తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడిరది. శుక్రవారం స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు విచారణకు రాగా.. తదుపరి విచారణను వచ్చే మంగళవారం (అక్టోబర్17) మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడిరది.
ముకుల్ రోహత్గి వాదనలు...
ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలన్న అంశంపై ఎంసీ గుప్తా కేసును రోహత్గీ ప్రస్తావించారు. ‘‘చట్టం అమలులో ఉన్నప్పుడు జరిగిన నేరాలకు పాత చట్టంలోని సెక్షన్స్ వర్తిస్తాయి. చట్టాన్ని రద్దు చేసినా.. వెనక్కి తీసుకున్నప్పటికీ నేరం జరిగినప్పటి చట్టమే వర్తిస్తుంది. కొత్త చట్టం అమలులోకి రాకముందే నేరం జరిగింది కాబట్టి సవరణ చట్టం ఈ కేసుకు వర్తించదు’’ అని రోహత్గి తెలిపారు.
మమ్మల్ని సర్కస్ ఆడిస్తున్నారు: లూథ్రా
చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా వాదిస్తూ.. ‘‘కేసులపై కేసులు పెట్టి మమ్మల్ని సర్కస్ ఆడిస్తున్నారు. స్కిల్ కేసు విచారణకు ఫైబర్‌నెట్ కేసుతో సంబంధం ఉంది. మరో కేసులో చంద్రబాబును 16న ప్రవేశపెట్టేందుకు వారంట్ తీసుకున్నారు. కేసులపై కేసులు పెట్టి మమ్మల్ని సర్కస్ ఆడిస్తున్నారు’’ అని అన్నారు. ఇక్కడ కూడా 17 ఏను ఛాలెంజ్ చేస్తున్నారా అని లూథ్రాను జస్టిస్ త్రివేది ప్రశ్నించగా. అవును.. 17ఏ ప్రతిచోటా వర్తిస్తుందని లూథ్రా తెలిపారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ తరువాత చేస్తామన్న ధర్మాసనం పేర్కొంది. 17 ఏ పూర్తి స్థాయి రక్షనేమీ కాదని... అది కేవలం చిన్న పాటి రక్షణే అని.. కేసుపెట్టే అధికారమే పోలీసులకు లేనప్పుడు కేసు ఎలా ఫైల్ చేస్తారని జస్టిస్ బోస్ ప్రశ్నించారు. అధికార విధులు నిర్వర్తించడమంటే అవినీతికి పాల్పడటం కాదు కదా అని ముకుల్ రోహత్గి తెలిపారు. అవినీతికి పాల్పడినప్పుడు చట్ట నిబంధనలు వర్తించవు కదా అని అన్నారు. అధికార విధుల నిర్వహణ ముసుగులో అవినీతికి పాల్పడే పరిస్థితి ఉండకూడదు కదా? అని ప్రభుత్వ తరపు న్యాయవాది ప్రశ్నించారు. చట్ట సవరణ తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని.. కేసు పాతదే అంటారు.. అంతేనా? అని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. చట్టసవరణ ముందు కేసు కాబట్టే 17ఏ వర్తించదని తన వాదన అని ముకుల్ రోహత్గి చెప్పుకొచ్చారు. 17ఏ అనేది పుట్టక ముందే నేరం జరిగింది కాబట్టి ఈ కేసుకు చట్టసవరణ వర్తించదని అన్నారు. 2018 జులైలో చట్టసవరణ జరిగిందని.. 2014, 2015 కేసులకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పరిగణించలేము కదా అని అన్నారు. నిధుల విడుదలకు సంబంధించిన నిర్ణయానికి తనకు సంభందం లేదన్న చంద్రబాబు 17ఏ వర్తింపజేయాలని కోరడం పరస్పర విరుద్ధమని ముకుల్ చెప్పుకొచ్చారు. తనకు సంబంధం లేదని చంద్రబాబు చెబుతున్నా తనే నిర్ణయం తీసుకున్నారని సీఐడీ ఆరోపిస్తుంది కదా.. అందుకే 17ఏ రక్షణను ఆయన కోరుతున్నారని జస్టిస్ బోస్ తెలిపారు. చంద్రబాబు నిర్ణయం తనే తీసుకున్నానని అంగీకరిస్తేనే 17ఏ వర్తిస్తుందని ముకుల్ వాదించారు. తనకు సంబంధం లేదని అంటూనే అధికార విధుల్లో భాగంగానే ఇదంతా చేసానని చంద్రబాబు ఎలా చెబుతారు అంటూ ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించారు.