకావికలం చేయటం కోసమే ఈ ఎత్తుగడ !

వ్యూహాన్ని ఎవరూ బయటకు చెప్పరు, కానీ చెప్పారు అంటే దాని వెనుక మరో వ్యూహం ఉండి ఉంటుంది. ఇదేదో ఫోన్‌లో మాట్లాడిన అంశం అయితే నిజమని నమ్మవచ్చు. కానీ బహిరంగ ప్రకటన చేయటం వెనుక కాంగ్రెస్‌ను కకావికలం చేయటమే బీఆర్‌ఎస్‌ లక్ష్యంగా తెలుస్తోంది. కాంగ్రెస్‌ నాయకత్వంలో అభద్రతాభావాన్ని నెలకొల్పి సీట్ల కేటాయింపుల్లో తలనొప్పులు కలిగించేలా చేయటం, బీఆర్‌ఎస్‌ నుండి వచ్చిన నాయకులకు సీటు ఇవ్వకుండా చేయటం, కాంగ్రెస్‌లో ఉన్న నాయకులపై సందేహాలు కలిగేలా చేసి దెబ్బ కొట్టేలా ద్విముఖ వ్యూహానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ ఈ వ్యూహాన్ని ఎలా చేధిస్తోంది చూడాలి. ఎలా అయినా మరోసారి సిఎంగా కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావటం ఖాయంగా పావులు కదుపుతున్నారు.  


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !