- 20 మంది అధికారులపై వేటు..
- ఎన్నికల విధులకు దూరం
- వీరిలో నలుగురు కలెక్టర్లు.. ముగ్గురు పోలీసు కమిషనర్లు.. పది మంది ఎస్పీలు
- రవాణాశాఖ కార్యదర్శి, వాణిజ్య పన్నుల కమిషనర్, ఆబ్కారీ డైరెక్టర్‌లూ బాధ్యతల నుంచి తొలగింపు
రాష్ట్రంలో ఎన్నికల వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న 20 మంది అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. వారిలో నలుగురు కలెక్టర్లు, హైదరాబాద్ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, 10 మంది ఎస్పీలు, ఆబ్కారీశాఖ డైరెక్టర్, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్, రవాణాశాఖ కార్యదర్శి ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని స్పష్టం చేసింది. ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణలో పనితీరు సంతృప్తికరంగా లేకపోవటంతోనే ఆయా అధికారులను విధుల నుంచి తప్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి నాలుగు లేఖలను బుధవారం పంపించింది. ఈ చర్య అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులను విధులకు దూరం చేయటంతో మిగిలిన అధికారులకు హెచ్చరిక పంపినట్లు తెలుస్తోంది. షెడ్యూలు విడుదలకు సుమారు నెల రోజుల ముందు నుంచే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, ఇంటెలిజెన్స్ విభాగాలను కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దింపింది.
అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి !
రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు ఈ నెల 3 నుంచి మూడు రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, వివిధ విభాగాల అధికారులతో విస్తృత సమీక్షలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి తీసుకున్న చర్యలపై ఈ సందర్భంగా తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. వివిధ స్థాయిల్లో అధికారుల బదిలీలపైనా అసహనం వ్యక్తం చేశారు. 2018 ఎన్నికలు, ఆ తరవాత జరిగిన ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసినా అడ్డుకట్ట వేయకపోవడం ఆందోళన కలిగిస్తోందని మండిపడ్డారు. అక్రమంగా తరలిస్తున్న సొమ్మును పెద్దగా స్వాధీనం చేసుకోకపోవడాన్నీ ప్రస్తావించారు. ‘మీరు చెప్పే వివరాలపైనే మేం ఆధారపడటం లేదు. మా నివేదికలు మాకు ఉన్నాయి’ అంటూ పలు కీలక అంశాలపై అధికారులను గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు, ఉచితాలు ఎక్కడికి వెళ్లాల్సినవి అక్కడికి వెళ్తోంటే ఏం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. స్వాధీనాలకు సంబంధించి ఒకదశలో అధికారులు తెలిపిన గణాంకాల విషయంలో అసహనం వ్యక్తం చేయటం అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది.
ముగ్గురేసి అధికారుల జాబితా
రాష్ట్రంలోని అధికారులను తప్పించిన నేపథ్యంలో గురువారం సాయంత్రం 5 గంటల్లోగా ప్రత్యామ్నాయ అధికారుల జాబితాను పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఒక్కో అధికారి పోస్టును భర్తీ చేసేందుకు ముగ్గురేసి అధికారులతో జాబితా (ప్యానల్) రూపొందించి పంపించాలని స్పష్టం చేసింది. ఆయా అధికారులకు సంబంధించిన అయిదేళ్ల వార్షిక పనితీరు, విజిలెన్స్ నివేదికలనూ పంపాలని పేర్కొంది. ఈలోగా తప్పించిన అధికారుల తర్వాతి స్థానంలో ఉన్నవారికి తక్షణం బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. శాసనసభ ఎన్నికలు ముగిసే వరకు రాష్ట్రంలో ఒకేసారి ఇంత పెద్దసంఖ్యలో అధికారులను విధుల నుంచి తప్పించటం చాలా అరుదైన అంశమని ఎన్నికల వ్యవహారాలతో సంబంధం ఉన్న అధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు.
ఎన్నికలు ముగిసేంత వరకు బాధ్యతలు ఇవ్వొద్దు
వేటు పడిన 20 మంది అధికారులకు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసేంత వరకు ఎలాంటి బాధ్యతలు కేటాయించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ‘‘ఎన్నికల సన్నద్ధతపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆబ్కారీ, వాణిజ్య పన్నుల శాఖ అదనపు బాధ్యతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో మీరే నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఎన్నికల ప్రక్రియలో ఈ శాఖలు కీలకమైనవి. రోజువారీగా మద్యం స్వాధీనాలు, ఉచితాల విక్రయాలు తదితర అంశాలను పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆబ్కారీ, ఎక్సైజ్ శాఖలకు ముఖ్య కార్యదర్శులను నియమించండి’’ అని సీఎస్ శాంతికుమారికి రాసిన లేఖలో ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో 13 మంది ఐపీఎస్ అధికారులు తక్షణం ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని సీఎస్ శాంతికుమారి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు, వేటు పడిన పోలీస్ కమిషనర్లు, ఎస్పీల స్థానంలో తాత్కాలికంగా ఇన్‌ఛార్జులకు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను శాంతిభద్రతల అదనపు కమిషనర్ విక్రంసింగ్ మాన్‌కు.. వరంగల్ కమిషనర్ రంగనాథ్‌ను డీసీపీ మురళీధర్‌కు.. నిజామాబాద్ కమిషనర్ సత్యనారాయణను అదనపు డీసీపీ జయరామ్‌కు బాధ్యతలు అప్పగించాలని సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎస్పీలు.. ఆయా జిల్లాల అదనపు ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలన్నారు.