ఏపీ హేట్స్ జగన్ ( AP Hates Jagan ) పుస్తకావిష్కరణ ( Book Launch ) కార్యక్రమాన్ని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu ) శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ‘వద్దు జగన్.. నిన్ను ఇక మేము భరించలేమని’ ముక్త కంఠంతో ప్రతిఒక్కరూ మాట్లాడుతున్నారని అన్నారు. అలా ప్రజలు మాట్లాడుతున్నారంటే.. జగన్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని అన్నారు. ఎక్కడ సమావేశాలు పెట్టిన అబద్దాలే తప్ప.. వాస్తవాలు మాట్లాడిన సందర్భాలు లేవన్నారు. నాసిరకం మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారని, నాసిరకం మద్యంతో 35 లక్షల మంది రోగాల బారిన పడ్డారని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదా తెచ్చారా ?
ఉచిత ఇసుక రద్దుతో కార్మికులు ఉపాధి కోల్పోయారని, రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం రూ.64 వేల కోట్లు పడిరదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలన్నీ నెరవేర్చానని సీఎం జగన్ చెబుతున్నారని, అధికారంలో రాగానే సీపీఎస్ రద్దు చేస్తామన్నారు.. చేశారా?.. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు.. ఇస్తున్నారా?.. 25 మంది ఎంపీలనిస్తే ప్రత్యేక హోదా తెస్తానన్నారు.. తెచ్చారా?.. పోలవరం పూర్తిచేస్తానన్నారు.. చేశారా?.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? అని అచ్చెన్నాయుడు తనదైన శైలిలో ప్రశ్నించారు. సీఎం జగన్ మూడు రాజధానుల నాటకమాడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. ప్రకృతి వనరుల్ని కబళించడానికే రుషికొండపై ప్యాలెస్ నిర్మించుకుంటున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణంపై విమర్శలు చేసిన మంత్రి బొత్స... నేడు రుషికొండపై జగన్ నిర్మిస్తున్న ప్యాలెస్‌పై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలు సరైన సమయంలో కర్రుకాల్చి వాతపెడతారన్నారు. 40 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నా కోర్టులు ఎందుకు వైసీపీ ప్రభుత్వాన్ని... ప్రభుత్వ అధీనంలోని విచారణా సంస్థల్ని ప్రశ్నించడంలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు.