జూలై 14 రాత్రి చోటు చేసుకున్న ఘటన..
కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. జూలై 14న పశ్చిమ బెంగాల్ కి చెందిన రీతీ సాహా విశాఖపట్టణంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. విశాఖపట్టణంలోని నరసింహనగర్‌లోగల సాధనా హస్టల్‌లో రీతీసాహా ఉంటుంది. విశాఖలోని ఆకాష్ బైజూస్‌లో నీట్ కోచింగ్ తీసుకుంటూ ఆ కళాశాలకు అనుబంధంగా ఉన్న హస్టల్ భవనం నాలుగో అంతస్తుపై నుంచి పడి రీతీసాహా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రీతీసాహాను ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో ఆమె వైద్యానికి సహకరించలేదని, వేరే హాస్పిటల్‌కు మార్చినా ఉపయోగం లేకుండా పోయిందని ఆమె తల్లితండ్రులకు హాస్టల్ యాజమాన్యం ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళు వైజాగ్ వచ్చారు. కేసు విచారణలో విశాఖపట్టణం పోలీసుల తీరుపై మృతురాలి తండ్రి శుఖ్ దేవ్ అనుమానాలు వ్యక్తం చేశారు. తన కూతురును రూంలో హత్య చేసి మిద్దెపై నుంచి తోసేశారని, ఆమె 10.30కి టెర్రస్ పైకి వెళ్తే 9.30 కే మిద్దె పై నుంచి దూకినట్టు సీసీ ఫుటేజ్ ఉందని, ఇవి అన్నీ విశాఖ పోలీసులు పట్టించుకోలేదని తండ్రి ఆరోపిస్తున్నారు. అదే సమయంలో హస్టల్ భవనంపైకి వెళ్లే సమయంలో ఓ డ్రస్, భవనంపై నుండి కిందకు పడే సమయంలో మరో డ్రెస్ ఉందని, అసలు టెర్రస్ పైకి వెళ్ళింది రీతీసాహానే కాదని తండ్రి వాదన. ఈ విషయంపై విద్యార్థిని తల్లిదండ్రులు బెంగాల్ సీఎం మమత బెనర్జీకి ఫిర్యాదు చేశారు. బెంగాల్ సీఎం ఆదేశం మేరకు కల్‌కత్తాలో కేసు నమోదైంది. దీంతో బెంగాల్ పోలీసులు విశాఖపట్టణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న విచారణలో కలకత్తా పోలీసులు ఎలాంటి నిర్ణయానికి వస్తారోనన్న చర్చ ప్రస్తుతం పెద్ద ఎత్తున నడుస్తోంది.
అరెస్టుల పర్వం !
రీతి సాహ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. సీఐడి పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో అరెస్టుల పర్వం మొదలయింది. బెంగాల్ విద్యార్థిని మృతి కేసులో ఇప్పటి వరకు నలుగురి పోలీసులు అరెస్ట్ చేశారు. సాధన హాస్టల్ కు చెందిన ఇద్దరు, ఆకాష్ బైజుస్ యాజమాన్యానికి చెందిన ఇద్దరు అరెస్ట్ అయ్యారు. సాధన హాస్టల్ ఓనర్ లక్ష్మీ, వార్డెన్ కుమారి.. ఆకాష్ బైజూస్ కాలేజీ మేనేజర్ సూర్యకాంత్, అసిస్టెంట్ మేనేజర్ రామేశ్వర్‌ను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగానే రీతి సాహ చనిపోయినట్టు విశాఖ పోలీసులు నిర్ధారించారు. వెంకటరామ, కేర్ హాస్పిటల్ లలో సీఐడీ దర్యాప్తు కొనసాగుతుంది. వీరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గత నాలుగు రోజుల నుంచి విశాఖలోనే సీఐడి, బెంగాల్ పోలీసులు మకాం వేశారు.