Chandrababu Arrest Skill AP Case : అసలు కేసు ఏంటి ? చంద్రబాబుకు సంబంధం ఏంటి ?

0

 

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ గురించి ఒకటే చర్చ జరుగుతోంది. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర.. 14 ఏళ్ల పాటు ముఖ్య మంత్రి పదవి.. ప్రతిపక్ష నేతగా గుర్తింపు.. ఎన్నో అభివృద్ధి పథకాలతో మహిళలకు, నిరుపేదలకు, నిరుద్యోగులకు, వృద్దులకు ఇలా ఎంతోమందికి అనేక విధాలుగా సేవ చేసిన నాయకుడిని అర్ధరాత్రి హైడ్రామా నేపథ్యంలో అరెస్ట్‌ చేయడం యావత్‌ ప్రజానీకం తప్పుపడుతుంది. అసలు చంద్రబాబును ఎందుకు అరెస్ట్‌ చేశారు.. ? స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు చంద్రబాబుకు సంబంధం ఏంటి..? స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అంటే ఏంటి..? ఇందులో చంద్రబాబు ప్రమేయం ఎంత ఉంది..? ప్రభుత్వ ఆరోపణల్లో నిజం ఎంత..? అనేది ఒక్కసారి పరిశీలిద్దాం.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ ఏంటి ?

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్‌ సంస్థ, డిజైన్‌టెక్‌ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 10శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్‌ సంస్థ చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 10శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వం చెల్లించిన రూ.370 కోట్లలో రూ.240 కోట్ల రూపాయలను సీమెన్స్‌ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్‌ సంస్థకు బదలాయించారంటూ స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొండూరు అజయ్‌ రెడ్డి ఏపీ సీఐడీకీ ఫిర్యాదు చేశారు. దీంతో 2021 లోనే సిఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్‌గా వ్యవహరించిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎస్‌డీఈఐ కార్యదర్శికి ఓఎస్డీగా ఉన్న నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్‌, ఇతర అధికారులు, సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌, స్కిల్లర్‌, ఏఐసీ తదితర కంపెనీలకు చెందిన అప్పటి ఎండీలు, ఇతర ప్రతినిధులతో సహా మొత్తం 26 మందిపై సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. డిసెంబర్‌ 11, 2021న సీఐడీ గంటా సుబ్బారావును హైదరాబాద్‌ లో అరెస్ట్‌ చేశారు. దాదాపుగా ఇరవై రెండు నెలల తర్వాత ఇప్పుడు అదే కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేశారు.

స్కిల్‌ కేసులో సీఐడీ ప్రధానంగా ఆరోపణ ఏంటి అంటే..?

2014` 2019లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యూనివర్సిటీలు, ఇంజినీరింగ్‌ కాలేజీలు కలిపి మొత్తం 40 చోట్ల ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందుకోసం రూ.3,611.05 కోట్లతో సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ సంస్థలతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం కుదుర్చుకుంది. సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌ సంస్థ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద 90 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూర్చాలి. ఈ మేరకు 2017 జూన్‌ 30న జీవో 4ను టీడీపీ ప్రభుత్వం జారీ చేసింది. కానీ జీవో 4కు విరుద్ధంగా ఒప్పందం చేసుకునేలా ఏపీఎస్‌ఎస్‌డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎండీ సీఈవోగా ఉన్న గంటా సుబ్బారావు చక్రం తిప్పారని సీఐడీ ఆరోపించింది. రూ.100 స్టాంప్‌ పేపర్‌పై ఒప్పందం చేసుకున్నారు. అందులో తేదీ కూడా వేయలేదని సీఐడీ చెప్పుకొస్తుంది. రూ.3,611.05 కోట్ల విలువ మేరకు కాంట్రాక్టును ఎలా నిర్ధారించారన్నదీ కూడా లేదని సీఐడీ చెబుతోంది. సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌ సంస్థలు సమకూర్చాల్సిన 90 శాతం నిధులను ఏ విధంగా లెక్కించారన్నదీ చెప్పనే లేదు. సంబంధిత మొత్తం వేయాల్సిన చోట ఖాళీగా వదిలేశారని సీఐడీ ఆరోపిస్తుంది. జీవో ప్రకారం 90 శాతం నిధులు వెచ్చించాలన్న విషయాన్ని సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌ కంపెనీలు పట్టించుకోలేదు. అయినా సరే ప్రభుత్వం మాత్రం తన వాటాగా చెల్లించాల్సిన 10 శాతం నిధులను జీఎస్టీతో సహా మొత్తం రూ.371 కోట్లు చెల్లించేసింది. అసలు పనులు చేయకుండానే నిధులు ఎలా చెల్లిస్తారని అప్పటి ఆడిట్‌ అకౌంటెంట్‌ జనరల్‌ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించు కోలేదని సీఐడీ ఆరోపించింది.

చంద్రబాబుపై వైసీపీ సర్కార్‌ కుట్ర చేస్తోందని టీడీపీ ఆరోపణ 

స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ తరపున టీడీపీ హయాంలో 40కిపైగా నైపుణ్య అభివృద్ది కేంద్రాలు సిమెన్స్‌ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. దానికి ఎండీగా ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రేమ్‌ చంద్రారెడ్డి చెల్లింపులు చేశారు. అదే సమయలో రెండు కమిటీలు ఈ మొత్తాన్ని పర్యవేక్షించాయని.. ఆ కమిటీలకు ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐఏఎస్‌ అధికారులు అజయ్‌ జైన్‌, రావత్‌లు నేతృత్వం వహించారు. వారి సిఫార్సుల మేరకే అన్నీ జరిగాయి. స్కిల్‌ డెలవప్‌మెంట్‌ స్కాం పేరుతో సీఐడీ చెబుతున్న మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి నిధులు విడుదల చేసింది రిటైర్డ్‌ ఐఏఎస్‌ ప్రేమచంద్రారెడ్డి కాగా.. కేత్ర స్థాయిలో పర్యటనలు చేసి.. రిపోర్టులు ఇచ్చి.. ఒప్పందం చేసుకోవాలని సూచించింది ప్రస్తుతం సీఎంలో ఉన్న ఐఏఎస్‌ అధికారులు అజయ్‌ జైన్‌, షంషేర్‌ సింగ్‌ రావత్‌లు. సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో నిధులు మంజూరు చేసిన ఎండీ పేరు లేదని టీడీపీ చెబుతోంది. రెండు కీలక కమిటీల చేతుల మీదుగా ఈవ్యవహారాలు నడిచాయని.. ఆ కమిటీలకు సారధ్యం వహించిన ఐఏఎస్‌ల పేర్లూ లేవని టీడీపీ అంటుంది.

స్కిల్‌ కేసులో ఏ1గా చంద్రబాబును చేర్చిన సిఐడీ

స్కిల్‌ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు పేర్లను చేర్చింది సిఐడీ. చంద్రబాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, 34, 37 ఐపీసీ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు సీఐడీ పోలీసులు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 50(1) నోటీస్‌ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరెప్షన్‌ చట్టం కింద చంద్రబాబును శనివారం ఉదయం అరెస్ట్‌ చేశారు. అయితే ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠగా మారింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !